మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Sep 11, 2020 , 03:05:19

రెవెన్యూ యంత్రాంగంలో వణుకు

రెవెన్యూ యంత్రాంగంలో వణుకు

  • లోతుగా విచారిస్తున్న ఏసీబీ అధికారులు
  • n తెరపైకి మెదక్‌ రిటైర్డ్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి పేరు
  • n ఉద్యోగ విరమణకు ఒక రోజు ముందు ఎన్వోసీ ఫైల్‌పై సంతకాలు..!
  • n అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్న ఏసీబీ 
  • n మెదక్‌ అదనపు కలెక్టర్‌ ఇంట్లో 24గంటల పాటు సాగిన సోదాలు
  • n సేల్‌ అగ్రిమెంట్‌ పత్రాలు, ఖాళీ చెక్కులు స్వాధీనం
  • n అదనపు కలెక్టర్‌ నగేశ్‌ను హైదరాబాద్‌కు తరలింపు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/మెదక్‌ : అవినీతి వ్యవహారంలో అదనపు కలెక్టర్‌తో పాటు ఆర్డీవో, మరో ముగ్గురు అరెస్ట్‌ కావడం ఉమ్మడి మెదక్‌ జిల్లా రెవెన్యూ యంత్రాంగంలో కలకలం సృష్టించింది. ఏసీబీ దాడులు జరగడం ఒక్కసారిగా ఆ శాఖ సిబ్బందిలో వణుకు పుట్టించిందని చెప్పుకోవచ్చు. నర్సాపూర్‌ ఆర్డీవో అరుణారెడ్డి ఇంట్లో రూ.28 లక్షల నగదు, అర కిలో వరకు బంగారం లభించిన విషయం తెలిసిందే. రెవెన్యూ శాఖలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత జనాగ్రహానికి గురిచేసిందని చెప్పుకోవచ్చు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో పాటు కొత్త రెవెన్యూ చట్టంపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ విధి విధానాలను ప్రకటిస్తుండగానే, భారీస్థాయి అవినీతి వెలుగు చూడడం గమనార్హం. కాగా, ఈ కేసులో మెదక్‌ రిటైర్ట్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి పేరు బయటకు వస్తుండగా, మరోవైపు ఇంకా ఎవరెవరి పాత్రలు వెలుగులోకి రానున్నాయోనని మెదక్‌ జిల్లా రెవెన్యూ అధికారుల్లో వణుకు మొదలైంది. దీంతో పాటు మరిన్ని అవినీతి, అక్రమాలు కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కలెక్టర్‌ ధర్మారెడ్డి ఉద్యోగ విరమణ పొందగానే అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఆగడాలు పెరిగినట్లు ఆ శాఖ సిబ్బంది నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

తెరపైకి రిటైర్డ్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి పేరు... 

ఈ అవినీతి వ్యవహారంలో మెదక్‌ రిటైర్డ్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఉద్యోగ విరమణకు ఒక రోజు ముందు ఈ ఎన్వోసీ ఫైలుపై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన జూలై 31న ఉద్యోగ విరమణ పొందారు. ధర్మారెడ్డి పాత్రపై అధికారులు లోతుగా విచారిస్తున్నారు. కలెక్టర్‌ ధర్మారెడ్డితో మాట్లాడి మీ పని చేయిస్తానని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ భూ యజమాని లింగమూర్తి నుంచి ఎకరాకు లక్ష చొప్పున రూ.1.12 కోట్ల డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ అవినీతి వ్యవహారంలో రిటైర్డ్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి పాత్రపై లోతుగా విచారిస్తున్నామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇదే వ్యవహారంలో వీఆర్వోలు, వీఆర్‌ఏల పాత్ర ఏ మేరకు ఉన్నదనే అంశంలో కూడా విచారణ చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణరావు చెప్పారు.

24 గంటల పాటు తనిఖీలు...

అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు 24 గంటల పాటు కొనసాగడం గమనార్హం. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఇంట్లో బుధవారం ఉదయం మొదలైన సోదాలు, గురువారం 10 గంటల వరకు కొనసాగాయి. నగేశ్‌ ఇంటితో పాటు కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులు తనిఖీలు చేశారు. అర్ధరాత్రి వరకు ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు, అక్కడే నిద్రించి తిరిగి ఉదయం మళ్లీ సోదాలు మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నగేశ్‌ ఇంట్లో దొరికిన లక్ష రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాధితుల నుంచి తీసుకున్న ఎనిమిది బ్లాంక్‌ చెక్కులు, తన బినామీ జీవన్‌గౌడ్‌పై చేసిన సేల్‌ అగ్రిమెంట్‌ డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రోజంతా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఇంట్లో సోదాలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం... 

రూ.1.12 కోట్ల అవినీతి వ్యవహారంలో మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఇంటి నుంచి ఏసీబీ అధికారులు విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌ను ఏసీబీ అధికారులు మెదక్‌ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. రూ.కోటి అవినీతి వ్యవహారాన్ని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ స్వయంగా డీల్‌ చేయడం అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది. అదనపు కలెక్టర్‌ స్థాయి అధికారి ఇంత బరితెగించి లంచాన్ని డీల్‌ చేయడం, నేరుగా తన బినామీ పేరున భూమిని సేల్‌ అగ్రిమెంట్‌ చేయించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వీడియో, ఆడియో టేపుల్లో అదనపు కలెక్టర్‌ నగేశ్‌ స్వయంగా డబ్బుల విషయమై మాట్లాడటం మీడియాలో చూస్తూ జనం ఆగ్రహిస్తున్నారు. 

నర్సాపూర్‌ ఆర్డీవోను విచారించిన ఏసీబీ

నర్సాపూర్‌ రూరల్‌ : మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేశ్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన కేసులో నర్సాపూర్‌ ఆర్డీవో అరుణారెడ్డి హస్తం ఉందని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు ఆమె ఇంటిలో సోదాలు చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో అరుణారెడ్డిపై విచారణను చేపట్టి, గురువారం ఉదయం 9 గంటల వరకు కొనసాగించారు. అనంతరం ఆర్డీవోను వారి వెంట హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోని ఆర్డీవో నివాసంలో పెద్ద మొత్తంలో నగదు, బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంకా ఎలాంటి అవినీతి బాగోతాలు బయటపడుతాయోనని డివిజన్‌ స్థాయి ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. logo