గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Aug 22, 2020 , 00:14:29

వెయ్యి మందికి ఒక టాయిలెట్‌

వెయ్యి మందికి ఒక టాయిలెట్‌

సంగారెడ్డి: పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీల్లో ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్‌ ఉండాలనే ఉద్దేశంతో పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మించామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో పబ్లిక్‌ టాయిలెట్లను రిబ్బన్‌ కట్‌ చేసి మంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో మున్సిపాలిటీలకు కేటాయించిన మొబైల్‌ బయో టాయిలెట్‌ బస్సులను జెండాఊపి ప్రారంభించారు. మొబైల్‌ బయో టాయిలెట్లు ఏర్పాటు చేసిన బస్సులో వసతులను పరిశీలించారు. తర్వాత పాత కలెక్టరేట్‌ ప్రాంగణంలో డీసీఎంఎస్‌ నూతన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ శుభకార్యాలు, కూరగాయల మార్కెట్ల ప్రాంతాల్లో మహిళలకు మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఇక నుంచి మహిళలు ఇబ్బందులు పడకుండా అవసరమున్న చోట పబ్లిక్‌ టాయిలెట్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకంగా మహిళల కోసం మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాటు చేసి ఒకటి ఇండియన్‌, మరొకటి వెస్ట్రన్‌ టాయిలెట్లను తయారు చేశామని తెలిపారు. మహిళలకు 50 శాతం మరుగుదొడ్లను కేటాయించామన్నారు. ఇక నుంచి మహిళలు టాయిలెట్లు లేవని ఆందోళన పడకుండా, ప్రభుత్వం జిల్లాలో 346 మరుగుదొడ్లను నిర్మించిందన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కేవలం 115 టాయిలెట్లు అందుబాటులో ఉండేవని, మరో 231 మరుగుదొడ్లు నిర్మించి అందుబాటులోకి తెచ్చామని మంత్రి వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా సంగారెడ్డి జిల్లాలో 346 టాయిలెట్లు నిర్మించామని తెలిపారు. 

మహిళల కోసం మొబైల్‌ టాయిలెట్లు...

మహిళలు టాయిలెట్ల కోసం ఇబ్బందులు పడకుండా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా జిల్లాలోని 6 మున్సిపాలిటీలకు మొబైల్‌ బయో షీ టాయిలెట్‌ బస్సులను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ నుంచి పాత బస్సులను తీసుకుని మొబైల్‌ టాయిలెట్లకు ఉపయోగించామన్నారు. కలెక్టరేట్‌లో అమీన్‌పూర్‌, సదాశివపేట, బొల్లారం పురపాలక సంఘాలకు ఏర్పాటు చేసిన మూడు మొబైల్‌ టాయిలెట్‌ బస్సులను తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో మరుగుదొడ్ల నిర్వహణ ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో తొలిసారిగా సంగారెడ్డిలో పబ్లిక్‌ టాయిలెట్లు ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చామన్నారు. గత నెలన్నర కాలంలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌, తాను ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్షించామని గుర్తు చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో నిర్మించిన మరుగుదొడ్ల ముందుభాగంలో ఒక షాపు ఉంటుందని, వెనుక భాగంలో మరుగుదొడ్లు ఉంటాయని, టాయిలెట్లలో నీటి సౌకర్యం అన్ని వేళల్లో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు వినియోగంలోకి వచ్చేలా చూడాలని మున్సిపల్‌ కమిషనర్లు, చైర్మన్లకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, డీడీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యం, కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్‌ రాజర్షి షా, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు విజయలక్ష్మి, కొలన్‌ రోజారమణి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, ఆర్డీవో మెంచు నగేశ్‌, వైస్‌ చైర్మన్లు, కమిషనర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

సంగారెడ్డి : సమాజంలో వైద్య వృత్తికి ఉన్న విలువ ఇతర వృత్తులకు అంతంత మాత్రమేనని, దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి హరీశ్‌రావు వైద్యులకు సూచించారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి.. శ్రీ గణేశ్‌ మల్టీస్పెషాలిటీ దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా దవాఖాన యాజమాన్యం శశిధర్‌, రజినీకొమల్‌ దంపతులు మంత్రికి పుష్ఫగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ఎంపీలకు శాలువా కప్పి సన్మానించి మెమోంటోలు అందజేశారు. 

బొల్లారం మున్సిపాలిటీకి బయో టాయిలెట్‌ బస్సును ప్రారంభించిన మంత్రి, కలెక్టర్‌

బొల్లారం: స్వచ్ఛ పట్టణాల కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని, అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం పట్టణ ప్రగతి స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొలన్‌ రోజారాణితో కలిసి బొల్లారం మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన బయో టాయిలెట్‌ బస్సును జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ నిబంధనల మేరకు ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక మరుగుదొడ్డి ఉండాలన్నారు. జిల్లాలో 50 శాతం మహిళలకు, 50 శాతం పురుషుల కోసం మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళలు గుళ్లకు, సంతలకు వెళ్లినప్పుడు ఇబ్బంది లేకుండా మొబైల్‌ షీ టాయిలెట్‌ బస్సులను ప్రతి పట్టణంలో సంత జరిగే చోట ఉంచాలని మున్సిపల్‌ కమిషనర్లకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ రాజర్షి షా, జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజూశ్రీ జైపాల్‌రెడ్డి, ఆర్వో శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo