శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Aug 29, 2020 , 00:58:50

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

  • l 530 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
  • l  రైతుబంధు పథకంలో రూ.74వేల కోట్లు 
  • l జిల్లాలో రూ.34.16 కోట్ల చెక్కులు అందించాం
  • l  వీధి వ్యాపారులకు రూ.10 వేల రుణాలు
  • l  టాయిలెట్ల నిర్మాణంలో జిల్లాకు మొదటి స్థానం
  • l  జిల్లాలో 364 మంది రైతులకు భూ పంపిణీ
  • l  ఒక్కరోజే 2 వేల కరోనా టెస్టులు
  • l  పాజిటివ్‌ వస్తే హోం ఐసొలేషన్‌ కిట్లు 
  • l  ప్రాథమిక దశలోని చికిత్స చేసుకోవాలి
  • l ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సంగారెడ్డి : పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో నియోజకవర్గంలోని 530 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, పంట సహాయ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 530 మందికి రూ.6.14 కోట్ల చెక్కులను అందజేసి ఆడపిల్లల పెండ్లిండ్లకు సీఎం కేసీఆర్‌ అండగా నిలిచారన్నారు.  విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమం ఆగకుండా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోందని మంత్రి వెల్లడించారు. రైతుబంధు పథకంలో రూ.74 వేల కోట్లును రైతులకు అందజేమన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.34.16 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు అందజేశారన్నారు. ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్‌ ఉండాలనే ఉద్దేశంతో ఆగస్టు 15 లోగా పూర్తిచేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో జిల్లా ఉందని గుర్తుచేశారు. ప్రతినెలా పింఛన్లకు ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లను అందజేస్తుందన్నారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకంలో జిల్లాలో ఇప్పటి వరకు 364 ఎకరాలకు రూ.16 కోట్లు ఖర్చు చేశామన్నారు. 

12 వేల మందికి రుణాలు..

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో వీధివ్యాపారులను ఆదుకునేందుకు  ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున రుణాలు అందజేస్తామన్నారు. జిల్లాలో 12 వేల మంది లబ్ధిదారులకు రుణాలు అందించే లక్ష్యం పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 2వేల మందికి రూ. 50 పైసల వడ్డీతో పంపిణీ చేశామన్నారు. మున్సిపాలిటీలో 60 మందికి రుణ మంజూరు ఉత్తర్వులను అందజేశామని మంత్రి తెలిపారు. వచ్చెనెలాఖరులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ రాజర్షి షాను మంత్రి అదేశించారు. కుట్టు మిషన్లు, గప్‌చుప్‌ వ్యాపారం, పండ్ల వ్యాపారులను గుర్తించి రుణాలు అందించాలని సూచించారు.  

12 మందికి పంట పెట్టుబడి సహాయం...

జిల్లాలోని నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని 12 మంది లబ్ధిదారులకు పంట పెట్టుబడి సహాయం అందజేశామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా దళితులకు భూమి   ఇచ్చామని, మొదటి సంవత్సరం పంటకు అయ్యే పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో లబ్ధిపొందిన వారికి ఒక్కొక్కరికీ రూ. 29 వేల చొప్పున రూ. 3.50 లక్షలు పంట సహాయం చెక్కులను అందించామన్నారు. మనూర్‌ మండలం ఎల్గోయిలో 8 మంది, కల్హేర్‌ మండలం బాచుపల్లిలో 4 లబ్ధిదారులకు చెక్కులు అందజేశామన్నారు.  

పీహెచ్‌సీల్లో పరీక్షలు..

జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. జిల్లాలో ఒక్క రోజే 2 వేల పరీక్షలు చేశామని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేస్తారని తెలిపారు. కరోనా వస్తే భయపడకుండా ధైర్యంగా ఉండాలని, ఇతరులకు తెలిస్తే అవమానిస్తారనే ఆలోచనలు దూరం చేయాలని సూచించారు. ఎంఎన్‌ఆర్‌ దవాఖానలో వంద పడకలు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నామన్నారు. టెస్ట్‌ అండ్‌ ట్రీట్‌ నినాదంతో కరోనా పరీక్షలు చేయించుకుని వైద్యసదుపాయం పొందాలని మంత్రి సూచించారు. 

 మంత్రి కృషి అమోఘం : ఎంపీ  

జిల్లా అభివృద్ధికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కృషి అమోఘమని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కొనియాడారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ఆమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో ఆమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం రాష్ట్రం సాధించిన ఘనత అని గుర్తుచేశారు.  జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ మాట్లాడుతూ.. పెద్ద అన్నలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్యాణలక్ష్మి పథకంతో పేద తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందజేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్‌ రాజర్షి షా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, డీసీఎంఎస్‌ అధ్యక్షుడు శివకుమార్‌, జడ్పీటీసీలు సునీత, కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.

 20,234 ఎకరాల్లో .. 

సిద్దిపేట కలెక్టరేట్‌ : సిద్దిపేట జిల్లాలో 20,234 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులను జారీ చేసిందని  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయిల్‌ పాం సాగును ప్రొత్సహించేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న చొరవతో రాష్ట్రంలో ఆయిల్‌ పాం  సాగుకు  కేంద్రం అనుమతి నిచ్చిందని  మంత్రి తెలిపారు. జిల్లాలో ఆయిల్‌పాంను సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. ఈ పంటను సాగు చేయడం వల్ల  ఎక్కువ దిగుబడి వచ్చి మంచి లాభాలు వస్తాయన్నారు. ఎకరానికి దాదపుగా 10-12 టన్నులు ఉత్పత్తి వస్తుందని తెలిపారు.  సుమారుగా 30 సంవత్సరాల వరకు రైతులకు నిరంతరంగా  80వేల నుంచి  లక్ష వరకు  ఆదాయం వస్తుందన్నారు.  ఎకరం వరి సాగుకు ఆవసరమయ్యే నీటితో 4 ఎకరాలు  ఆయిల్‌ పాం పంటలను సాగు చేయవచ్చన్నారు. ఇందులో అంతరు పంటలుగా అల్లం, మిల్లెట్స్‌  వంటి పంటల సాగుతో అదనంగా 30 వేల వరకు రైతులు ఆదాయం పొందవచ్చున్నారు. ఆయిల్‌పాంకు దేశంలో ఎక్కువ గిరాకీ ఉండటంతో  పలు కంపెనీలు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పంటలను కొనుగోలు చేస్తాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

జలపూజ చేసిన మంత్రి  

 రైతులకు సాగు నీరందించడానికి ప్రభుత్వం మంజీర నదిపై నిర్మించిన చెక్‌ డ్యాంను మంత్రి హరీశ్‌రావు సందర్శించి పూజలు చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రం కలెక్టరేట్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై చెక్‌డ్యాం సందర్శించి జల పూజలు చేసి గంగమ్మతల్లికి పసుపు, కుంకుమలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకుంటున్నారని గుర్తుచేశారు. అందుకోసం మంజీర నదిపై రూ.1.55 కోట్ల నిధులతో నిర్మించిన చెక్‌డ్యాంతో ఫసల్‌వాడి గ్రామంలోని 1200 ఎకరాల సాగుకు నీరు అందుతుందన్నారు. సాగుకు నిరంతరం నీరు అందడంతో అన్నదాతలు ఆర్థికంగా ఎదుగుతారని మంత్రి అన్నారు. చెక్‌డ్యాం నీటితో కళకళలాడుతుందని, గ్రామానికి తాగు, సాగు నీటికి కష్టాలు ఉండవని మంత్రి సంతోషం వ్యక్తంచేశారు. మంత్రి వెంట ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యం తదితరులు ఉన్నారు. 


logo