శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Sep 07, 2020 , 23:42:06

మొక్కలనే స్నేహితులుగా పెంచుకున్న విద్యార్థులు

మొక్కలనే స్నేహితులుగా  పెంచుకున్న  విద్యార్థులు

  • ఆహ్లాదకరంగా కాసులాబాద్‌ ప్రభుత్వ పాఠశాల

ఆ బడి పచ్చదనానికి చిరునామా.., అక్కడి ప్రాంగణంలోకి అడుగుపెట్టారంటే పచ్చని చెట్లే స్వాగతం పలుకుతున్నట్లు కనిపిస్తాయి.. అడుగడుగునా వివిధ రకాల చెట్లతో ఆవరణ ప్రశాంతతకు నిలయంగా మారింది. మిరుదొడ్డి మండల పరిధిలోని కాసులాబాద్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరిత హారం కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి మొక్కలు నాటి సంరక్షించారు. ప్రస్తుతం పాఠశాల ప్రాంగణంలోని పరిసరాలు పచ్చదనంతో హరితశోభితంగా దర్శనమిస్తున్నాయి. - మిరుదొడ్డి

 మండల పరిధిలోని కాసులాబాద్‌ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ  తరగతి వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, 8 మంది ఉపాధ్యాయులు ఆయా సబెక్టుల్లో బోధన చేస్తున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న హరితహారం పథకంలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల ఆవరణలో మూడు ఏండ్ల కిందటి నుంచి ప్రతి ఏటా మొక్కలను నాటి, సంరక్షిస్తున్నారు. 

మొక్కలే స్నేహితులుగా..

పాఠశాల ఆవరణలో హరితహారం పథకంలో వివిధ రకాలైన సుమారు 5 వందల మొక్కలను నాటారు. పాఠశాల ఆవరణలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని హెచ్‌ఎం జోగు ప్రభుదాస్‌, ఉపాధ్యాయులందరూ కలిసి విద్యార్థులకు ఒక్కొక్కరికీ 7 మొక్కల చొప్పున కేటాయించి సంరక్షణ బాధ్యలు అప్పగించారు. దీంతో విద్యార్థులు మొక్కలను కంటికి రెప్పలాగా వారి స్నేహతులుగా పెంచారు. ప్రస్తుతం పాఠశాల ఆవరణలో ఎక్కడ చూసినా పచ్చదనం పరిడవిల్లుతున్నది. 

ఆదర్శంగా జడ్పీ పాఠశాల

విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తుల కృషితో పాఠశాల ఆవరణలో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలతో గ్రామంలోని పాఠశాల పచ్చదనంలో ఆదర్శంగా నిలుస్తున్నది.