శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Aug 20, 2020 , 23:52:04

సిద్దిపేటలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు సిద్ధం

సిద్దిపేటలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు సిద్ధం

  • n ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ డాటా ఆధారంగా అర్హుల గుర్తింపు
  • n నేడు ఆయా వార్డుల్లో అర్హుల జాబితా విడుదల..?
  • n అభ్యంతరాల స్వీకరణకు వార్డుల్లో డ్రాప్‌బాక్స్‌ల ఏర్పాటు
  • n అనర్హులకు కారణాలు తెలుపుతూ సెల్‌ఫోన్‌కు సమాచారం
  • n తుది జాబితా అనంతరం లాటరీ పద్ధతిలో ఇండ్ల కేటాయింపు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: సిద్దిపేటలోని నర్సపురం వద్ద రాష్ర్టానికే ఆదర్శంగా, అతిపెద్ద గేటెడ్‌ కమ్యూనిటీ జీ+2 తరహాలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. నేడు అర్హుల జాబితాను ఆయా వార్డుల్లో విడుదల చేయడానికి అధికారులు సిద్ధం చేసినట్లు తెలిసింది. త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇండ్లను అందించనున్నారు. అర్హులకే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సరికొత్త విధానంలో ప్రత్యేక సాఫ్ట్ట్‌వేర్‌ను రూపొందించి, పూర్తి పారదర్శకంగా అర్హుల జాబితాను సిద్ధం చేయించారు. లబ్ధ్దిదారుల ఎంపికలో ఎక్కడా పొరపాట్లు జరుగకుండా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మంత్రి, కలెక్టర్‌ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు. జిల్లాస్థాయి అధికారులతో 21 బృందాలను ఏర్పాటు చేసి దరఖాస్తులను పరిశీలించారు. ఒక్కో బృందంలో జిల్లాస్థాయి అధికారితోపాటు మండల స్థాయి అధికారులతో కలిపి మొత్తంగా 100మంది అధికారులు ఈ సర్వేలో పాల్లొన్నారు. రెండు వేల ఇండ్లకు 11,657 దరఖాస్తులు వచ్చా యి. ఒక్కో బృందానికి 500 దరఖాస్తులు పరిశీలించాయి. 21 బృందాలు రాష్ట్ర టెక్నికల్‌ సర్వీస్‌ సంస్థ రూపొందించిన (నలభై రకాల సమాచారం) డేటాను వినియోగించుకున్నారు. దీంతో పాటుగా దరఖాస్తు దారుడు పొందుపరిచిన వివరాల ఆధారంగా, వార్డుల వారీగా ఇంటింటీకి అధికారులు వెళ్లి సర్వే నిర్వహించారు. దరఖాస్తు పెట్టుకున్న ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి అర్హులను గుర్తించేలా ప్రత్యేక బృం దాలు క్షేత్రస్థాయిలో సామర్థవంతంగా పనిచేశాయి. అన్ని కోణాల్లో లబ్ధ్దిదారుల సమగ్ర సమాచారాన్ని సేకరించి, పైరవీలకు తావివ్వకుండా, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. పూర్తి పారదర్శకంగా నిజమైన లబ్ధ్దిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. 

అర్హుల జాబితా విడుదలకు సిద్ధం..

సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని నర్సపురం వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల లబ్ధ్దిదారుల ఎంపిక ప్రకియను అధికారులు పూర్తిచేయగా, ఆయా వార్డుల్లో అర్హుల జాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అభ్యంతరాల స్వీకరణకు వారం రోజుల పాటు గడువు ఇవ్వనున్నారు. ఆయా వార్డుల్లోనే అభ్యంతరాల స్వీకరణకు డ్రాప్‌ బాక్స్‌లను ఏర్పాటు చేస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే, ఆ డ్రాప్‌ బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది. వార్డుల్లో ప్రదర్శించిన జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, నిజంగా అనర్హులు ఉంటే వారి పేర్లను మరోసారి పరిశీలించి, వాస్తవమైతే తొలిగిస్తారు. తుది జాబితాకు అనుగుణంగా ఇండ్లను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. అర్హులు మిగిలిపోయి ఉంటే, వారికి రెండో విడతలో ఇండ్లు కేటాయించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అనర్హతకు గల కారణాలను  తెలుపుతూ, వారి వ్యక్తిగత సెల్‌ఫోన్‌కు సమాచారం అందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 

ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలన..

దరఖాస్తుదారు ఎన్నాళ్లుగా కిరాయి ఇంట్లో ఉంటున్నారు..? నెలకు ఎంత కిరాయి చెల్లిస్తున్నారు..? ఏం పనిచేస్తున్నారు..? నెలకు ఎంత సంపాదిస్తున్నారు..? ఒకవేళ వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటే, ఆ ప్రాంతంలో వీరికి ఏమైనా భూములున్నాయా...? ఇల్లు ఉందా..? వీరి ఆర్థిక పరిస్థితి ఎమిటీ..? ఇలా వార్డుల్లో ప్రత్యేక బృందాలు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాయి. ప్రతి దరఖాస్తుదారునితో మాట్లాడి, వారి వివరాలు సేకరించారు. ఎక్కడ స్థిర నివాసమున్నా, గతంలో లబ్ధిపొందిన, ఇది వరకే ఇండ్ల స్థల పట్టా పొందిన, 58,59 జీవో కింద , ఎల్‌ఆర్‌ఎస్‌ లేఔట్స్‌ రెగ్యులరైజేషన్‌ కింద, గత 15 ఏండ్లలో సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఎన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి.. వాటి క్రయవిక్రయాల సమాచారం, గత 15ఏండ్లలో ఎంత మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు ఇచ్చారు. గృహ రుణాలు తీసుకున్న వారు, ఆస్తి పన్ను కట్టే వారిని, ట్రేడ్‌ లైసెన్స్‌లు ఉన్న పెద్ద వ్యాపారుల పూర్తి సమాచారం తీసుకొని, ఒకటికి ఐదుసార్లు క్రాస్‌ చెక్‌ చేసుకున్నాకే అధికారులు అర్హుల జాబితాను సిద్ధం చేశారు.వ్యవసాయ భూములున్న వారిని గుర్తించేందుకు రైతుబంధు పోర్టల్‌ను వినియోగించుకున్నారు. అధికారులకు అనుమానం వస్తే, ఇతర జిల్లాలో ఉన్న దరఖాస్తుదారుని వివరాలు తెప్పించుకొని అర్హులను గుర్తించారు. ఎక్కడా ఎవరికీ తలొగ్గక పూర్తి పారదర్శకంగా దరఖాస్తులను పరిశీలించి అర్హులను అధికారులు గుర్తించారు.  

సిద్దిపేట నర్సపురం వద్ద 45 ఎకరాల విస్తీర్ణంలో...

సిద్దిపేట నర్సపురం వద్ద 45 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన సుమారు 2వేల ఇండ్లను త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించేలా రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు సన్నాహాలు చేస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు చేపట్టారు. జీప్లస్‌-2 పద్ధతిలో నిర్మించిన భవనాలు ఎంతో చక్కగా ఉన్నాయి. ఒక్కో భవన నిర్మాణానికి రూ.5.30 లక్షలు వెచ్చించారు. మౌలిక వసతుల కల్పనకు మరో రూ.75వేలు కేటాయించారు. ఏ,బీ,సీ బ్లాక్‌లుగా విభజించి సుమారుగా 2వేల ఇండ్లను నిర్మించారు. అంతర్గత సీసీ రహదారులు నిర్మించడంతోపాటు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం పూర్తిచేశారు. ప్రతి ఇంటికి గోదావరి నీళ్లు, ప్రతి ఇంటిపై 2 వేల లీటర్ల ట్యాంకును బిగించడంతో పాటు ప్రతి ఇంటిలో నల్లాలను ఫిటింగ్‌ చేశారు. తాగునీటి కోసం 5 లక్షల లీటర్ల సంప్‌ నిర్మాణంతోపాటు 60లీటర్ల సామర్థ్యం గల ఓహెచ్‌బీఆర్‌ ట్యాంకు నిర్మాణాన్ని సైతం పూర్తిచేశారు. విద్యుత్‌ స్తంభాల బిగింపుతో పాటు ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. పోలీసు ఔట్‌ పోస్టు ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారులకు ఆట స్థలం కోసం చిల్డ్రన్స్‌ పార్కులు ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేక స్థలాలు, గుడి, కమ్యూనిటీ హాల్‌, కూరగాయల మార్కెట్‌ తదితర సౌకర్యాలు ప్రత్యేకంగా ఉన్నాయి.logo