బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Aug 30, 2020 , 23:18:48

కాలుష్య రక్కసి

కాలుష్య రక్కసి

పటాన్‌చెరు : పాశమైలారం పారిశ్రామికవాడలో కాలుష్య రక్కసి కోరలు చాస్తున్నది. వారం రోజులుగా కురుస్తున్న వర్షం.. రసాయన పరిశ్రమలకు వరంలా మారింది. ఏడాది కాలంగా నిలువ ఉంచిన జల కాలుష్యాన్ని వర్షాల మాటున వదులుతున్నారు. ఫార్మా, బల్క్‌డ్రగ్‌, రెడ్‌ కేటగిరీ ఉన్న పరిశ్రమలు ఈ పారిశ్రామికవాడలో ఎక్కువగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జీరో డిశ్చార్జ్‌ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాల్సిన అధికారులు విఫలమవుతున్నారు. చుక్క వ్యర్థ జలం బయటకు రాకుండా చూడాలని న్యాయస్థానం ఆదేశాలున్నాయి. ఇప్పుడు బహిరంగంగా పరిశ్రమల మధ్య, కాల్వలు, చెరువుల్లో ప్రమాదకర రసాయన వ్యర్థాలు కనిపిస్తున్నాయి. ఇస్నాపూర్‌ పెద్ద చెరువు పెద్ద డంపింగ్‌యార్డులా మారడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాశమైలారం చుట్టూ ఉన్న పలు గ్రామాల్లోనూ భూగర్భ జలాలు ప్రభావితం అవుతున్నాయి. వాటిని వాడిన ప్రజలు చర్మ రోగాలకు, ఆస్తమ, పక్షవాతం, గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి రోగాలకు గురవుతున్నారు. పరిశ్రమల వ్యర్థాల కోసం ఏర్పాటు చేసిన పీఈటీఎల్‌కు సగం హాలాహలం మాత్రమే వెళ్తున్నదని ఆరోపణలున్నాయి. మిగతా సగం వాగులు, వంకల్లో పారవేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. పీఈటీఎల్‌ రికార్డులను పరిశీలిస్తేనే నిజాలు బయటకు వస్తాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... 

ఈ వారం ప్రారంభమైన వర్షాలు రసాయన, ఫార్మా, బల్క్‌డ్రగ్‌ పరిశ్రమలకు గొప్ప అవకాశాన్ని కల్పించింది. తమ వద్ద నిల్వ ఉన్న రసాయన కాలుష్య జలాలను పరిశ్రమలు యథేచ్ఛగా బయటకు పారవేస్తున్నాయి. పలు పరిశ్రమలు రాత్రి వేళల్లో తమ కాలుష్య జలాలను మోటర్లు పెట్టి బయటకు డంప్‌ చేస్తున్నారు. చీకటిని అడ్డుపెట్టుకొని వర్షం నీటితో ఈ హాలాహలాన్ని బయటకు పారవేస్తున్నారు. రెడ్‌, ఆరంజ్‌ కేటగిరీల్లో ఉన్న ఈ పరిశ్రమల వ్యర్థాలు నిబంధనల మేరకు పరిశ్రమల్లోనే శుద్ధి కావాలి. మరి అత్యంత ప్రమాదకరమైన ఘాడత ఉంటే పటాన్‌చెరు కాలుష్య శుద్ధి కార్మాగారం (పీఈటీఎల్‌)కు తరలించాలి. పీఈటీఎల్‌కు పరిశ్రమలు పంపేది సగం మాత్రమేననే ఆరోపణలు పర్యావరణ వేత్తలు చేస్తున్నారు. పరిశ్రమల ఉత్పత్తికి, పీఈటీఎల్‌కు పంపుతున్న వ్యర్థాలకు పొంతన ఉండడం లేదని సమాచారం. వర్షాల చాటున కాలుష్య జలాలు వదలడం పాశమైలారంలో సాధారణంగా మారింది. పారిశ్రామిక వేత్తలు తమ పరిశ్రమల్లో ఎఫ్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌(ఈటీపీ)లు పెట్టుకున్నా ఈ పారవేతలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 25 కేఎల్‌డీ(కిలో లీటర్స్‌ పర్‌ డే) కాలుష్య జలాలను ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమలు తప్పనిసరిగా జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌ అమలు చేయాలి. అంటే తమ పరిశ్రమలో ఉత్పత్తి అయిన కాలుష్య జలాలను శుద్ధి చేయడంతోపాటు వాటిని రిసైకిల్డ్‌ చేసి తిరిగి వినియోగించుకోవాలి. ఈ ఆదేశాల మేరకు చుక్క నీరు బయటకు రావొద్దు. ఆ స్థాయికంటే తక్కువ కాలుష్య జలాలు ఉత్పత్తి అవుతున్న పరిశ్రమలు తమ వ్యర్థ జలాలను పటాన్‌చెరు పీఈటీఎల్‌కు పంపుకోవాలి. 5 వేల టీడీఎస్‌ లోపున్న కాలుష్యాన్ని మాత్రమే పీఈటీఎల్‌ స్వీకరిస్తుంది. అంతకంటే ఎక్కువ ఉంటే పరిశ్రమలు వెనక్కి తీసుకుని వెళ్లి జీడిమెట్లలోని కాలుష్య శుద్ధి కార్మాగారానికి తరలించాలి. అయితే జీడిమెట్లకు పంపకుండా, తిరిగి వచ్చిన కాలుష్యంలో నీటిని కలిపి ఘాడత తగ్గించి పారబోస్తున్నారనే ఆరోపణలున్నాయి.  కాలుష్యాన్ని శుద్ధి చేయడం ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో పరిశ్రమలు ఈ ధోరణిలో ఉన్నాయి. 

నీటిలో హాలాహలం ఇలా..

నియోజకవర్గంలోని చెరువుల్లో పరిశ్రమల వ్యర్థాలు చేరడంతో ఆ నీటిలో యాంటిబయోటిక్స్‌తో పాటు ఆర్గానిక్‌, హెవిమెటల్స్‌, పెస్టిసైడ్స్‌, పెట్రోలియం వేస్టేజ్‌ కనిపిస్తున్నాయి. ఫార్మా ఉత్పత్తుల వ్యర్థాలు నీటిలో ఉండడంతో నీటిలో చేపలు, కప్పలు, కీటకాలు వంటివి చనిపోతాయి. ఇస్నాపూర్‌ పెద్ద చెరువులో ప్రతియేటా చేపలు చనిపోవడం సాధారణం అయ్యింది. ఈ చెరువు ప్రభావంతో ముత్తంగి, ఇస్నాపూర్‌, పాశమైలారం రుద్రారం, నందిగామ, చిట్కుల్‌ గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి.   ప్రజలు నీటిని వాడడం వల్ల క్యాన్సర్‌, పక్షవాతం, గుండె జబ్బులు, చర్మ రోగాలతోపాటు అనేక రుగ్మతలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పటాన్‌చెరు ప్రాంతవాసులు నగరంలోని ఏ దవాఖానకు పోయినా పటాన్‌చెరు ఇండస్ట్రీయల్‌ ఏరియాల్లో నివసిస్తారా..? అని డాక్టర్లు ప్రశ్నిస్తుంటారు. మహిళల్లో గర్భస్రావం వంటివి సాధారణంగా మారాయి. ఇప్పటికైనా పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టాలని ప్రజలు, పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. 

తనిఖీలు నిర్వహిస్తున్నాం.. పీసీబీ సంగారెడ్డి ఈఈ సురేశ్‌

పాశమైలారం పారిశ్రామికవాడలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నాం.  వర్షం నీటిలో రసాయనాలను వదులుతున్న పరిశ్రమలను గుర్తిస్తున్నాం. రేయిన్‌పిట్లు ఓవర్‌ఫ్లో అయ్యాయి.  త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటాం. హై టీడీఎస్‌ ఉన్న వ్యర్థ జలాలను పటాన్‌చెరుకు పంపుకోవాలి. అక్కడ రిజెక్టు అయిన వ్యర్థ జలాలను నిబంధనల మేరకు జీడిమెట్ల కాలుష్య శుద్ధి కార్మాగారానికి పంపాలి. కాలుష్యం రాకుండా చూస్తాం. ఇస్నాపూర్‌ పెద్ద చెరువులో నీటిలో తరచూ శాంపిల్స్‌ తీసి పరీక్షిస్తున్నాం. 


logo