మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Sep 20, 2020 , 03:03:30

నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష

 నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష

  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 

మద్దూరు: రాష్ర్టానికి నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతోందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తాజ్‌మహల్‌ గార్డెన్‌లో ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డితో కలిసి 119 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు, 63 మంది రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఖజానాకు రాష్ట్రం తరఫున వివిధ పన్నుల రూపంలో రూ.లక్షా 50వేల కోట్లు జమ చేస్తే.. కేంద్రం రాష్ర్టానికి కేటాయించింది రూ.35 వేల కోట్లు మాత్రమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి తీరని అన్యాయం చేస్తున్నా బీజేపీ నాయకులు మాత్రం తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుల విమర్శలను తిప్పికొడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్‌ మీడియా ఇన్‌చార్జిలతోపాటు యూత్‌ కమిటీలను నియమిస్తామన్నారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్‌ నరేందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మంద యాదగిరి, పీఏసీఎస్‌ చైర్మన్‌ నాగిళ్ల తిరుపతిరెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఇర్రి రాజిరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రెవెన్యూ అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


logo