శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Sep 05, 2020 , 01:54:45

50 రోజుల్లో ఇండ్లు పూర్తి చేయాలి

50 రోజుల్లో ఇండ్లు పూర్తి చేయాలి

  • n భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్టీపీ, సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను నిర్మించాలి
  • n విడుతల వారీగా ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయండి 
  • n నిర్మాణాలు పూర్తి చేస్తే ముంపు  గ్రామాల ప్రజలను తరలిస్తాం 
  • n అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశంలో సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి

గజ్వేల్‌ అర్బన్‌: మల్లన్నసాగర్‌ ముంపు బాధితుల కోసం నిర్మిస్తున్న ముట్రాజ్‌పల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో అన్ని వసతులతో ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అధికారులు, కంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ముట్రాజ్‌పల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో నిర్మాణ పనులు ఆలస్యమైన దృష్ట్యా విడుతల వారీగా ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఏజెన్సీలను కలెక్టర్‌ ఆదేశించారు. ఏయే దశల్లో ఎంత సం ఖ్యలో ఇండ్ల నిర్మాణాలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. మరో 50 రోజుల్లో 1500  ఇండ్ల నిర్మాణాలను పూర్తిచేసి అప్పగించాలన్నారు. ముంపు గ్రామాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అదనంగా కూలీలు, కార్మికులను తెప్పించుకుని నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. భవిష్యత్‌లో తాగునీరు, మురుగునీటి విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్టీపీ, సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను నిర్మించాలన్నారు. వచ్చే శుక్రవారం ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో 6 తాగునీటి ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. యూజీడీ, డ్రైనేజీ, రోడ్‌ లెవల్స్‌, మౌలిక వసతుల కల్పన, ఆర్చ్‌ డిజైన్లు సిద్ధం చేయాలని ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. కమ్యూనిటీ ఫంక్షన్‌ హాల్‌, దేవాలయాలు, మసీదు, చర్చి, మార్కెట్‌ నిర్మాణం చేపట్టే స్థలాలను త్వరలోనే అడిషనల్‌ కలెక్టర్‌ పద్మాకర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ పద్మాకర్‌, ఆర్డీవోలు విజయేందర్‌రెడ్డి, అనంతరెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ కనకరత్నం, పంచాయతీ రాజ్‌ అధికారులు రామచంద్రం, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ శ్రీనివాసచారి, తహసీల్దార్‌ అన్వర్‌, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. 


తాజావార్తలు