ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Aug 16, 2020 , 22:41:24

‘స్వచ్ఛత’లో జ‘హీరో’బాద్‌

‘స్వచ్ఛత’లో జ‘హీరో’బాద్‌

జహీరాబాద్‌ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మున్సిపాలిటీ ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌' అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు, పారిశుధ్య నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌' అవార్డుకు జహీరాబాద్‌ బల్దియాను ఎంపిక చేశారు. 2020లో దేశంలోని వంద మున్సిపాలిటీల్లో సర్వే చేయగా, 42 మున్సిపాలిటీలను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. తెలంగాణలో గ్రేటర్‌ హైదరాబాద్‌, మేడ్చల్‌, కరీంనగర్‌, జహీరాబాద్‌ మున్సిపల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లు/మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. ఈనెల 20న అవార్డు ప్రదానం చేయనున్నారు. జహీరాబాద్‌ మున్సిపల్‌ అభివృద్ధికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ ప్రత్యేక కృషిచేశారు. మున్సిపల్‌లో పారిశుద్ధ్య పనులు చేసేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. తాగునీటి సరఫరా చేయడంతో పాటు మున్సిపల్‌ సేవలను ఆన్‌లైన్‌లో అందించేందుకు కలెక్టర్‌ హనుమంతరావు ప్రత్యేక పర్యవేక్షణ చేసి, దేశంలో జహీరాబాద్‌కు గుర్తింపు తీసుకువచ్చారు. 

తడి పొడి చెత్త సేకరణ..

37 వార్డులు ఉన్న జహీరాబాద్‌ బల్దియాలో.. 1.10 లక్షల జనాభా ఉంది.65 వేల ఓటర్లు ఉన్నారు. ప్రతిరోజు మున్సిపల్‌ అధికారుల పర్యవేక్షణలో కార్మికులు తడి,పొడి చెత్త సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డులో వేరుచేసి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. చెత్త రహిత పట్టణంగా మార్చేందుకు జహీరాబాద్‌ ఆర్డీవో, మున్సిపల్‌ ప్రత్యేకాధికారి రమేశ్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ విక్రం సింహారెడ్డి ప్రత్యేక కృషిచేస్తున్నారు. బల్దియా పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజు ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరిస్తున్నారు. తడి,పొడి చెత్త సేకరణకు గాను ఇంటింటికీ ఉచితంగా బుట్టలు పంపిణీ చేశారు. చెత్త సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆటోలు, ట్రాక్టర్లు , ఇతరు వాహనాలు సమకూర్చింది. గతంలో వాహనాలు లేక పట్టణంలో చెత్త పేరుకుపోయి, దుర్గంధ పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి విముక్తి లభించింది.

ఆన్‌లైన్‌లో మున్సిపల్‌ సేవలు..

జహీరాబాద్‌ మున్సిపల్‌లో భవనాల నిర్మాణ అనుమతులు, లే ఔట్ల సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. గతంలో అనుమతుల కోసం ప్రజలు మున్సిపల్‌ అధికారుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అనేక సేవలు బల్దియా అందిస్తున్నది. 

మూత్రశాలల నిర్మాణం..

జహీరాబాద్‌ పట్టణాన్ని బహిరంగ మల,మూత్ర విసర్జన రహిత పట్టణంగా మార్చేందుకు మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించారు. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి.  

అవార్డు రావడం సంతోషంగా ఉంది 

దేశవ్యాప్తంగా 42 మున్సిపాలిటీలకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌' అవార్డుకు ఎంపిక చేయగా, అందులో జహీరాబాద్‌ మున్సిపాలిటీ ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈనెల 20న ప్రధాని నరేంద్రమోడీ ఆన్‌లైన్‌లో అవార్డు ప్రదానం చేస్తారు. పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ, తాగునీరు, ఆన్‌లైన్‌ సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు కృషిచేస్తాం. అవార్డు రావడంతో బాధ్యత మరింత పెరిగింది. మున్సిపల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం.- విక్రం సింహరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జహీరాబాద్‌


logo