శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Sep 07, 2020 , 23:42:04

నేటి నుంచి రిజిస్ట్రేషన్లు బంద్‌

 నేటి నుంచి రిజిస్ట్రేషన్లు బంద్‌

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : భూముల రిజిస్ట్రేషన్లు మంగళవారం నుంచి నిలిచిపోనున్నాయి. ఉన్న పలంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వీఆర్వో వ్యవస్థ రద్దు నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మొత్తం 16 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉన్నాయి.  సిద్దిపేట జిల్లాలో జగదేవ్‌పూర్‌, దుబ్బాక, సిద్దిపేట, సిద్దిపేట రూరల్‌, చేర్యాల, హుస్నాబాద్‌, గజ్వేల్‌ పట్టణాల్లో రిజిస్ట్రేషన్‌ ఆఫీసులు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో జోగిపేట, నారాయణఖేడ్‌, సదాశివపేట, జహీరాబాద్‌, సంగారెడ్డిలో కార్యాలయాలు ఉన్నాయి. మెదక్‌ జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, తూప్రాన్‌లో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం 16 కార్యాలయాల్లో ఆగస్టు నెలలో 11,500 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఒక్కో కార్యాలయంలో నెలకు 300 నుంచి 400 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.  ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు పనిచేయవని ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్‌ రమేశ్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.