శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Sep 17, 2020 , 02:53:07

రూ. కోట్లలో అవినీతి

రూ. కోట్లలో అవినీతి

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రెవెన్యూ శాఖలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలపై ఉమ్మడి జిల్లా ప్రజానీకం ఆసక్తిగా గమనిస్తున్నది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడంతో ఓ వైపు ప్రజలు సంబురాలు చేసుకుంటుండగా రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారులు అవినీతి, అక్రమాల్లో పట్టబడుతుండడం చర్చకు దారితీస్తున్నది. ఒకవైపు ఒక్కొక్కటిగా అవినీతి కేసులు బయటపడుతుండడం మరో వైపు కొత్త రెవెన్యూ చట్టం రావడంపై మంచి నిర్ణయం తీసుకున్నారని సీఎం కేసీఆర్‌ను జనం అభినందిస్తున్నారు. భూమికి ఎన్వోసీ ఇచ్చే వ్యవహారంలో మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌తో పాటు నర్సాపూర్‌ ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్‌ అబ్దుల్‌ సత్తార్‌తో పాటు మరో ఇద్దరు అరెస్ట్‌ కాగా ఇప్పుడు జిన్నారంలో మాజీ సైనికులకు భూ కేటాయింపు విషయంలో అక్రమాలకు పాల్పడిన అప్పటి జిన్నారం తహసీల్దార్‌, ప్రస్తుత కామారెడ్డి ఆర్డీవో నరేందర్‌, మెదక్‌ డిప్యూటీ తహసీల్దార్‌ నారాయణలు సస్పెండ్‌ కావడం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సంచలనం సృష్టించింది. వారంరోజుల్లో భారీ స్థాయిలో రెండు రెవెన్యూ అవినీతి కేసులు బయటపడడంపై అన్నివర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఇంత అవినీతి జరుగుతున్నది కాబట్టే సీఎం కేసీఆర్‌ కొత్త చట్టాన్ని తెచ్చారని జనం మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి మెదక్‌ జిల్లా రెవెన్యూ శాఖలో వాతావరణం ఒక్కసారిగా సైలెన్స్‌ అయ్యింది. 

కొత్త చట్టంపై సంబురాలు...

సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడంతో ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. అవినీతికి కేంద్రమైన వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టంలో వివిధ మార్పులు చేశారు. రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే మ్యూటేషన్‌ కూడా జరిగిపోతున్నది. వ్యవసాయ భూములను తహసీల్దార్లు, వ్యవసాయేతర భూముల రిజిష్ర్టేషన్ల బాధ్యతను సబ్‌రిజిస్ట్రార్లకు అప్పగించిన విషయం తెలిసిందే. కాగా ప్రతి అంగులం భూమిని డిజిటల్‌ సర్వే చేసి, ఆ వివరాలను ధరణీలో పొందు పరచనున్నారు. ఎక్కడికక్కడ రైతులు, అన్నివర్గాల వారు సీఎం కేసీఆర్‌ చిత్ర పటాలకు క్షీర, ధాన్యాభిషేకాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో ఉన్న బూజు పట్టిన చట్టాలకు సీఎం కేసీఆర్‌ కొత్త రూపు తెస్తున్నారంటూ రాజకీయ పార్టీల నాయకులు, అధికార వర్గాలు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

రెవెన్యూ అధికారుల అవినీతిపై ఆగ్రహం...

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని రెవెన్యూ వ్యవస్థలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త రెవెన్యూ చట్టం రావడంపై ఇదే రెవెన్యూ శాఖలోని అన్ని వర్గాల  నుంచి హర్షం వ్యక్తమవుతోంది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసినప్పటికీ వారికి ఇతర శాఖల్లో అవకాశం కల్పిస్తామని, అలాగే వీఏవోలకు కూడా పే స్కేల్‌ వర్తింప చేస్తామని సర్కారు ప్రకటన చేయడంతో వారు సంతోషంగా ఉన్నాయి. అయితే ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వరుసగా వెలుగులోకి వస్తున్న రెవెన్యూ అవినీతి, అక్రమాలపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నర్సాపూర్‌ మండలం చిప్పల్‌తుర్తి గ్రామంలోని 112 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇవ్వడానికి అధికారులు లంచం తీసుకోవడాన్ని  తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికారులా..? లంచగొండులా అంటూ ఎవరికి వారు రెవెన్యూ అధికారులపై నిప్పులు చెరుగుతున్నారు. ఇదిలా ఉండగానే జిన్నారం మండలం ఖాజీపల్లిలో అక్రమ భూ కేటాయింపు కేసు వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. వారం రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లాని మెదక్‌, సంగారెడ్డి జిల్లాలో రెండు ప్రధాన కేసులు వెలుగు చూడడం గమనార్హం.

ఉన్నతాధికారులు కటకటాల్లోకి...

ఊహించని విధంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రెవెన్యూకు సంబంధించి ఉన్నతాధికారులు కటకటాల్లోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. రూ.1.12 కోట్ల అవినీతి వ్యవహారంలో మెదక్‌ అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, నర్సాపూర్‌ ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్‌ అబ్దుల్‌ సత్తార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ వహీంలతో పాటు ఇతరులు అరెస్ట్‌ కాగా, ప్రస్తుతం కటకటాల్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నలుగురిపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. ఉన్నత స్థానంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఈ స్థాయిలో కోట్లలో అవినీతికి పాల్పడడం రాష్ట్రంలో సంచలనం సృష్టించగా ఆతడితో పాటు అందులో భాగస్వాములైన మిగతా వారు కూడా జైలు పాలయ్యారు. కాగా వీరిని విచారణకు అనుమతించాలని ఏసీబీ అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు వారిని విచారణకు అనుమతి ఇస్తారనే అంశం కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది.

తాజాగా ఆర్డీవో, డిప్యూటీ తహసీల్దార్‌...

ఓ వైపు మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అవినీతి బాగోతం కొనసాగుతున్న తరుణంలోనే మరో ఆర్డీవో, డిప్యూటీ తహసీల్దార్‌, ఇతర రెవెన్యూ సిబ్బంది అవినీతిలో ఇరుక్కోవడం సంగారెడ్డి జిల్లాలో చర్చనీయాంశమైంది. గతంలో జిన్నారం తహసీల్దార్‌గా పనిచేసిన నరేందర్‌, డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసిన నారాయణతోపాటు ఇతరులు అవినీతి వ్యవహారంలో సస్పెండ్‌ కావడం చర్చకు దారితీసింది. రూ.80 కోట్ల విలువచేసే భూమిని వీరు అక్రమంగా ఇతరులకు పట్టా చేసి ఇచ్చినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. జిన్నారం మండలం ఖాజీపల్లిలో 181 సర్వే నెంబర్‌లో నలుగురు మాజీ సైనికులకు నరేందర్‌తోపాటు నారాయణ, వీఆర్వో, ఇతర సిబ్బంది అక్రమాలకు పాల్పడి ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున భూమిని కేటాయించినట్లు రికార్డులు సృష్టించారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అక్రమాలకు పాల్పడిన వారిని సస్పెం డ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నరేందర్‌ ప్రస్తు తం కామారెడ్డి ఆర్డీవోగా పనిచేస్తుండగా, నారాయణ మెదక్‌ కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఖాజీపల్లి వీఆర్వో ఇప్పటికే పదవీ విరమణ పొం దారు. మిగతా వారు విధుల్లో ఉన్నారు. ముందస్తు బెయిల్‌ కోసం ఆర్డ్డీవో నరేందర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ నారాయణ ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.