శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Aug 15, 2020 , 23:28:27

బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ కృషి

బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ కృషి

  • l వానకాల సాగుకు రైతుబంధు రూ.190.65 కోట్లు జమ
  • l మెదక్‌ జిల్లాలో 1193 పాడి పశువులకు రూ.5.44 కోట్లు పంపిణీ
  • l 521 చెరువుల్లో 211.70 లక్షలచేప పిల్లలు విడుదల 
  • l జెండావిష్కరణలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

మెదక్‌ : ఆరేండ్లలో అద్భుతమైన అభివృద్ధిని సాధించి దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. శనివారం మెదక్‌ కలెక్టరేట్‌లో మంత్రి జాతీయ జెండావిష్కరణ చేశారు. అనంతరం  ప్రెస్‌మీట్‌లో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విధానాన్ని తీసుకురానున్నదన్నారు. బెంగుళూరు, మహారాష్ర్టాలకు దీటుగా హైదరాబాద్‌ ఐటీ హబ్‌గా మారిందన్నారు. వానకాలం సీజన్‌లో రైతుబంధు కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో  రూ.190.65 కోట్లు జమ చేసిందన్నారు. రైతు బీమా పథకం కింద మెదక్‌ జిల్లాలో 19 నుంచి 59 మధ్య వయస్సు గల 1,16,912 మందికి బీమా కల్పించగా, 2018-19లో 701 మంది, 2019-20లో 660 మంది మృతిచెందగా, వారి కుటుంబీకులకు బీమాను అందజేశామన్నారు. జిల్లాలో 5,514 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు మంజూరు కాగా, 2,999 ఇండ్లకు టెండరు ప్రక్రియ పూర్తయిందని మంత్రి తెలిపారు. జిల్లాలోని 109 గ్రామాలకు గోదావరి నీటిని, 16 మండలాల్లోని 850 గ్రామాలకు మంజీరా నీటిని సరఫరా చేసేందుకు రూ.668.55 కోట్లతో పనులు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. 

9777 యూనిట్లకు రూ.91.66 కోట్లు పంపిణీ..

జిల్లాలో గొర్రెల అభివృద్ధి పథకం జాబితా ‘ఏ’ లో 10142 గొర్రెల యూనిట్లకు గాను 9777 యూనిట్లను రూ.91.66 కోట్లతో పంపిణీ చేశామన్నారు. జాబితా ‘బీ’ లోని 10,040కి గాను 2452 యూనిట్లకు రూ.22.99 కోట్లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు 1193 పాడి పశువులను రూ.5.44 కోట్లతో పంపిణీ చేసినట్లు తెలిపారు. రూర్బన్‌ పథకం కింద పాపన్నపేట మండలంలో ఆరు పశువైద్యశాలలకు రాష్ట్ర సర్కారు రూ.కోటీ 35 లక్షలు మంజూరు చేసిందన్నారు.  

211.70 లక్షల  చేప పిల్లలు విడుదల..

జిల్లాలో 2019-20 సంవత్సరంలో 521 చెరువులో రూ.149 లక్షల విలువగల 211.70 లక్షల చేప పిల్లలను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. మెదక్‌ మత్స్య బీజ క్షేత్రంలో 350 లక్షల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 30 లక్షల చేప పిల్లలను ఉత్పిత్తి చేసినట్లు పేర్కొన్నారు. 400 చెరువుల్లో 180 లక్షల చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు.  

కరోనా రుణాలు రూ.78.25 కోట్లు పంపిణీ..

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2019-20 సంవత్సరానికి గాను బ్యాంకు లింకేజీతో 6,054 సంఘాలకు  రూ.237.94 కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. 2020-21లో కరోనా రుణాలను 6,170 సంఘాలకు రూ.78.25 కోట్లు పంపిణీ చేసినట్లు వివరించారు.

కేసీఆర్‌ కిట్‌తో సర్కారు దవాఖానల్లోనే ప్రసవాలు..

జిల్లాలో ఇప్పటి వరకు 15,813 మందికి  కేసీఆర్‌ కిట్‌ పథకంతో లబ్ధి చేకూరిందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో 72 శాతం, ప్రైవేట్‌ దవాఖానల్లో 28 శాతం ప్రసవాలు అవుతున్నాయన్నారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ నగేశ్‌, ఎస్పీ చందనదీప్తి, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ లావణ్యరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, పీఆర్‌ ఈఈ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, డీఏవో పరశురాంనాయక్‌, జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, డీఎస్పీ కృష్ణమూర్తి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, కమిషనర్‌ శ్రీహరి, మత్స్యసహకార సంఘం ఉమ్మడి జిల్లా చైర్మన్‌ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

కుల వృత్తులకు  ప్రభుత్వం చేయూత

మెదక్‌ అర్బన్‌ : కులవృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. శనివారం పట్టణంలోని గోసముద్రం, పిట్లం చెరువులో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలతో కలిసి చెరువుల్లో 2,41,500ల చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్యకార్మికుల కోసం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు. సబ్సిడీపై టాటాఏస్‌ ఆటోలను, ద్విచక్రవాహనాలను పంపిణీ చేసిందన్నారు.