మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Aug 16, 2020 , 22:51:22

ప్రజలకు పునరావాసం కల్పించాలి

ప్రజలకు పునరావాసం కల్పించాలి

సంగారెడ్డి: జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పురాతన గృహాలు, పూరిండ్లు కూలిపోయే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షితంగా పునరావాసాలకు తరలించాలని కలెక్టర్‌ హనుమంతరావు అధికారులను ఆదివారం ఆదేశించారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మండల అభివృద్ధి అధికారులు, తహసీల్దార్లకు సూచించారు. వర్షాలకు తడిసిపోయి కూలే పరిస్థితి ఉన్నా ఇండ్లు, పూరిగుడిసెల్లో నివసించే ప్రజలను పక్కా భవనాల్లోకి తరలించి పునరావాసం ఏర్పాట్లు చేయాలన్నారు. చెరువులు, వాగులు, వంకలు పొంగి ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుందని, చెరువులు నిండి కట్టలు తెగుటకు ఆస్కారం ఉన్న గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ సర్పంచ్‌ల సహకారంతో తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. తహసీల్దార్లు కార్యస్థానాల్లో ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. మండల, డివిజన్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌కు పరిస్థితుల వివరాలు తేలియజేయాలన్నారు. ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, ఆరోగ్యం, ఆర్‌డబ్ల్యూఎస్‌, అగ్నిమాపక, పోలీస్‌ శాఖలతో సమన్వయం చేసుకుని ప్రమాదాలు, అత్యావసర పరిస్థితి ఏర్పడితే అప్రమత్తంగా ఉండి ప్రజలను ఆదుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఎవరైనా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కలెక్టర్‌ హెచ్చరించారు.


logo