గురువారం 29 అక్టోబర్ 2020
Sangareddy - Aug 22, 2020 , 00:14:29

ఆదాయం తగ్గినా ఆగని సంక్షేమం

ఆదాయం తగ్గినా ఆగని సంక్షేమం

అందోల్‌: లాక్‌డౌన్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినప్పట్టికీ సం క్షేమ కార్యక్రమాల అమలు ఆగలేదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం అందోల్‌లో రూ.2 కోట్లతో నిర్మించనున్న టౌన్‌హాల్‌కు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, ఎంపీ బీబీ పాటిల్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గినా సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. 

కల్యాణలక్ష్మికి రూ.401, రైతుబంధుకు రూ.7400 కోట్లు విడుదల..

ఆడబిడ్డల పెళ్లిలకు ఇబ్బందులు రాకూడదని ఒక్క నెలలోనే కల్యాణలక్ష్మి పథకం కోసం రూ. 401కోట్లు చెల్లించామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కుల, మతాలకు అతీతంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లిలకు ఆర్థికసాయం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పెట్టుబడికోసం రైతుబంధు ద్వారా రూ.7400కోట్లు విడుదల చేశామన్నారు. ఆసరా పింఛన్ల చెల్లింపుకు ఇబ్బందులు రాలేదని, అభివృద్ధి కార్యక్రమాలు ఆగలేదన్నారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ ఆధ్వర్యంలో అందోల్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగతున్నాయన్నారు. 

రూ.2కోట్లతో టౌన్‌హాల్‌ నిర్మాణం..

అందోల్‌-జోగిపేటలో సభలు, సమావేశాలు, శుభకార్యాలను నిర్వహించుకునేందుకు స్పెషల్‌ డెవల్‌ప్‌మెంట్‌ నిధుల నుంచి రూ.2 కోట్లతో టౌన్‌హాల్‌ నిర్మిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు.అందోల్‌లో 320 డబూల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యాయన్నారు. త్వరలో అర్హులైన నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఇండ్లను కేటాయిస్తామన్నారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. జోగిపేటలో సైతం డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరుగుతున్నదని, అక్కడా అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలు పెడుతామన్నారు. అందోల్‌-జోగిపేటలో రూ.1.20 కోట్లతో డ్రైనేజీలు నిర్మించి ఇతర సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హనుమంతరావు, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గూడెం మల్లయ్య, వైస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌, కౌన్సిలర్‌ భవానీ నాగరత్నంగౌడ్‌, దుర్గేశ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు వెంకటేశం, నాయకులు రవీంద్రగౌడ్‌ పాల్గొన్నారు.