శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - Aug 28, 2020 , 02:36:47

పరిశ్రమలో రసాయనిక పదార్థాలు లీక్‌

పరిశ్రమలో రసాయనిక పదార్థాలు లీక్‌

చిన్నశంకరంపేట : రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ నుంచి రసాయనిక పదార్థాలు లీకై గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురైన సంఘటన మండల పరిధిలోని మిర్జాపల్లిలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. మండల పరిధిలోని మిర్జాపల్లి గ్రామశివారులోని కార్తికేయ ఫార్మా పరిశ్రమలో బుధవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు రియాక్టర్‌ నుంచి విషవాయువు లీకవడంతో గ్రామస్తులకు కండ్ల మంటలు, గొంతు నొప్పికి గురయ్యారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల  ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు ఆరోపించారు. పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున వాసన, పొగ రావడంతో కండ్ల మంటలు, గొంతు నొప్పికి గురయ్యామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్‌ ఫిర్యాదు చేయడంతో సమాచారాన్ని అందుకున్న అదనపు కలెక్టర్‌ నగేశ్‌ పరిశ్రమను సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు లేకుంటే పరిశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీఆర్వో చంద్రయ్యకు మెమో జారీ చేయాలని తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావును ఆదేశించారు.  ఈ విషయాన్ని అదనపు కలెక్టర్‌ నగేశ్‌, పీసీబీ అధికారులకు సమాచారం అందించగా పరిశ్రమలను పీసీబీ జనరల్‌ మేనేజర్‌ కృష్ణమూర్తి, ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మిలు పరిశ్రమలను సందర్శించి వివరాలు సేకరించారు. ఆయన వెంట ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, ఎంపీడీవో లక్ష్మణమూర్తి, మాజీ జడ్పీటీసీ రమణ, సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి  ఉన్నారు.