శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Sep 17, 2020 , 02:53:08

పైలట్‌ ప్రాజెక్ట్‌గా గుమ్మడిదల

పైలట్‌ ప్రాజెక్ట్‌గా  గుమ్మడిదల

  • n జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌  గ్రామాలుగా గుమ్మడిదల, ఎద్దుమైలారం,  తెల్వాల్‌ తండా
  • n వెల్లడించిన జిల్లా అదనపు  కలెక్టర్‌ వీరారెడ్డి

గుమ్మడిదల: వ్యవసాయ, వ్యవసాయేతర భూములను సర్వే చేయడానికి జిల్లాలో మూడు గ్రామాలను ఎల్‌ఆర్‌ఎస్‌ పైలట్‌ ప్రాజెక్ట్‌ గ్రామాలుగా ఎంపిక చేసినట్లు అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి తెలిపారు.బుధవారం మండల కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, డీఎల్‌పీవో సతీశ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో మండలంలోని అన్ని గ్రామాల జీపీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రికార్డులను కమిషనర్‌ పంచాయతీరాజ్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చడానికి, ఈ పంచాయతీలుగా మార్చడానికి జిల్లాలో మూడు గ్రామాలను పైలట్‌ గ్రామాలుగా ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. పటాన్‌చెరు మండలంలో ఎద్దుమైలారం, హత్నూర మండలంలోని తెల్వాల్‌ తండా, గుమ్మడిదల మండలంలోని గుమ్మడిదల గ్రామాలను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో పంచాయతీ అధికారి తన సిబ్బందితో సర్వే నిర్వహించాలన్నారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ భూముల్లో, వ్యవసాయేతర భూముల్లో నిర్మించిన ఇంటి నిర్మాణాలు, పరిశ్రమల, ఫామ్‌హౌస్‌లు, డెయిరీపాం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారాలు తదితర వివరాలను సేకరించాలని సూచించారు. సర్వేలో పరిశ్రమ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల, ఇండ్ల యజమాని పేరు, ఆధార్‌ నంబర్‌, ఇంటి నంబర్‌ సేకరించి కంప్యూటరీకరణ చేయాలని సూచించారు. గతంలో ఉన్న వారి వివరాలు, ప్రస్తుతం ఉన్నవారు, కొనుగోలు అమ్మకాలు జరిగిన వివరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. ఏమైనా భూ సమస్యలు, వివాదాల సమస్యలను సేకరించాల్సి ఉంటుందన్నారు. సేకరించిన వివరాలను కమిషనర్‌ పంచాయతీరాజ్‌ వైబ్‌సైట్‌లో పొందుపరుచాలన్నారు. నివేదికలో ఉన్న సమస్యలను పైఅధికారులకు నివేదించి, పైలట్‌ సమస్యలను పరిష్కరించనున్నట్లు అదనపు కలెక్టర్‌ తెలిపారు. ఆయన వెంట ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఎం పీవో శ్రీనివాస్‌రావు, సర్పంచ్‌ చిమ్ముల నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్‌ మొగులయ్య ఉన్నారు. గుమ్మడిదలలో పంచాయతీ కార్యదర్శులు బృందాలుగా ఏర్పడి సర్వే నిర్వహిస్తున్నారు.  


logo