మంగళవారం 27 అక్టోబర్ 2020
Sangareddy - Sep 01, 2020 , 02:26:06

తప్పుడు వ్యాఖ్యలు.. అభ్యంతరకర పోస్టులు వద్దు

తప్పుడు వ్యాఖ్యలు.. అభ్యంతరకర పోస్టులు వద్దు

  • ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు
  • సామాజిక మాధ్యమాల పోస్టులపై నిరంతరం ‘మానిటరింగ్‌' 
  • పోలీస్‌ కమిషనరేటర్లలో ప్రత్యేక విభాగం

తప్పుడు వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు సోషల్‌ మీడియా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. కొన్నిసార్లు విద్వేషాలు రగిలిస్తున్నాయి. ఒకరి మనోభావాలను దెబ్బతీయాలనో.. వ్యక్తిగతంగా కించపరచాలనో సామాజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకుంటున్న కొందరు.. అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరు ఎప్పుడో జరిగిన ఘటనను తాజాగా చూపిస్తూ.. పాత  ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ.. లేనిపోని సమస్యలను సృష్టిస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు. బెంగళూరు ఘటన నేపథ్యంలో మతపరమైన వివాదాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని నిర్ణయించారు. ఇందుకోసం మూడు కమిషనరేట్లలోని సోషల్‌ మీడియా మానిటరింగ్‌ విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షించి.. చర్యలు తీసుకుంటుంది. ఎవరైనా విద్వేషం రగిలిస్తే.. జైలుకు పోవడం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

షేర్‌చేస్తే.. తొలగిస్తారు..

మూడు కమిషనరేట్లలో ప్రత్యేకంగా సోషల్‌ మీడియా మానిటరింగ్‌ వింగ్‌ పనిచేస్తున్నది. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టింగ్‌లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.  అభ్యంతకరమైనవి ఉంటే వాటిని వెంటవెంటనే తొలగిస్తుంది. అలా ప్రతిరోజూ కనీసం 5 నుంచి 10 వరకు వివాదాస్పద పోస్టింగ్‌లను తీసివేస్తారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో  సైతం ఏటా సుమారు ఇలాంటి 2400 పోస్టింగ్‌లను డిలీట్‌ చేస్తారని అధికారులు తెలిపారు. కాగా, ఎవరైనా  విద్వేషపూరితమైనవి షేర్‌ చేస్తే.. అలాంటి వారిపై సైబర్‌క్రైమ్‌ పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేస్తారు. ఇతర మతాలను అగౌరవపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లను పెట్టినా.. షేర్‌ చేసినా.. చర్యలు తీసుకుంటారు.

దోపిడీ దొంగలంటూ వైరల్‌..

గతేడాది ఇతర రాష్ర్టాల నుంచి దోపిడీ దొంగలు వచ్చారని, వారు కిరాతకంగా ఇంట్లో ఉంటున్న వారిని చంపి సొత్తు దోచుకుపోతున్నారని ఓ వీడియో వైరల్‌ అయింది. దీంతో స్థానికులు తమ ప్రాంతంలోకి ఎవరు కొత్తగా వచ్చినా.. వారిని అనుమానించి చితకబాదారు. అలా రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఓ ఆటో డ్రైవర్‌ మరణించాడు. చివరకు ఆ వీడియో మన ప్రాంతానిది కాదని, వేరే రాష్ర్టానికి చెందినది అని తేల్చారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు అనేక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.

అడ్మిన్‌ బాధ్యుడే..

తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అశ్లీలం, అసభ్యకరమైనవి, మతాలను, వర్గాలను కించపర్చేలా పెట్టే పోస్టింగ్‌లపై నిరంతరం నిఘా పెడుతాం.. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంటే సైబర్‌ క్రైం పోలీసులను అప్రమత్తం చేసి.. వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. ఆ తర్వాత కారకులైన వారిని అరెస్టు చేస్తాం. రెచ్చగొట్టే పోస్టింగ్‌లు, తీవ్రవాద సానుభూతి పరులుగా మార్చేందుకు పెట్టే సాహిత్య పోస్టింగ్‌లను సైతం గుర్తిస్తాం.  సోషల్‌ మీడియా వేదికల ద్వారా తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేసే గ్రూపు అడ్మిన్‌లపై చర్యలు తీసుకుంటాం. మన దగ్గర ఫేక్‌ న్యూస్‌ వైరల్‌ చేసే వాటిని గుర్తించేందుకు పటిష్టమైన సాంకేతికత భద్రత ఉంది.

-శ్రీధర్‌రెడ్డి, ఐటీ ఇన్‌స్పెక్టర్‌ రాచకొండ ఐటీ సెల్‌

ఒకరి నుంచి మరొకరికి.. 

ఇతర దేశాల మూలాలతో సోషల్‌మీడియాలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్టింగ్‌లు చేసే వారుంటారు. ఇంటర్‌నెట్‌కు హద్దులు లేకపోవడంతో అవి ఒకరి నుంచి మరొకరికి షేర్‌ అవుతూ.. యూజర్ల ఖాతాలలోకి కూడా వస్తుంటాయి. ఎక్కడ జరిగిందో అదేమిటో తెలుసుకోకుండానే కొందరు కావాలని, మరికొందరు ఆలోచన చేయకుండానే  షేర్‌ చేస్తుండగా,   పాత వీడియోలు, ఫొటోలను తాజావిగా చూపిస్తూ.. ఫార్వర్డ్‌ చేసే వారూ ఉన్నారు. ఇలాంటి పోస్టింగ్‌లపై నెటిజన్‌లే సోషల్‌మీడియా సంస్థలకు  ఫిర్యాదులు చేస్తుంటారు. సామాజిక మధ్యమాల్లో కుల, మతాల మధ్య ద్వేషాలను పెంచే పోస్టులపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు ఆయా సోషల్‌మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసి.. వాటిని పూర్తిస్థాయిలో తొలగించేలా పోలీసులు చర్యలు తీసుకుంటారు.


logo