శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - Sep 26, 2020 , 02:08:43

రైతు సేవలో ‘సహకారం’

రైతు సేవలో ‘సహకారం’

  • n 3961 మందికి పీఏసీఎస్‌ల  ద్వారా సేవలు 
  • n రైతు శ్రేయస్సే లక్ష్యంగా ప్రణాళికలు
  • n సకాలంలో రుణాలు మంజూరు
  • n వాణిజ్య బ్యాంకులకు దీటుగా ఆన్‌లైన్‌ సేవలు 

చిలిపిచెడ్‌ : విత్తనాలు, ఎరువుల సరఫరాను మొదలుకొని వ్యవసాయానికి అవసరమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందించడంతో పాటు రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి వాటికి మద్దతు ధరను కల్పించే వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతన్నలకు విస్తృత సేవలు అందిస్తూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.సోమక్కపేట ప్రాథమిక వ్యవసా య సహకార సంఘం చిలిపిచెడ్‌ మండలానికి గాను 3961 మంది సభ్యులను కలిగి 807 మంది రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను అందిస్తున్నది. భవిష్యత్‌లో రైతులకు మరిన్ని సేవలు అందించడమే లక్ష్యంగా ఇటు నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు ఆటు అధికారులు  ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏటా వ్యాపార పరిధిని పెంచుకుంటూ రైతు సేవలో తనదైన ముద్ర వేసుకొని వాణిజ్య బ్యాంకులకు ధీటుగా నడుస్తున్నది.

సేవలు మరింత సులవుగా ..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేసి పారదర్శక సేవలను అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆన్‌లైన్‌ లావాదేవీలను ప్రవేశపెట్టింది. నూతనంగా ఎన్నికైన సంఘాల పాలకర్గ సభ్యులు రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. రైతులు దరఖాస్తూ చేసుకున్న వెంటనే రుణాలు మంజూరు చేసి వారికి ఆర్థిక చేయూతనివ్వడంలో సహకార సంఘాలు కీలకంగా పోషిస్తున్నవి.

సహకార సంఘం ద్వారా  ఎరువుల కేంద్రాలు..

సహకార సంఘం ద్వారా సోమక్కపేటలో, మండల కేంద్రమైన చిలిపిచెడ్‌లో రెండు ఎరువుల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు యూరియా 202.5 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 100 మెట్రిక్‌ టన్నులు తీసుకువచ్చారు. ఇప్పటి వరకు అమ్మకాలు జరగ్గా.. మిగిలిన ఎరువులు యూరియా 66 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 15 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంది.

పదోతరగతి విద్యార్థులకు నగదు అందజేత..

ఈ సహకార సంఘం పరిధిలోని ఉన్న 7 ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ స్థాయిలో వచ్చిన విద్యార్థులకు రూ.2వేలు, రూ.1000 నగదును అందజేస్తారు.

సహకార ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకు..

సహకార వ్యవసాయ పరపతి సంఘం ద్వారా రూ.27లక్షలతో శీలాంపల్లి గేటు సమీపంలో ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ పనులు నిర్మిస్తున్నారు. మండలం లోని రైతులకు, వాహనదారులకు పెట్రో, డీజిల్‌ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చొరవతో సహకార సంఘం ద్వారా నిర్మిస్తున్నారు. 

అంత్యక్రియలకు రూ.3వేల నగదు అందజేత..

సహకార సంఘంలో సభ్యత్వం ఉన్న రైతులు ఎలా చనిపోయిన వారి అంత్యక్రియలకు రూ.3వేల నగదు ఈ సంఘం ద్వారా అందజేస్తున్నారు. ఇప్పటి వరకు  48 మంది రైతులకు నగదు అందజేశారు.

రైతు శ్రేయస్సుకే అధిక ప్రాధాన్యం.. 

రైతు శ్రేయస్సుకే అధిక ప్రాధాన్యతనిస్తూ మా సహకార సంఘం ద్వారా సేవలు అందిస్తున్నాం.భవిష్యత్తులో రైతులకు అవసరమైన మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం.దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు అపరిమితంగా సకాలంలో రుణాలు మంజూరు చేస్తాం. ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మరింత ప్రోత్సాహకం అందిస్తున్నది.ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి చొరవతో సహకార సంఘం ద్వారా పెట్రోల్‌ బంకు ఏర్పాటు చేస్తున్నాం. 

-ధర్మారెడ్డి,  సహకార సంఘం చైర్మన్‌