మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Aug 30, 2020 , 23:18:48

‘చుక్‌'చకా..

‘చుక్‌'చకా..

ముంబై-హైదరాబాద్‌ రోడ్డుపై ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం

జహీరాబాద్‌ పట్టణంలో ఉన్న ప్రధాన రహదారి ముంబై-హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నది. గతంలో 65వ జాతీయ రహదారి ఉండేంది. ప్రభుత్వం జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా నిర్మాణం చేసి బైపాస్‌ రోడ్డు నిర్మించింది. బైపాస్‌ రోడ్డులో రైల్వే పట్టాలపై ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మించారు. రైల్వే స్టేషన్‌ నుంచి రోజు 30 రైలు నడుస్తాయి. దీంతో ప్రతి అర గంటకు రైలు గేటు వేస్తారు. దీంతో రైల్వే గేటు వద్ద వాహనదారులు రైలు వెళ్లే వరకు ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది. అత్యవసర పరిస్థితిలో సైతం రైలు వెళ్లే  వరకు నిలిచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది.

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం

జహీరాబాద్‌ పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్లు మంజూరు చేయడంతో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం 42 పిల్లర్స్‌ నిర్మాణం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కూలీలు లేక పనులు నిలిచిపోయాయి. నెల రోజుల నుంచి కూలీలు పనులకు రావడంతో కాంట్రాక్టరు పనులు జోరుగా సాగిస్తున్నారు. 

గడువులోగా పనులు పూర్తి చేస్తాం

జహీరాబాద్‌ పట్టణంలో ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం రూ.90 కోట్లు మంజూరు చేసింది. టెండరు వేసి పనులు కాంట్రాక్టరుకు అప్పగించడంతో పనులు సాగుతున్నాయి. 2019లో ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాం. 2022లో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు గడువు ఉంది. ప్రభుత్వ గడువులోగా పనులు పూర్తి చేస్తాం.

- నర్సింహులు, ఆర్‌అండ్‌బీ డీఈఈ జహీరాబాద్‌

బ్రిడ్జి నిర్మాణంతో ప్రజలకు మేలు.. 

జహీరాబాద్‌ పట్టణంలో రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ ఎంతో కృషి చేశారు. ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉందని మంత్రి, ఎంపీ దృష్టికి తీసుకపోవడంతో నిధులు మంజూరు అయ్యాయి. గత ప్రభుత్వలకు ఎన్నో సార్లు వినతి చేసినా పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉంది. 

- షేక్‌ ఫరీద్‌, రైల్వే బోర్డు సభ్యుడు, జహీరాబాద్‌  


logo