బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Sep 23, 2020 , 01:57:18

పనులు ఆగె..!

పనులు ఆగె..!

  • కరోనాతో నిర్మాణ రంగం కుదేలు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నిర్మాణ రంగంపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. వివిధ రాష్ర్టాలకు చెందిన కార్మికులు కరోనాతో సొంత రాష్ర్టాలకు వెళ్లడంతో నిర్మాణ రంగం కుదేలైంది. దీంతో పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. వెళ్లిన కార్మికులు పూర్తిస్థాయిలో తిరిగి రాకపోవడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. సంగారెడ్డి జిల్లాలో కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్‌, కొల్లూరు, సంగారెడ్డి ప్రాంతాల్లో భారీస్థాయిలో భవనాలు, ఇతర నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బీహార్‌, ఒడిషా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందిన వారే నిర్మాణ రంగంలో కార్మికులుగా ఎక్కువగా పనిచేస్తున్నారు. కరోనా తీవ్రతతో కార్మికులంతా తమ సొంత రాష్ర్టాలకు వెళ్లారు. వెళ్లిన వారు పూర్తిస్థాయిలో తిరిగి రాకపోవడంతో నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 46వేల మంది వరకు ఇతర రాష్ర్టాల కార్మికులు ఉన్నట్లు లాక్‌డౌన్‌ సమయంలో అధికారులు గుర్తించారు. వీరిలో 30వేల మంది నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారు. కార్మికుల కొరత డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంపైనా ప్రభావాన్ని చూపింది. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులు తిరిగి వస్తారని నిర్మాణరంగ ప్రతినిధులు భావిస్తున్నారు. 

నిలిచిపోయిన నిర్మాణాలు..

పటాన్‌చెరు ప్రాంతం భారీస్థాయిలో నిర్మాణాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. అమీన్‌పూర్‌, రామచంద్రాపురం, కొల్లూరు, పటాన్‌చెరు, వెలిమెల ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. మార్చి వరకు వేగంగా కొనసాగిన నిర్మాణ పనులు, ఆ తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇతర రాష్ర్టాలకు చెందిన కార్మికులు వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఎల్‌అండ్‌టీ, డీఈసీ ఇన్‌ఫ్రా, మైహోం, ముప్పాహోమ్స్‌ ఇలా పెద్ద కంపెనీల నిర్మాణాలు ఈ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. కంది ఐఐటీ నిర్మాణ పనుల్లో 2500 వరకు ఇతర రాష్ర్టాల కార్మికులు పనిచేసేవారు. స్వరాష్ర్టాలకు వెళ్లిన కార్మికులు అందరూ ఇంకా తిరిగి రాలేదు. దీంతో తక్కువ మందితో పనులు కొనసాగుతున్నాయి. మైహోం, డీఈసీ సంస్థల్లో కూడా వేల మంది కార్మికులు పనిచేసేవారు. వారంతా ఇప్పుడు స్వరాష్ర్టాలకు వెళ్లి ఇంకా తిరిగి రాలేదు. దీంతో నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. 

30 వేల మంది నిర్మాణరంగంలో..

సంగారెడ్డి జిల్లాలో 30వేల మంది వరకు నిర్మాణ రంగంలోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా నేపథ్యం లో ఇతర రాష్ర్టాలకు చెందిన కార్మికులకు రూ.500 చొప్పున నగదు, 5 కిలోల బియ్యం అందించారు. ఈ క్రమంలోనే కార్మికుల లెక్కను అధికారులు పూర్తిస్థాయిలో సేకరించారు. కరోనాతో కార్మికులు వరుసకట్టి తమ రాష్ర్టాలకు వెళ్లిపోయారు. ఇంకా కరోనా పూర్తిగా పోకపోవడంతో కార్మికులు తిరిగిరావడానికి ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారు. 

ఊపిరిపీల్చుకున్న డీఈసీ ప్రతినిధులు..

ప్రభుత్వం కొల్లూరులో ప్రతిష్ఠాత్మకంగా 15,660 వరకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపట్టింది. డీఈసీ ఇన్‌ఫ్రా సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. మొదట 11వేల మంది ఇతర రాష్ర్టాల కార్మికులతో నిర్మాణ పనులు మొదలయ్యాయి. వేగంగా నిర్మాణాలు పూర్తిచేసే లక్ష్యంతో సంస్థ ఎక్కువ మంది కార్మికులను తీసుకున్నది. కరోనా ప్రభావంతో  కార్మికులు ఇండ్లకు పరిమితమయ్యారు. దీంతో ఉన్న 2వేల మంది కార్మికులతో పనులు పూర్తి చేయించారు. ప్రస్తుతం ఇండ్లు పేదలకు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాయి.  

డబుల్‌ బెడ్‌రూం ఇండ్లపై ప్రభావం..

జిల్లావ్యాప్తంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలపై ఇతర రాష్ర్టాల కార్మికుల కొరత ఉండదు. సంగారెడ్డి, జహీరాబాద్‌, సదాశివపేట, కంది వంటి ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న వాటిపై కొంత వరకు ప్రభావం చూపింది. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లే కాకుండా ఇతర అపార్ట్‌మెంట్లు, కార్పొరేట్‌ సంస్థల భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వీటి పనులు కూడా నత్తనడకన కొనసాగుతున్నాయి. పక్కనే ఉన్న అంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి కూడా ఇక్కడి నిర్మాణ పనుల్లో పెద్దసంఖ్యలో కార్మికులు పనిచేస్తుంటారు. అక్కడికి వెళ్లిన వారు కూడా పూర్తి స్థాయిలో తిరిగి రాలేదని సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. 

కార్మికులు వచ్చే వరకు ఇబ్బందే.. 

ఇతర రంగాలతో పోల్చితే కరోనా నిర్మాణరంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కరోనాతో కార్మికులంతా వారి సొంత రాష్ర్టాలకు వెళ్లిపోయారు. దీంతో నిర్మాణాల్లో వేగం తగ్గింది. కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్ద డబుల్‌ ఇండ్ల నిర్మాణ ప్రాజెక్టును మా సంస్థ తీసుకున్నది. కరోనాకు ముందే దాదాపుగా నిర్మాణాలు పూర్తయ్యాయి. 11 వేల మంది కార్మికులతో మొదట ఇక్కడ నిర్మాణాలు మొదలు పెట్టాం. ఆ సంఖ్య పూర్తయ్యేనాటికి 2 వేల మందికి చేరింది. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంపై కార్మికుల కొరత ప్రభావం పడలేదు. ముందుగా నిర్మాణాలు పూర్తికావడంతో అందరం సంతోషించాం.  

ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం 

కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రభు త్వం లాక్‌డౌన్‌ను విధించడంతో భవన నిర్మాణ కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో నిర్మాణ పనులు నడవక వ్యాపారం కుదేలైంది. అమ్మకాలు, కొనుగోళ్లు ఆగిపోయి అనేక నష్టాలను చవిచూస్తున్నాం. కార్మికులు లేక ఉన్న పనులు మధ్యలో ఆగిపోయాయి. దీంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. 

-ప్రసాద్‌, బిల్డర్‌, అమీన్‌పూర్‌. 

పనులకు వెళ్లాలంటే భయంగా ఉంది

తాపీమేస్త్రీగా హైదరాబాద్‌కు వచ్చి 25 ఏండ్లు అవుతున్నది. ఇంత ఇబ్బంది ఎన్నడూ ఎదురుకాలేదు. కరోనాతో పనులకు వెళ్లాలంటే భయంగా ఉంది. లాక్‌డౌన్‌తో పని ఆగిపోయింది. మేం స్వస్థలాలకు వెళ్లాల్సి వచ్చింది. వ్యాక్సిన్‌ వచ్చే వరకు పనులు చేయడం కష్టమే. 

-మాల్యాద్రి, మేస్త్రీ, అమీన్‌పూర్‌. 

కరోనా భయం వెంటాడుతున్నది.. 

కరోనా వైరస్‌కు భయపడి మా ఊరికి వెళ్లిపోయాం. తిరిగి రావాలంటే మా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. 20ఏండ్ల నుంచి నిర్మాణ పనులు చేసుకుని ఉపాధి పొందుతున్నాం. ఈసారి పనులు ఉన్నప్పటికీ చేయలేక కష్టాలకు గురవుతున్నాం. మా ప్రాంతంలో ఇంటి వద్దే ఉంటూ దొరికింది తింటూ బతుకుతున్నాం. 

-కృష్ణ, కార్మికుడు, అమీన్‌పూర్‌ logo