ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Sep 12, 2020 , 03:08:55

ఆమోదానందం..

ఆమోదానందం..

  • n శాసన సభలో రెవెన్యూ కొత్త చట్టం ఆమోదంపై సర్వత్రా సంబురాలు
  • n ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ చిత్ర పటాలకు క్షీరాభిషేకాలు
  • n పటాకులు కాల్చి, స్వీట్లు పంచిన నాయకులు, రైతులు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : రెవెన్యూ నూతన చట్టానికి శాసనసభ ఆమోదం తెలుపడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఊరురా సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకాలు నిర్వహించి, పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న భూ సమస్యలు కొత్త రెవెన్యూ చట్టంతో పరిష్కారమవుతాయని రైతులు సంబరపడుతున్నారు. బిల్లును ఈ నెల 9న శాసనసభలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టగా, శుక్రవారం సుదీర్ఘంగా చర్చించారు. శాసనసభలో చట్టం ఆమోదం తెలుపగానే అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం విప్లవాత్మకమైనదని పలువురు పేర్కొన్నారు. ఇవాళ సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన కొత్త చట్టంతో రైతుల కండ్లల్లో ఆనందం నెలకొంది. కొత్త చట్టం రావడంతో భూసమస్యలు చెక్‌ పడనుంది. సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాలోని అయా మండల కేంద్రాలతో పాటు ప్రధాన గ్రామాల్లో రైతులు పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు.

పారదర్శకంగా రెవెన్యూ సేవలు..

సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టంతో ఇకమీదట పారదర్శకమైన సేవలు అందుతాయి. రికార్డుల గోల్‌మాల్‌, లంచాలు, పైరవీలకు తావులేకుండా ప్రజలందరికీ న్యాయమైన సేవలు అందించేలా చట్టం ఉంది. భూ సమస్యలకు చెక్‌ పడనున్నాయి. ఎవరి భూమి ఎంతో పక్కాగా ధరణి యాప్‌లో ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తుండ్రు. సీఎం కేసీఆర్‌ మంచి నిర్ణయం తీసుకుని ప్రజలకు న్యాయం చేస్తుండ్రు.

- మాజీ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పుష్పానగేశ్‌, ఆర్సీపురం

సీఎం కేసీఆర్‌ సార్‌ పేరు నిలుపుతాం

వీఆర్‌ఏలు గ్రామాల్లో నిజాం కాలం నుంచి పనిచేస్తున్నారు. గ్రామాల్లో 30 రకాల పనులు చేస్తున్న మమ్మల్ని ఎవరూ గుర్తించలె. పనిచేస్తున్నా ఎవరు పట్టించుకోలేదు. వీఆర్‌ఏలకు సీఎం కేసీఆర్‌ సరార్‌ ఉద్యోగులుగా గుర్తించడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌ సార్‌ మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ప్రభుత్వం మా కుటుంబాలకు రక్షణ కల్పించింది. కడుపునిండా తిండి పెడుతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రజలకు మరింత సేవలందించే సర్కార్‌కు మంచి పేరు తెస్తాం. 

-దత్తు, వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు జహీరాబాద్‌ 

కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు, పేదలకు మేలు కలుగుతుంది

సీఎం కేసీఆర్‌ కొత్తగా ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టంతో పేదలు, రైతులకు ఎంతో మేలు కలుగుతోంది. రైతులు తమ భూములను అమ్మినా, కొన్నా సులభంగా పాసు పుస్తకంలో మార్చుకోవచ్చు. కొత్త రెవెన్యూ చట్టంతో తహసీల్దార్‌కు రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉంది. భూమిని కొన్న వెంటనే రిజిస్ట్రేషన్‌ ఆదే రోజు మ్యుటేషన్‌ పూర్తవుతోంది. అమ్మిన వారి పాసుపుస్తకం మార్చేసి ఆ భూమిని కొన్న వారి పాసుపుస్తకంలో వివరాలు నమోదు చేస్తారు. ఇదంతా ఒక్కరోజునే పూర్తి కావడం సంతోషంగా ఉంది.  

-శ్రీనివాస్‌రెడ్డి, న్యాయవాది, జహీరాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు


logo