మంగళవారం 27 అక్టోబర్ 2020
Sangareddy - Sep 07, 2020 , 01:44:00

అక్రమ రవాణాకు రాచమార్గం హైవే 65..!

అక్రమ రవాణాకు రాచమార్గం హైవే 65..!

  • n విశాఖ నుంచి వయా జహీరాబాద్‌ మీదుగా ముంబయి, కర్ణాటకకు స్మగ్లింగ్‌
  • n పర్యాటకం ముసుగులో అక్రమ రవాణా
  • n సరిహద్దులో నిఘా కరువు 
  • n పట్టుబడుతున్న గంజాయి  
  • n చెలరేగిపోతున్న అంతర్రాష్ట్ర ముఠాలు

జహీరాబాద్‌: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మీదుగా వెళ్తున్న 65వ నంబర్‌ జాతీయ రహదారి గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. స్మగ్లర్లు ఈ దారి గుండా ముం బయికి జోరుగా గంజాయి రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ మన్యం నుంచి గంజాయిని రవాణా చేసేందుకు 65వ జాతీయ రహదారిని స్మగ్లర్లు రాచమార్గంగా వినియోగించుకుంటున్నారు. ఝరాసంగం, జహీరాబాద్‌, మొగుడంపల్లి, కోహీర్‌ మండలాలకు చెందిన కొందరు గంజాయి స్మగ్లర్లు, విశాఖ మన్యం నుంచి కార్లు, ఇతర వాహనాల్లో గంజాయిని తరలిస్తున్నారు. ఈనెల 3న జహీరాబాద్‌ మండలంలోని హుగ్గెల్లి శివారులో జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, పోలీసులను తప్పించే ప్రయత్నం చేస్తుండగా స్మగ్లర్లను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. గంజాయి స్మగ్లింగ్‌ చేసే ముఠాకు చెందిన వారు జహీరాబాద్‌ మండలంలోని హుగ్గెల్లి తండా, శేకాపూర్‌ తండాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 70 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్‌లో రూ. 2.10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈనెల 4న ఝరాసంగం మండలంలోని చిలేపల్లితండాకు చెందిన గంజాయి స్మగ్లింగ్‌ ముఠా విశాఖ మన్యం నుంచి బొలెరో వాహనంలో 850 కిలోల గంజాయి తీసుకు వస్తుండగా, హత్నూర మండలం దౌల్తాబాద్‌ చౌరస్తా వద్ద ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయి విలువ మార్కెట్‌లో రూ.1.50 కోట్లు ఉంటుందని ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. జహీరాబాద్‌ ప్రాంతానికి చెందిన కొం దరు గంజాయి అక్రమ రవాణాను దందాగా చేసుకొని స్మగ్లింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జహీరాబాద్‌కు కర్ణాటక, మహారాష్ర్టలు సరిహద్దుగా ఉండడం స్మగ్లర్లకు కలిసి వస్తున్నది. అక్రమ రవాణాను నివారించేందుకు జాతీయ రహదారి-65పై ఎక్సైజ్‌ చెక్‌పోస్టు ఏర్పాటు చేసినా, అక్కడ తనిఖీలు చేయడంలేదు. అక్రమంగా గంజాయి తరలిస్తున్నా, ఎక్సైజ్‌ పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గంజాయి అక్రమ రవాణాను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సివిల్‌ పోలీసు ప్రత్యేక బృందాలు దాడిచేసి పట్టుకుంటున్నాయి. గంజాయి అక్రమ రవాణా స్థానిక ఎక్సైజ్‌, సివిల్‌ పోలీసులకు తెలియదా అనే ఆరోపణలు ఉన్నాయి.  

జాతీయ రహదారి రాచబాట... 

విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని స్మగర్లు కార్లలో జహీరాబాద్‌ ప్రాంతానికి తీసుకువచ్చి నిల్వ చేసి, మహారాష్ర్ట గంజాయి స్మగ్లింగ్‌ ముఠాలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జహీరాబాద్‌ సబ్‌ డివిజన్‌లో పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులకు ప్రతినెలా మామూళ్లు ఇచ్చి, గంజాయి అక్రమ దందా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జహీరాబాద్‌లో గంజాయి అక్రమ రహణాపై పోలీసు, ఎక్సైజ్‌ అధికారులు దృష్టి ఎక్కువగా లేకపోవడంతో జోరుగా స్మగ్లింగ్‌ సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. సరిహద్దులో నిఘా ఎక్కువగా ఉన్న సమయంలో గంజాయిని విశాఖ నుంచి తీసుకువచ్చి వ్యవసాయ పొలాల వద్ద నిల్వ చేస్తున్నారు. సమయం చూసి అమ్మకాలు చేస్తున్నారనే సమాచారం. స్మగ్లర్లు ఎండు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి కర్ణాటక, మహారాష్ర్టాలకు తరలిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న శీలావతి రకం గంజాయిని తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నారని ఎక్సైజ్‌ పోలీసులు తెలుపుతున్నారు. గంజాయిలో ఇది అత్యంత నాణ్యమైనదిగా ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. గంజాయిని స్మగ్లర్లు చిన్న బ్యాగులు, చిన్న సంచుల్లో నింపి రవాణా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, అరకు కొండల్లో నుంచి గంజాయిని కొనుగోలు చేసి తీసుకు వస్తున్నట్లు గంజాయి తరలిస్తున్న నిందితులు పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. 

పర్యాటకం ముసుగులో స్మగ్లింగ్‌ ... 

గంజాయి స్మగ్లర్లు పర్యాటకం ముసుగులో కార్లు, జీపులు, టూరిస్టు బస్సులు, గూడ్స్‌ వాహనల్లో గంజాయిని రవాణా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జహీరాబాద్‌ మండలంలోని చెరాగ్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ఎక్సైజ్‌ శాఖ చెక్‌పోస్టు ఉన్నా, అక్కడ ఎలాంటి తనిఖీలు చేయడం లేదు. ఈ చెక్‌పోస్టు వద్ద కర్ణాటక, మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే ట్యాంకర్లను తనిఖీ చేస్తారు. కానీ కార్లు, జీపులు మాత్రం తనిఖీ చేయడం లేదు. గంజాయిని స్మగ్లర్లు పగలు కూడా దర్జాగా కారులో తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జహీరాబాద్‌ ముఠా గంజాయిని తరలిస్తూ రెండుచోట్లు పట్టపగలు పట్టుబడడం విశేషం.


logo