శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Sep 25, 2020 , 02:28:36

సింగూరులో 20.500 టీఎంసీల నీరు

సింగూరులో 20.500 టీఎంసీల నీరు

పుల్కల్‌ : సింగూరు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. గురువారం 6 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20.500 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు. రెండేండ్ల తర్వాత ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి సింగూర్‌ ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీల నీటిని సాగుకు విడుదల చేస్తున్నారు. దీంతో అందోల్‌, పుల్కల్‌ మండలాల్లో రైతులు వరి సాగు చేస్తూ పుట్ల కొద్ది ధాన్యాన్ని పండిస్తున్నారు. 2017లో డిసెంబర్‌లో ఎస్సారెస్పీకి, నిజాంసాగర్‌కు 15 టీఎంసీల నీటిని విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టు ఖాళీ కావడంతో రెండేండ్ల నుంచి సాగుకు నీళ్లు ఇవ్వడం లేదు. ప్రాజెక్టులోకి గతేడాది చుక్కనీరు రాకపోవడంతో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ వానకాలం ప్రారంభం నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో ప్రారంభమై, సెప్టెంబర్‌ మొదటి వారం వరకు 3.5 టీఎంసీల నీరు చేరింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురియడంతో   ఈనెల 16 నుంచి ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. 16న 15,074 క్యూసెక్కులు, 17న 45,282 క్యూసెక్కులు, 18న 27,990 క్యూసెక్కులు, 19న 30,675 క్యూసెక్కులు, 20న 19,032 క్యూసెక్కులు, 21న 15,350 క్యూసెక్కులు, 22న 12,666 క్యూసెక్కులు, 23న 8,245 క్యూసెక్కులు, 24న 6,138 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టులోకి భారీగా జలాలు రావడంతో యాసంగి సాగుకు నీళ్లు ఇవ్వడానికి యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. యాసంగి సాగుకు నీరివ్వడానికి ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వ పెరగడంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయని రైతులు తెలిపారు. కాగా, ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో పర్యాటకులు తరలివస్తున్నారు.