గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Sep 06, 2020 , 02:35:54

దేశీ వంగడమే మేలని..

దేశీ వంగడమే మేలని..

  • n ఇబ్రహీంపూర్‌లో  21 రకాల దేశీ వంగడాల క్షేత్రం  
  • n తన పొలంలో సాగుచేస్తున్న  రైతు నగేశ్‌ 
  • n దేశీ వంగడాల పంటలతో ఆరోగ్యానికి మేలు
  • n ఆసక్తి చూపుతున్న  రైతులు 

నారాయణరావుపేట: సీఎం కేసీఆర్‌, మం త్రి హరీశ్‌రావుల పిలుపు మేరకు సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టిసారిస్తున్నారు. దేశీ వరి విత్తనాలను పరిరక్షించడమే కాకుండా ప్రజారోగ్యమే ధ్యేయంగా మంత్రి హరీశ్‌రావు దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్‌లో రైతు నగేశ్‌ తన ఎకరం పొలంలో 21 రకాల దేశీయ వరి వంగడాల ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయశాఖ, ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో 21రకాల దేశీవాళీ వరి వంగడాల ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ వంగడాల ద్వారా భూసారం దెబ్బతినకుండా, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించవచ్చని అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 

క్షేత్రంలో ఏర్పాటు చేసిన వరి వంగడాలు.. 

కరీంగనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం సీతారాంపల్లి గ్రామం నుంచి ఈ విత్తనాలు ఇబ్రహీంపూర్‌ గ్రామానికి తెప్పించారు. సేకరించిన దేశీ వరి వంగడాల్లో 1) నారాయణ కామి ని 2)ఇల్లష్‌సాంబ 3) రత్నజోడి 4)కూలకర్‌ 5) మాలవ్‌ సుందరి 6) రెడ్‌ జాస్మిన్‌ 7) సన్నజాజులు 8)కాలాబట్టి 9)దాడిగ 10) నవారి రైస్‌ 11) చింతచారి సన్నాలు 12)పరమాల సన్నాలు 13) కామనిబోగ్‌ 14) పంచరత్న 15)రవికంద 16) మైసూర్‌ మళ్లిక 17)కారిరెక్కలు 18)పసిడి వెరైటీ 19) బాస్‌బోగ్‌ 20)తులసీబానో 21)గావి వంగడాలు ఉన్నాయి.

మార్కెట్‌లో మంచి డిమాండ్‌   

మైసూర్‌ మళ్లిక, కాలాబట్టి, ఇల్లష్‌సాంబ, నారాయణ కామిని వంటి దేశీ వంగడాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. మార్కెట్‌లో వీటి ధర కిలోకు రూ.200 ఉంది. బ్లాక్‌రైస్‌, పంచరత్న, తులసీబానో, కామినిబోగ్‌ వంటి దేశీ వంగడాలు మార్కెట్‌లో రూ.100 ధర ఉంది. ఇవి పండించిన రైతులకు మంచి డిమాండ్‌ ఉందని శాస్త్రవేత్తలు, అధికారులు తెలియజేస్తున్నారు. 

దేశీ వంగడాలతో  అనేక ప్రయోజనాలు... 

దేశీయ వంగడాల ద్వారా పండించిన ధాన్యం తినడం ద్వారా మనిషికి ఆరోగ్యం చేకూరుతుంది. పిల్లల్లో అధిక పోషకాలు, ప్రోటీన్స్‌తో పాటు రోగనిరోధక శక్తిని ఇవి పెంపొందిస్తాయి. శరీర పుష్టికి, శరీరానికి మంచి బలాన్ని ఇవ్వడంలో దేశీ వంగడాలు చాలా తోడ్పడతాయి. పూర్వకాలంలో సైనికులకు ఇలాంటి ఆహారాన్నే ఇచ్చేవారు. వీటిని సాగు చేయడం ద్వారా భూ సారం దెబ్బతినకుండా ఉంటుంది. మంచి లవణాలు భూమి లో ఉంటాయి. నవారి రైస్‌ తినడం ద్వారా షుగర్‌ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితం ఉం టుంది. ఈ విత్తనం కేరళ ఆయుర్వేదానికి సం బంధించినది. మోకాళ్ల నొప్పులు, నరాల బలహీనత ఉన్న వారికి ఈ బియ్యాన్ని మసాజ్‌ చేయడానికి వాడతారు.

దేశీ ధాన్యంలో ఔషధ గుణాలు..

దేశీ వరి వంగడాల్లో ఔషధ గుణాలు అనేకం ఉన్నాయి. ఇవి తిన్నవారు అనారోగ్యం బారిన పడకుండా ఈ ధాన్యం మేలు చేస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి వరి రకాలనే ప్రజలు ఎక్కువగా తినే అవకాశం ఉంది. దానికోసమే ఇబ్రహీంపూర్‌ గ్రామంలో దేశీ వంగడాల ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేశాం. 

నాగార్జున, వ్యవసాయ విస్తరణాధికారి, నారాయణరావుపేట   


logo