సోమవారం 19 అక్టోబర్ 2020
Sangareddy - Aug 26, 2020 , 23:53:31

త్వరలో నియోజకవర్గంగా తూప్రాన్‌

త్వరలో నియోజకవర్గంగా తూప్రాన్‌

  • l ఆధునీకరణ పద్ధతుల్లో తూప్రాన్‌ పట్టణాభివృద్ధికి చర్యలు
  • l తూప్రాన్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుల సంకల్పం
  • l పడాల్‌పల్లిలో రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించిన ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి

తూప్రాన్‌ రూరల్‌ : కొత్తగా ఏర్పడిన తూప్రాన్‌ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే సీఎం కేసీఆర్‌,రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుల ఆశయమని రాష్ట్ర ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. తూప్రాన్‌ పట్టణం త్వరలోనే నియోజకవర్గ కేంద్రంగా మారనుందన్నారు. తూప్రాన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, జడ్పీటీసీ రాణిసత్యనారాయణగౌడ్‌,ఎంపీపీ గడ్డి స్వప్నవెంకటేశ్‌, కౌన్సిలర్లు అరుణవెంకట్‌గౌడ్‌, రవీందర్‌రెడ్డితో కలిసి బుధవారం పట్టణ శివారులోని పడాల్‌పల్లిలో రూ.20 లక్షలతో నిర్మించ తలపెట్టిన రోడ్డు విస్తరణ పనులు, సీసీ రోడ్లకు  ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు నాటి నీటిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడాల్‌పల్లిలో రోడ్డుకు ఇరువైపులా కలిపి 50 ఫీట్ల మేరకు రోడ్డు విస్తరణ పనులు, మధ్యలో డివైడర్‌ను నిర్మించి హరితహారం మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా పట్టణ ప్రజలకు ఆయన సూచించారు. పట్టణంలోని 16 వార్డుల్లోని ఆయా కాలనీల్లో మొక్కలు నాటి హరిత తూప్రాన్‌గా తీర్చిదిద్దాలన్నారు.

తూప్రాన్‌ పట్టణాన్ని సుందరీకరిస్తాం..

తూప్రాన్‌ పట్టణాన్ని ఆధునీకరణ పద్ధతుల్లో సుందరీకరిస్తామని, పట్టణ  ప్రధాన రహదారి మధ్యలో, రోడ్డుకు ఇరువైపులా హరితహాం మొక్కలు నాటి గ్రీన్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. తూప్రాన్‌ సమీప గ్రామాల  ప్రజలు ప్రతిరోజూ వచ్చి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తారని, ప్రజల సౌకర్యార్ధం సులభ్‌ కాంప్లెక్స్‌  నిర్మాణ  పనులు చేపడుతామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లను రెండు నెలల్లోనే నర్సాపూర్‌ క్రాస్‌ రోడ్డులోని నూతన మార్కెట్‌ యార్డుకు తరలిస్తామన్నారు. సులభ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంలో మత్య్సకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. వినియోగదారులకు  ప్రభుత్వం కాంప్లెక్స్‌ను నిర్మించనుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఉపేందర్‌, ప్రభాకర్‌రెడ్డి,గడ్డి వెంకటేశ్‌యాదర్‌,అజార్‌ పాల్గొన్నారు.


logo