సోమవారం 19 అక్టోబర్ 2020
Sangareddy - Aug 28, 2020 , 00:18:03

గొర్రెల గుంపుపై దూసుకెళ్లిన వాహనం

గొర్రెల గుంపుపై దూసుకెళ్లిన వాహనం

  • l 117 గొర్రెలు మృతి, మరో 17 జీవాలకు తీవ్రగాయాలు
  • l డ్రైవర్‌ మద్యం సేవించినట్లు అనుమానం
  • l గొర్లకాపరులను ఆదుకుంటామని  మంత్రి హరీశ్‌రావు హామీ

మేతకు వెళ్తున్న గొర్రెల మందపైకి ట్రక్కు దూసుకుపోవడంతో 117 మూగ జీవాలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మరో 17 జీవాలకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానిక పశువైద్యాధికారులు సంఘటనా స్థలంలోనే వైద్యం అందిస్తున్నారు. గజ్వేల్‌ - తూప్రాన్‌ రహదారిపై  కోమటిబండ వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు రూ.11.66 లక్షల విలువచేసే జీవాలు మృతి చెందినట్లు పశువైద్యాధికారులు అంచనా వేశారు. 

    గజ్వేల్‌ : గజ్వేల్‌ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుంటిపల్లి భిక్షపతి, గుంటిపల్లి శ్రీను, రాములు, నర్సింహులు, శాతం కిష్టవ్వ, రాజవ్వకు చెందిన గొర్రెలను మేత కోసం గురువారం మధ్యాహ్నం గజ్వేల్‌ - తూప్రాన్‌ రహదారి మీదుగా తరలిస్తున్నారు. ఇదే సమయంలో కోమటిబండ వద్ద వేగంగా వస్తున్న ట్రక్కు (ఎంపీ07హెచ్‌బీ 3563) గొర్రెల గుంపుపైకి దూసుకెళ్లింది. క్షణాల్లో రోడ్డుపై గొర్రెలు మాంసం ముద్దలుగా చెల్లాచెదురై పడిపోయాయి. మూగజీవాల రక్తం వాననీటితో కలిసి రోడ్డుపై వరదగా పారడంతో గొర్రెలకాపరులు భయానికి గురయ్యారు. అప్పటికే రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించడంతో రవాణా సౌకర్యానికి అంతరాయం ఏర్పడింది. ట్రక్కు డ్రైవర్‌ మద్యం సేవించి అతి వేగంగా వాహనాన్ని నడుపడంతోనే ప్రమాదం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. చనిపోయిన గొర్రెల వద్ద కూర్చుని గొర్రెల కాపరులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సమాచారం తెలుసుకున్న గజ్వేల్‌ పశుగణాభివృద్ధి సంస్థ ఏడీ వెంకటేశ్వర్లు, పశువైద్యాధికారుల బృందం సంఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన గొర్రెలకు చికిత్స చేశారు. మృతి చెందిన మూగజీవాల్లో 101 గొర్రెలు, 5 పొట్టెళ్లు, 1 విత్తన పొట్టెలు, మరో 10 మేకలు ఉన్నట్లు, వీటి విలువ సుమారు రూ.11.66 లక్షలుగా అంచనా వేశారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. ఈ మేరకు గజ్వేల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 గొర్రెలకాపరులను ఆదుకుంటాం : మంత్రి హరీశ్‌రావు

కోమటిబండ వద్ద ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు స్పందించారు. బాధిత గొర్రెలకాపరులకు ప్రభుత్వ పరంగా తగిన సహాయ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఘటనా స్థలానికి గొర్రెల పెంపకందారుల సంఘం జిల్లా చైర్మన్‌ శ్రీహరి యాదవ్‌, గజ్వేల్‌, వర్గల్‌ జడ్పీటీసీలు మల్లేశం, బాలుయాదవ్‌, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ వెంకటేశంగౌడ్‌, వైస్‌ ఎంపీపీ కృష్ణగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు మాదాసు శ్రీనివాస్‌ తదితరలు సందర్శించి, బాధితులను పరామర్శించి రూ. 20వేల ఆర్థికసాయం అందజేశారు.  


logo