గురువారం 29 అక్టోబర్ 2020
Sangareddy - Sep 16, 2020 , 03:10:59

రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలి

రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలి

  • సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు

అందోల్‌ : రైతువేదికల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు సూచించారు. మంగళవారం రాత్రి వట్‌పల్లి, దేవునూర్‌ గ్రామాల్లో నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. సాగుకు సాయం చేయడంతోపాటు రైతుబీమా సౌకర్యాన్ని కల్పించిందన్నారు.   అన్నిచోట్ల రైతువేదికల నిర్మాణాలు పూర్తి కావొస్తున్నాయని, ఇక్కడ కూడా పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కలెక్టర్‌ రాత్రి సమయంలో అభివృద్ధి పనులను పరిశీలించడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టగా, కలెక్టర్‌కు విధులపై ఉన్న శ్రద్ధను జనం అభినందించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ గంగాధర్‌, ఎంపీడీవో గీత, ఎంపీవో యూసుఫ్‌ తదితరులు ఉన్నారు. 

మునిపల్లి మండలంలో...

మునిపల్లి : మండలంలో రైతు వేదికల నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని పెద్దచెల్మెడ, లోనికలాన్‌ గ్రామాల్లో  రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. రైతు వేదికలు, శ్మశానవాటిక నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దన్నారు.   పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటాలన్నారు. కలెక్టర్‌ వెంట అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఉన్నారు. 


logo