మంగళవారం 27 అక్టోబర్ 2020
Sangareddy - Sep 14, 2020 , 00:02:01

చకచక రైతు వేదిక

చకచక రైతు వేదిక

రైతును రాజు చేయడమే లక్ష్యంగా సర్కారు ముందుకు సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను నిర్మిస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో 116 రైతు వేదికల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. కలెక్టర్‌ హనుమంతరావు రోజూవారీగా సమీక్షిస్తుండడంతో పనులు ఊపందుకున్నాయి. మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు అధికారులతో నిర్మాణాల పురోగతిపై చర్చిస్తుండగా, వేదికలు అందంగా ముస్తాబవుతున్నాయి. - సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రైతు వేదికలు రెడీ అవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో వేగంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కలెక్టర్‌ హనుమంతరావు రోజువారీగా సమీక్షిస్తుండడంతో పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు అధికారులతో నిర్మాణాల పురోగతిపై చర్చిస్తున్నారు. జిల్లాలో 116 అగ్రిక్లస్టర్లు ఉండగా, అన్నిచోట్ల వేదికల నిర్మాణాలు జరుగుతున్నా యి. వ్యవసాయశాఖ నుంచి రూ.12 లక్షలు, ఉపాధి హామీ నిధుల నుంచి రూ.10 లక్షలు మొత్తం రూ.22 లక్షలతో వీటి నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే చాలాచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు అధికంగా డబ్బులు వెచ్చించి అధునాతన సౌకర్యాలతో దగ్గరుండి నిర్మాణం చేపడుతున్నారు. హత్నూర మండలం కాసాలలో రైతు వేదిక నిర్మాణం పూర్తయ్యింది. ఎకరానికి పైగా స్థలంలో వేదిక నిర్మించారు. చుట్టూ గోడలకు పెయింటింగ్‌ వేయించారు. వేదిక ముందు భాగంలో రైతు బొమ్మలతో కూడిన నిర్మాణం ఆకట్టుకుంటున్నది. రూ.5 లక్షల వరకు ఇందుకే ఖర్చు అయినట్లు చెబుతున్నారు. మీటింగ్‌హాల్‌, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)కు గది, అలాగే మరో గది ఉన్నాయి. పటాన్‌చెరు మండలం లక్డారంతో పాటు మరో పది గ్రామా ల్లో నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు 50 వరకు నిర్మాణాలు పూర్తి కావచ్చే దశకు చేరుతాయని, నెలాఖరు వరకు దాదాపుగా అన్ని నిర్మాణాలు పూర్తి చేయించేలా పనిచేస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి నర్సింహరావు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో వెల్లడించారు. 


logo