గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Sep 04, 2020 , 00:24:44

మెట్ట భూముల్లో సిరుల పంట

మెట్ట భూముల్లో సిరుల పంట

  • -హుస్నాబాద్‌ డివిజన్‌లో రికార్డు స్థాయిలో  62,688 ఎకరాల్లో వరి సాగు
  • - 52,892 ఎకరాల్లో పత్తి సాగు
  • -సమృద్ధిగా వర్షాలు కురవడం,   గోదావరి జలాల రాకతో సాగుజోరు 
  • -ఊతమిస్తున్న ప్రభుత్వ పథకాలు

హుస్నాబాద్‌: అతివృష్టి, అనావృష్టిలకు నిలయమైన హుస్నాబాద్‌ మెట్ట ప్రాంతం ఇప్పుడు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నది. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా వరితో పాటు ఇతర ఆరుతడి పంటలను సాగు చేసే ఈ ప్రాంత రైతులు, ఇప్పుడు వరి సాగువైపే మొగ్గు చూపుతున్నారు. ఈ వానకాలం ప్రారం భం నుంచి విస్తారంగా వర్షాలు కురవడం, డివిజన్‌లోని కొన్ని మండలాలకు గోదావరి జలాలు రావడంతో పెద్ద ఎత్తున వరి సాగుచేశారు. గతేడాది వరి కంటే పత్తి పంట రెట్టింపు విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు, ఈసారి పత్తి కంటే వరి పంటనే ఎక్కువగా సాగుచేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వానకాలంలో డివిజన్‌లోని హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, మద్దూరు మండలాల్లో రైతులు రెట్టింపు విస్తీర్ణంలో వరి పంట సాగుచేశారు. ప్రభుత్వం సూచించిన విధంగా నియంత్రిత సాగులో భాగంగా 50శాతం పైగా సన్నరకం వరి రైతులు సాగు చేశారు.

ఈసారి రెట్టింపు ఎకరాల్లో వరిసాగు...

హుస్నాబాద్‌ డివిజన్‌లో ఈసారి 62,688 ఎకరాల్లో వరిపంట వేశారు. గతేడాది 37,918 ఎకరాల్లో మాత్రమే వరి సాగైంది. ఈసారి దాదాపు రెట్టింపుగా వరి సాగైంది. 

పత్తి పంట...

గతేడాది పత్తి పంట 61,152 ఎకరాల్లో సాగు కాగా, ఈసారి 52,892 ఎకరాల్లో మాత్రమే వేశారు. మొక్కజొన్న గతేడాది 17,232 ఎకరాల్లో  సాగు కాగా, ఈసారి 2,231 ఎకరాల్లో మా త్రమే సాగైంది. గతేడాది వరి కంటే పత్తి, మొక్కజొన్న సాగుకు ప్రాధాన్యతనిచ్చిన రైతులు, ఈసారి మాత్రం వరినే ఎక్కువ సాగుచేశారు. మిగతా పంటల్లో కందులు 2,651 ఎకరాల్లో గతేడాది సాగు చేయగా, ఈసారి 8,741 ఎకరాల్లో వేశారు. 

  లక్ష్యాన్ని మంచి పంటల సాగు...

వానకాలంలో రైతులు సాగు చేయబోయే పంటలు, ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారనేది అధికారులు ఏటా ముందస్తుగానే అంచనా వేస్తారు. ఈ వానకాలం సీజన్‌లో కూడా పంటల సాగు లక్ష్యాన్ని డివిజన్‌ అధికారులు ప్రభుత్వానికి పంపారు. అధికారులు పంపిన సాగు లక్ష్యాన్ని మించి పంటలు ఈసారి సాగయ్యాయి. డివిజన్‌లోని ఐదు మండలాల్లో కలిపి ఈసారి 1,22.818 ఎకరాల్లో పంటల సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేయగా, వారి అంచనాలకు మించి 1,27,247 ఎకరాల్లో పంటల సాగు చేశారు. 

 పంటల నమోదుతో పక్కాగా లెక్కలు...

రైతులు సాగుచేస్తున్న పంటల వివరాలు, సాగు విస్తీర్ణం నమోదు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడంతో పక్కాగా లెక్కలు తేలాయి. వడ్లు, పత్తి, మక్కలు తదితర పంటల కొనుగోళ్ల సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా, వ్యవసాయాధికారులచే ప్రభుత్వం సాగు వివరాలను నమోదు చేయించింది. దీంతో రైతులకు మేలు జరగనుంది. అధికారులు నమోదు చేసిన పంటల వివరాల ప్రకారం డివిజన్‌లోని ఐదు మండలాల్లో వరి పంట 62,688 ఎకరాలు, పత్తి 52,892, కంది 8,741, మొక్కజొన్న 1,329, పెసర 395ఎకరాల్లో సాగు చేయగా, మిగతా విస్తీర్ణంలో మినుములు, కొర్రలు, ఆముదం, వేరుశనగ, శనగ, జెవార్‌, జొన్న, ఎర్రజొన్న తదితర పంటలు సాగయ్యాయి. డివిజన్‌ మొత్తంలో 72,229 మంది రైతులు 1,27,247ఎకరాల్లో పంటలు సాగు చేశారు. 

సమృద్ధిగా వర్షాలు...

హుస్నాబాద్‌ డివిజన్‌లో ఈ వానకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. పంటల సాగుకు అనుగుణంగా వర్షాలు కురవడంతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు చేయగలిగారు. డివిజన్‌లోని హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, మద్దూరు మండలాల్లో జూన్‌ నెలలో 99.0 సెం.మీ.ల వర్షం కురవగా, జూలై నెలలో 134.1సెం.మీల వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెలలో ఇప్పటి వరకు 232.7సెం.మీ.ల వర్షం కురిసింది. మద్దూరు, బెజ్జంకి మండలాలకు గోదావరి జలాలు రావడం పంటల సాగుకు కలిసి వచ్చింది.


logo