గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Aug 26, 2020 , 02:28:07

స్వచ్ఛ సర్వేక్షణ్‌తో మున్సిపాలిటీకి 24వ ర్యాంకు

స్వచ్ఛ సర్వేక్షణ్‌తో మున్సిపాలిటీకి 24వ ర్యాంకు

  • n కరోనాను అధిగమించిన మెదక్‌ మున్సిపాలిటీ
  • n గత ఏడాది 47వ ర్యాంకు..   ఈసారి 24వ ర్యాంకు
  • n వంద శాతం తడి, పొడి చెత్త సేకరణ 
  • n ఉద్యోగులు, ప్రజల సహకారంతోనే ర్యాంకు

మెదక్‌ : ఓ వైపు కరోనా... మరో వైపు సీజనల్‌ వ్యాధులు ము సురుకుంటున్న తరుణంలో పట్టణాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేసేలా కీలక నమయంలో పోటీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్వచ్ఛంగా సాగితే లభించే మార్కుల కోసం స్వచ్ఛ సర్వేక్షణ్‌-2020 కార్యక్రమాన్ని ప్రారంభించి తగు మార్గదర్శకాలను మున్సిపాలిటీలకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయా పట్టణాల మధ్య పోటీ పెట్టి మెరుగైన ర్యాం కులు సాధించిన వాటికి ప్రోత్సాహకాలు అందించనున్నది. పారిశుధ్యం మెరుగుకు చర్యల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. 

స్వచ్ఛ సర్వేక్షణ్‌ -2020లో భాగంగా కరోనా కట్టడికి చేపట్టే స్వచ్ఛత చర్యలకు సైతం ర్యాంకుల్లో ప్రాధాన్యమిచ్చారు. అందువల్ల కరోనాకు కళ్లెం వేసే వినూత్న ఆలోచనలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఇంటింటి చెత్త సేకరణ, ఎరువు తయారీ, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణ, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ, వినియోగం, మురుగునీటి కాలువల శుభ్రత, పాలిథిన్‌ నిషేధం, కంపోస్టు యార్డు, చెత్తశుద్ధి పార్కుల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, వార్డుల అభివృద్ధి, మొక్కలు నాటడం, ప్రైవేట్‌ మరుగుదొడ్ల నిర్వహణ, శ్మశాన వాటికల అభివృద్ధి, పార్కులను మరింత ఆహ్లాదంగా తీర్చిదిద్దడం వంటి వాటికి ర్యాంకులు కేటాయించనున్నారు.

24వ ర్యాంకు సాధించిన  మున్సిపాలిటీ...

స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2020లో మెదక్‌ మున్సిపాలిటీకి 24వ ర్యాంకు వచ్చింది. మెదక్‌ మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా, 50,848 జనాభా ఉన్నది. జోనల్‌ ర్యాంకింగ్‌లో భాగంగా 25వేల నుంచి 50వేల జనాభా ఉన్న మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. ఇందులో హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీకి 9వ ర్యాంకు రాగా, షాద్‌నగర్‌ మున్సిపాలిటీకి 15వ ర్యాంకు, మెదక్‌ మున్సిపాలిటీకి 24వ ర్యాంకు, కల్వకుర్తి మున్సిపాలిటీకి 26వ ర్యాంకులు వచ్చాయి. మెదక్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిలు ప్రత్యేకంగా కృషి చేశారు. మున్సిపాలిటీలో పారిశుధ్యం, తాగునీటి సరఫరాకు నిధులను మంజూరు చేశారు. మున్సిపల్‌ సేవలను ఆన్‌లైన్‌లో అందించేందుకు జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. రాష్ట్రంలో మెదక్‌ మున్సిపాలిటీకి గుర్తింపు తీసుకువచ్చారు.

వంద శాతం తడి, పొడి చెత్త సేకరణ..

మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో ప్రతి రోజు మున్సిపల్‌ కార్మికులు తడి, పొడి చెత్తను సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను శివారులోని డంపింగ్‌ యార్డులో వేరు చేసి కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. మున్సిపాలిటీలో ప్టాస్టిక్‌ నిషేధంలో ముందుందని, చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరిలు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఇంటింటికీ చెత్తబుట్టల పంపిణీ చేశారు. ప్రభుత్వం మెదక్‌ మున్సిపాలిటీకి 

ట్రాక్టర్లు, ట్యాంకర్లు, డోజర్‌తో పాటు చెత్త ట్రాక్టర్లను కూడా 

ఏర్పాటు చేసింది. పట్టణాన్ని బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత పట్టణంగా మార్చేందుకు పట్టణంలోని రాందాస్‌ చౌరస్తా, మార్కెట్‌ ప్రాంతంలో, ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు తదితర ప్రాంతాల్లో కాంప్లెక్స్‌ మూత్రశాలలను, మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు.  


logo