మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Sep 22, 2020 , 02:16:46

ముందస్తుగా వానాకాలం కొనుగోళ్లకు ప్రణాళికలు

ముందస్తుగా వానాకాలం కొనుగోళ్లకు ప్రణాళికలు

  • l అంచనాకు మించిన వరి సేద్యం
  • l 43,500 ఎకరాల అంచనాకు 74వేల ఎకరాల్లో సాగు
  • l ఆ మేరకు కొనుగోళ్లకు అధికారుల ఏర్పాట్లు
  • l నవంబరు నెలాఖరు నుంచి  కేంద్రాలకు వడ్లు వచ్చే అవకాశం
  • l 1.48 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా
  • l కేంద్రాలకు 1.20 లక్షల టన్నులు  వస్తాయని భావన
  • l జిల్లాలోని 26 కేంద్రాల్లో  107 కేంద్రాల ఏర్పాటు
  • l బియ్యం నూర్పిడికి 47 రైస్‌మిల్లుల గుర్తింపు
  • l అందుబాటులో 22 లక్షల గోనె సంచులు

(సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ) వానకాలం పంటల దిగుబడులను అంచనా వేస్తున్న అధికారులు కొనుగోళ్లకు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్రాలు, గోనె సంచులు, తూకం యంత్రాలు, తేమ శాతం కొలిచే సాధనాలను అందుబాటులో ఉంచుకునేలా చర్యలు చేపట్టారు. ఈ వానకాలంలో సంగారెడ్డి జిల్లాలో 43,500 ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా, 74,045 ఎకరాల్లో వరి సాగైంది. జిల్లాలో 1.48 లక్షల టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసి, ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు 107 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లకు ఇబ్బంది లేకుండా చూస్తామని, గతంలో మాదిరిగానే ఆన్‌లైన్‌ ద్వారా రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తామన్నారు.

107 వడ్ల కొనుగోలు కేంద్రాలు...

సంగారెడ్డి జిల్లాలో 107 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 43,500 ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేయగా, 74,045 ఎకరాల్లో వరి సాగైంది. అంచనాలకు మించి 30 వేల ఎకరాల్లో అదనంగా వరిసాగైంది. నియంత్రిత సాగు విధానంలో భాగంగా సర్కారు సూచనల మేరకు రైతులు సాగైన మొత్తంగా 50 శాతం వరకు సన్నాలు సాగు చేశారు. అదనంగా వరి సాగైన నేపథ్యంలో ఆ మేరకు కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. పీఏసీఎస్‌, మార్క్‌ఫెడ్‌ల ద్వారా 42 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 65 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సాగైన పంట లెక్కన 1.48 లక్షల టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. రైతులు తమ అవసరాలకు 29 వేల టన్నుల వడ్లను వినియోగించుకున్నా 1.20 లక్షల టన్నుల వరకు కేంద్రాలకు వచ్చే అవకాశమున్నది.

29 లక్షల గోనె సంచులు అవసరం...

వడ్ల సేకరణకు 29 లక్షల గోనె సంచులు అవసరముంటాయని అధికారులు అంచనా వేశారు. కేంద్రాల ద్వారా సేకరించిన వడ్లను నూర్పిడి చేయడానికి జిల్లాలో 32 రా రైస్‌, మరో 15 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులను గుర్తించారు. బియాన్ని ప్రభుత్వ గోదాములకు తరలించనున్నారు. ఇప్పటికే 22 లక్షల వరకు సంచులు సిద్ధంగా ఉన్నాయి. మిగతావి రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం సంచులను తిరిగి ఇవ్వాలని, ఒక్కో సంచికి రూ.18 చెల్లించనున్నట్లు ఇటీవల జరిగిన సమీక్షలో అధికారులు సూచించారు. నవంబర్‌ చివరి వారం నుంచి కేంద్రాలకు వడ్లు వచ్చే అవకాశమున్నది. రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులు ఆదేశించారు. 

రైతులకు ఇబ్బందులు రానివ్వం

వడ్ల కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బందులు రానివ్వం. ఈ క్రమంలోనే ముందస్తుగా ఏర్పాట్లపై దృష్టి సారించాం. 30వేల ఎకరాల్లో అధికంగా వరిసాగైన క్రమంలో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. గోనె సంచుల కొరత ఉంటే డీలర్లు తిరిగి ఇవ్వాలని ఇటీవల సూచించాం. తిరిగి సంచులు ఇస్తున్న డీలర్లకు ఒక్కో సంచికి రూ.18 ఇస్తున్నాం. కేంద్రాల్లో తేమ శాతం కొలిచే సాధనాలు, కాంటాలు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచుతున్నాం. వడ్లు అమ్మిన 72 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. గత వానకాలం 75 వేల టన్నుల వడ్లు కేంద్రాలకు వచ్చాయి. ఈ సారి 1.20 లక్షల టన్నుల వరకు వడ్లు రానున్నట్లు అంచనా వేస్తున్నాం.

- వీరారెడ్డి, అదనపు కలెక్టర్‌


logo