బుధవారం 28 అక్టోబర్ 2020
Sangareddy - Sep 22, 2020 , 02:16:57

ఉప్పొంగుతున్న వాగులు, చెరువులు

ఉప్పొంగుతున్న  వాగులు, చెరువులు

  • మత్తడి దూకుతున్న చెరువు, చెక్‌డ్యామ్‌లు
  • తాడూరు, చిట్యాల, దానంపల్లి గ్రామాలకు   రాకపోకలు బంద్‌

నంగునూరు/ సిద్దిపేట రూరల్‌ :  ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి మండలంలోని వాగులు, చెరువులు, కుంటలు ఉప్పొంగుతున్నాయి. నంగునూరు మండల పరిధిలోని అక్కెనపల్లి, ఖాతా, ఘనపూర్‌, దర్గపల్లి చెక్‌డ్యాంలతో పాటు మండలంలోని చాలా చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పలు గ్రామాల్లో బ్రిడ్జిలపై నుంచి నీళ్లు ప్రవహిస్తుండడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. భారీ వర్షంతో పాటు పిడుగులు పడి పశువులు మృతి చెందాయి. అలాగే సిద్దిపేట రూరల్‌ మండలంలోని రాఘవాపూర్‌ పెద్ద చెరువుతో పాటు పుల్లూరు గ్రామంలోని వెంకటాయ చెరువు నిండి అలుగు పారుతున్నాయి. చాలా రోజుల తరువాత ఇన్ని నీళ్లు వచ్చాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చేర్యాల ప్రాంతంలో భారీ వర్షం  

చేర్యాల : చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో చేర్యాల మండలంలోని ఆకునూరు, గుర్జకుంట, దొమ్మాట, తాడూరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతోపాటు ఆకునూరు వాగులో ఉన్న చెక్‌డ్యామ్‌ మత్తడి పడుతున్నది. మండలంలోని తాడూరు గ్రామ వాగు లోలెవల్‌ బ్రిడ్జి మీదుగా ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుండటంతో మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే చిట్యాల కింది చెరువు మత్తడి దూకుతుండడంతో చిట్యాల, దానంపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చేర్యాల పట్టణానికి అత్యవసర పనుల నిమిత్తం వచ్చే చిట్యాల, తాడూరు ప్రజలు కొండపాక మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామం మీదుగా, దానంపల్లి గ్రామస్తులు మద్దూరు మండలంలోని కమాయపల్లి, అర్జునపట్ల, చేర్యాల మండలంలోని దొమ్మాట గ్రామాల మీదుగా 20 కిలో మీటర్లు చుట్టూ తిరిగి చేర్యాలకు చేరుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు నిండుకుండలా మారిపోయాయి. దీనికి తోడుగా నిత్యం వర్షం కురుస్తుండడంతో ఆయా గ్రామాల చెరువులు, చెక్‌డ్యామ్‌లు మత్తడి పడుతుండటంతో వాటిని చూసేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు.logo