మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Aug 20, 2020 , 03:35:30

అంచనాలకు మించి పంటల సాగు

అంచనాలకు మించి పంటల సాగు

  • n ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 14,94,904 ఎకరాల్లో పంటల సాగు
  • n అదనంగా లక్ష ఎకరాల్లో సాగైన పంటలు 
  • n సరిపడా ఎరువులు సిద్ధం చేస్తున్న యంత్రాంగం
  • n సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో తగిన ఏర్పాట్లు
  • n ఈ వానకాలానికి 2.81 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం
  • n ఇప్పటికే 1.60 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఈ వానకాలంలో అంచనాలకు మించి పంటలు సాగుకాగా, ఆ మేరకు ఎరువులు అందుబాటులో ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) ద్వారా ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్‌)ల్లో ఎరువులు అందుబాటులో ఉంచుతున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఈ వానకాలంలో 14.94 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు రైతులు వేశారు. వ్యవసాయ అధికారుల అంచనాలకు మించి అదనంగా లక్ష ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ వానకాలానికి 2.81 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం ఉం డగా, ఇప్పటి వరకు 1.60 లక్షల టన్నుల ఎరువులు పం పిణీ చేశారు. సాగైన పంటలకు సరిపడా ఎరువులను అధికారులు సిద్ధం చేసి పెట్టారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రి హరీశ్‌రావు ఎరువుల స్టాక్‌పై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

రైతులకు అందుబాటులో ఎరువులు...

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు అందుబాటులో ఉంచారు. 

సంగారెడ్డి జిల్లాలో...

ఈ వానకాలం మొత్తానికి సంగారెడ్డి జిల్లాకు 1.08 లక్షల టన్నుల ఎరువులు అవసరం ఉంటాయని అంచనా వేయగా, రిటైల్‌ దుకాణాలతో పాటు పీఏసీఎస్‌ల ద్వారా ఇప్పటి వరకు 60 వేల మెట్రిక్‌ టన్నుల వరకు ఎరువులు రైతులకు సరఫరా చేశారు. మరో 18 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు ప్రస్తుతానికి అందుబాటులో ఉంచారు.

సిద్దిపేట జిల్లాలో...

సిద్దిపేట జిల్లాలో 1.13 లక్షల టన్నుల ఎరువులు అవసరం ఉంటాయని అంచనా వేయగా, ఇప్పటి వరకు ప్రైవేట్‌ డీలర్లు, సొసైటీల ద్వారా 60వేల టన్నుల ఎరువులు సరఫరా చేశారు. 20 వేల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. 

మెదక్‌ జిల్లాలో...

మెదక్‌ జిల్లాకు 60 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం ఉండగా, ఇప్పటి వరకు 40వేల వరకు సరఫరా చేశారు. జిల్లాకు ప్రస్తుతానికి సరిపడా ఎరువులు అందుబాటులో  ఉంచారు. మొత్తంగా ఉమ్మడి మెదక్‌ జిల్లా మొత్తానికి 2.81 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం ఉండగా, ఇప్పటికే 1.60 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేశారు. మిగతా ఎరువులు అందుబాటులో ఉం చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు హైదరాబాద్‌లోని స్టాక్‌ పాయింట్‌ నుంచి జిల్లాలోని సంగారెడ్డి, నిజాంపేట, జహీరాబాద్‌లోని డీసీఎంఎస్‌ స్టాక్‌ పాయింట్లకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 111 పీఏసీఎస్‌ సొసైటీలకు అవసరమైన మేర తరలిస్తున్నారు. సొసైటీలతోపాటు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 50 ఆగ్రో సేవా కేం ద్రాలు, 25 హాకా సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా, ప్రైవేట్‌ డీలర్ల ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నారు.

అదనంగా లక్ష ఎకరాల్లో పంటల సాగు

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అంచనాలకు మించి పంటలు సాగయ్యాయి.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13.91 లక్షల ఎకరాల్లో పంటల సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేయగా, ఇప్పటి వరకు 14.94 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఏకంగా 1.03 లక్షల ఎకరాల్లో అదనంగా పంటలు సాగుకావడం గమనార్హం. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 77,713 ఎకరాల్లో అదనంగా పంటలు సాగయ్యాయి. సిద్దిపేటలో 15,741, మెదక్‌ జిల్లాలో 9,707 ఎకరాల్లో అదనంగా పంటలు సాగయ్యాయి. పత్తి సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చి, ఆ పంట సాగుచేయాలని సూచించింది. దీంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పెద్దఎత్తున రైతులు పత్తి సాగుచేశారు. ఈ సీజన్‌లో సాగైన మొత్తం పంటల్లో సగం వరకు 7.09 లక్షల ఎకరాల్లో పత్తి ఉండడం గమనార్హం. వరి 4.45 లక్షలు, కంది 1.45 లక్షలు, సోయాబీన్‌ 72 వేలు, మొక్కజొన్న 15 వేల ఎకరాల్లో  వేశారు.


logo