శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Aug 30, 2020 , 23:18:29

కరోనాతో.. భయం లేదు

కరోనాతో.. భయం లేదు

కల్హేర్‌ :కరోనా మహమ్మరితో భయం లేకుండా ప్రజలకు సేవలందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కల్హేర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నరేందర్‌ అన్నారు. నిత్యం ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు వైద్య సేవలందించే క్రమంలో తనకు కరోనా సోకిందని తెలిపారు. కరోనా చికిత్స పొంది వైద్యుల నిబంధనలను పాటిస్తూ ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నాను. ప్రజలకు వైద్య సేవలందించేందుకు తనకేలాంటి భయం లేదు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం మందులు సరఫరా చేస్తుంది. నాతోపాటు దవాఖానలో ఫీ మెయిల్‌ సూపర్‌వైజర్‌, సీహెచ్‌వోలు కరోనా వైరస్‌ సోకింది. వారు కూడా ఐసొలేషన్‌లో క్షేమంగా ఉన్నారు.  

లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి..

ఎవరికైనా కరోనా వైరస్‌ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షలు చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే కరోనా విజృంభించే ప్రమాదముంది. సరైన సమయంలో చికిత్స పొందితే త్వరగా కరోనా నుంచి కోలుకుంటారు. వానకాలం కావడంతో సీజనల్‌ వ్యాధులు కూడా ప్రబలే అవకాశముంది. ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించడంతో కరోనా సోకదు. కరోనా వైరస్‌ సోకినవారు నిర్లక్ష్యం చేస్తే కుటుంబ సభ్యులకు, ఇతరులకు సోకే అవకాశం ఉంది. 

గ్రామాల్లో అపోహలు వీడాలి..

కరోనా వైరస్‌ సోకినవారిని ఊర్లో ఉంచకుండా దవాఖానకు పంపించాలని పలు గ్రామాల్లో ప్రజలు పట్టుబడుతున్నారు. బాధితులను హోం ఐసొలేషన్‌లో ఉంచితే ప్రమాదం ఏమి లేదు. కరోనా వచ్చిన వారు ఊర్లో ఉంటే అందరికీ వస్తుందనే అపోహ వీడాలి. కరోనాతో సహజీవనం తప్పనిసరి, నిబంధనలు పాటించకుండా గుంపులు గుంపులుగా ఉండకూడదు. అవసరం లేకున్నా రోడ్లపై తిరగడం మంచిదికాదు. ఎవరికైనా.. ఎప్పుడైనా కరోనా రావచ్చు. అలాంటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. 

వైరస్‌ నివారణ పద్ధతులు పాటించాను..

మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించే క్రమంలో ఏఎన్‌ఎం శ్రీలతకు కరోనా వైరస్‌ సోకింది. వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నట్లు ఆమె తెలిపారు. వైరస్‌ సోకిందని భయపడకుండా ధైర్యంగా ఉంటూ తిరిగి వైరస్‌ నివారణ పద్ధతులను క్రమం తప్పకుండా అవలంభించి కరోనా నుంచి బయటపడి, తిరిగి విధుల్లో చేరినట్లు శ్రీలత తెలిపారు.