శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Sep 07, 2020 , 01:44:01

జీవ వైవిధ్యానికి నెలవుగా మారిన మెతుకు సీమ

జీవ వైవిధ్యానికి నెలవుగా మారిన మెతుకు సీమ

  • n నీటి వనరుల వద్ద దేశవిదేశీ పక్షుల సందడి
  • n అమీన్‌పూర్‌ చెరువు వద్ద సైబీరియన్‌ పక్షులు.. 
  • n పొలాల వెంట నెమళ్ల నాట్యాలు..జింకల పరుగులు
  • n అటవీ ప్రాంతాల్లో నక్కల అరుపులు 
  • n చెరువుల వద్ద పక్షలు కిలకిలరావాలు 
  • n జలకళ సంతరించుకున్న  నీటి వనరులు 
  • n పచ్చని పంటలతో పల్లెలు కళకళ
  • n ఆహ్లాదకరంగా పోచారం అభయారణ్యం, నర్సాపూర్‌ అటవీ ప్రాంతం
  • n సింగూరు, మంజీర ప్రాజెక్టు వద్ద తీరొక్క జీవజాలం 
  • n మైమరిచిపోతున్న ప్రకృతి ప్రేమికులు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ మెదక్‌: దేశానికి పట్టెడన్నం పెట్టి మెతుకుసీమగా చరిత్రకెక్కిన ఉమ్మడి మెదక్‌ జిల్లాకు మళ్లీ ఆ రోజులొస్తున్నాయి. కరువుతో అల్లాడి బీడు భూములతో మోడువారిన పల్లెల్లో పచ్చని వాతావరణం నెలకొంటున్నది. తాళాలు వేసిన ఇండ్లతో జనం విడిసిన పల్లెల్లో ఇప్పుడు పాతకాలపు సందడి మొదలైంది. రచ్చబండలపై  అన్నదాతల ముచ్చట్లు, ఊరి పొలిమేరల్లో పక్షలు కిలకిలరావాలు వినిపిస్తున్నాయి. ఎటు చూసినా సాగుపనుల్లో నిమగ్నమైన రైతులు కనిపిస్తున్నారు. ఆ అన్నదాతల పక్కనే  పచ్చిక మేస్తున్న పశువులు, ఆ పశువులపై కూర్చున్న కొంగలు, రకరకాల పక్షలు దర్శనమిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విదంగా ఉమ్మడి మెదక్‌ ఈ వానకాలంలో దాదాపుగా 15 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుకావడమే ఇందుకు నిదర్శనం. ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువులు, కుంటల వద్ద చేపలు పడుతున్న దృశ్యాలు, ఆ చేపల వేటకు వచ్చిన వివిధ రకాల పక్షులతో అక్కడ సందడి నెలకొంటున్నది. రైతులు విత్తనాలు వేస్తుంటే ఆ విత్తనాలను ఏరుకోవడానికి నెమళ్లు, పక్షులు, కొంగలు, కాకులు గుంపులుగా వస్తున్నాయి. నక్కల అరుపులు, పక్షుల కిలకిలరావాలతో పల్లెలకు పూర్వవైభవం వచ్చినట్లు కనిపిస్తున్నది. గుంపులు, గుంపులుగా నెమళ్లు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఇండ్ల గోడలపైకి చేరుకుంటున్నాయి. పంట పొలాల మీదుగా జింకలు  పరుగులు పెడుతుండగా, కుందేళ్లు కళ్ల ముందునుంచే పంటపొల్లాలోకి వెళ్లిపోతున్నాయి. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లోని పల్లెలకు పూర్వవైభవం వస్తున్నది. మెదక్‌ జిల్లాలోని పోచారం అభయారణ్యం, నర్సాపూర్‌ అటవీ ప్రాంతాలు అహ్లాదరకంగా మారాయి. రకరకాల జంతువులు, పక్షులకు ఇవి నిలయంగా మారాయి. ఇటీవలే పోచారం ప్రాజెక్టు నిండడంతో పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలో నిర్మించిన ఫారెస్ట్‌ అర్బన్‌ పార్కు కొత్త అందాలను తీసుకువచ్చింది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు, మంజీర ప్రాజెక్టుల వద్ద పశుపక్ష్యాదులతో రోజూ సందడి నెలకొంటున్నది. వాటిని చూడడానికి వచ్చిన వివిధ ప్రాంతాల పర్యటకులతో కళకళలాడుతున్నది. మంజీరా నెమళ్ల సంరక్షణ కేంద్రం ఆకట్టుకుంటున్నది. సిద్దిపేట జిల్లాలో రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. ఆయా రిజర్వాయర్ల వద్ద వివిధ రకాల పక్షలు వస్తున్నాయి. ఇటీవలే చేపపిల్లలను ప్రాజెక్టుల్లోకి వదిలారు. దీంతో ఆయా ప్రాంతాలకు వివిధ రకాల పక్షలు రాక మరింత పెరగనున్నది. ఇవే కాకుండా రిజర్వాయర్ల నుంచి చెరువు, కుంటల్లోకి నీళ్లు వదులుతున్నారు. వాటిలో చేపలు పెంచుతున్నారు. చేపల పెంపకంతో పక్షల సంఖ్య పెరుగుతున్నది. ఎప్పుడో కనుమరుగైన ఊర పిచ్చుకలు గ్రామాల్లో మళ్లీ దర్శనమిస్తున్నాయి. అమీన్‌పూర్‌ పెద్ద చెరువు వద్ద వివిధ దేశాల నుంచి వచ్చిన పక్షలు  కనువిందు చేస్తున్నాయి. ఎక్కడా చూసినా జీవవైవిధ్యం తొణికిసలాడుతున్నది. 

జీవ వైవిధ్యానికి నెలవు మెతుకు సీమ

విశాలమైన అటవీ ప్రాంతం, పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, కోనలు, పర్యావరణ ప్రతిబింబానికి చిహ్నం. అడవి మాటున సంరక్షణ పొందుతున్న పక్షులు, జంతువుల జీవ వైవిధ్యానికి నెలవైన ప్రాంతం పోచారం అభయారణ్యం. ఒక్కోచోట ఒక్కో వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన జంతుజాతులు, పశుపక్ష్యాదులు ఉంటాయి. అవి ఆయా ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడతాయి. అలాంటి ప్రాంతాల్లో మెదక్‌ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే ఆధ్యాత్మికత ప్రదేశాలకు కేరాఫ్‌గా నిలిచిన మెదక్‌ జిల్లా, ఇప్పుడు జీవ వైవిధ్యానికి నిలయంగా మారింది. హరితహారం, మిషన్‌ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు జీవజాతుల మనుగడకు దోహదపడ్డాయి. ఫలితంగా అడవుల్లో జంతువులు, పక్షులు.. చెరువుల్లో చేపలు.. దారుల వెంట దట్టంగా పరుచుకున్న పచ్చదనంతో జిల్లాలోని మారుమూల పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. జిల్లాలోని ఘనపూర్‌, పోచారం ఆనకట్టల పరిసర ప్రాంతాలకు సైబీరియన్‌ కొంగలు వలసవచ్చి కనువిందు చేస్తున్నాయి. పోచారం అభయారణ్యంలో జింకపిల్లల గంతులు, సర్ధన నల్లగుట్ట, రాయిన్‌పల్లి, చిన్నశంకరంపేట, నర్సాపూర్‌ అడవుల పరిసర ప్రాంతాల్లో పురివిప్పి నాట్యం చేస్తున్న నెమళ్ల హోయలు, దారి వెంట కనిపించే కుందేళ్లు, వివిధ అడవి జంతువులు, పక్షులతో మెదక్‌ జిల్లా ఇప్పుడు అద్భుతమైన జీవ వైవిధ్యంతో అలరారుతున్నది. 

పశుపక్ష్యాదులతో అలరారుతున్న వైనం... 

మెదక్‌ జిల్లాలో ఒకప్పుడు అనేకమైన అటవీ ప్రాంతాలు ఉండేవి. సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం, వైల్డ్‌ లైఫ్‌ వారి అసమర్ధతతో జిల్లాలో అనేక అడవులతో పాటు, జీవజాతులు, పక్షులు అంతరించాయి. స్వరాష్ట్రం తెలంగాణ సిద్ధించాక అడవులను కాపాడుకోవడమే కాకుండా పచ్చదనం పెంచేందుకు హరితహారం లాంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. దీంతో జిల్లాలో మరోమారు జీవ వైవిధ్యం కనిపిస్తోంది. వివిధ జాతుల వన్యప్రాణులు, క్రిమికీటకాలు, పక్షులు తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి. జింకలు, కుందేళ్లు, నెమళ్లు, కొండముచ్చులు, కోతులు తదితర ఎన్నో జంతువుల సంచారంతో పాటు పక్షుల కిలకిలరావాలతో గడిచిన ఐదేండ్లలో అడవుల అందం మరింత పెరిగింది. వేసవిలో వివిధ రకాల వన్యప్రాణులు, పక్షులు నీటి కుంటలు, చెరువుల వద్దకు వచ్చి దాహార్తిని తీర్చుకున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. మెదక్‌ జిల్లాలో 57,623.424 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి.ఏటా హరితహారంలో విరివిగా మొక్కలు నాటుతున్నారు. ఇప్పటి వరకు లక్షలాదిగా మొక్కలు నాటడంతో అడవుల్లో పచ్చదనం మరింత పెరిగింది. దీనికి తోడు జీర్ణావస్థకు చేరిన చెరువులు సైతం ‘మిషన్‌ కాకతీయ’లో బాగుపడ్డాయి. వర్షాలు సైతం సమృద్ధిగా పడటంతో ఎక్కడ చూసినా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం అర్బన్‌ పార్కులను ఏర్పాటు చేస్తోంది. ఈ చర్యలతో జిల్లాలో జీవ వైవిధ్యం తొణికిసలాడుతున్నది. 

సైబీరియన్‌ పక్షుల సందడి...

విదేశీ పక్షలకు ఉమ్మడి మెదక్‌ జిల్లా అతిథ్యమిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఈ ప్రాంతానికి విదేశీ పక్షులు నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో వలస వస్తున్నాయి. వనదుర్గా ప్రాజెక్టు (ఘనపురం), పోచారం ప్రాజెక్టుల ప్రాంతంలో సైబీరియన్‌ కొంగలు సందడి చేస్తున్నాయి. ఖండాలు దాటి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి వస్తున్నాయి. నీటి అలలపై తేలియాడుతూ.. ఆహారంగా చేప పిల్లలను వేటాడే దృశ్యాలు స్థానికులను కనువిందు చేస్తున్నాయి. వీటిని తిలకించేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పోచారం అభయారణ్యంలో జింకలు, నెమళ్లతో పాటు ఎన్నో రకాల జీవరాశులు దర్శనమిస్తున్నాయి.logo