బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Aug 15, 2020 , 23:28:28

అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్‌ చికిత్సలు

అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్‌ చికిత్సలు

  • ll అందుబాటులో మందులు, పీపీఈ కిట్లు
  • l సోషల్‌ మీడియా వదంతులను నమ్మొద్దు
  • l దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు
  • l ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రోత్సాహం
  • l పంద్రాగస్టు వేడుకల్లో  హోంమంత్రి మహమూద్‌ అలీ

సంగారెడ్డి/ సంగారెడ్డి టౌన్‌ : కరోనా వైరస్‌ నివారణకు తీసుకుంటున్న చర్యల్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్‌-1 స్థానంలో ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ అన్నారు. శనివారం 74వ స్వాతంత్య్ర వేడుకలను సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హోం మంత్రి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు సంగారెడ్డిలోని ఐబీలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టరేట్‌లో హోం మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్‌ నివారణకు సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు భయాన్ని వదిలితే కరోనాను జయించవచ్చన్నారు.     

ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్‌ చికిత్సలు..

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్‌ చికిత్సలు నిర్వహిస్తున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన, ఎంఎన్‌ఆర్‌ దవాఖానలో కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారని, మందులు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని సూచించారు. జిల్లాలోని సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో కొవిడ్‌ రోగుల కోసం 100 పడకలు, ఎంఎన్‌ఆర్‌ వైద్య కళాశాలలో 100 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. పీహెచ్‌సీలు, అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లలో రాపిడ్‌ కిట్స్‌, పీపీఈ కిట్స్‌, హోం క్వారంటైన్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.   

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రోత్సాహం..

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని హోం మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. ఇంటింటా ఇన్నోవేటర్‌లో భాగంగా జిల్లా నుంచి వ్యవసాయ రంగానికి అనుకూలంగా తయారు చేసిన యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సీఎం కేసీఆర్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 75 శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారన్నారు.  

దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు..

దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని హోం మంత్రి అన్నారు. దేశంలోనే వ్యవసాయ పెట్టుబడిని ఇస్తున్నది తెలంగాణ  సర్కారే నన్నారు. విదేశాల నుంచి భారీ ప్రాజెక్టులు తరలివచ్చి పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. మునిపల్లి మండలం మల్లికార్జునపల్లికి చెందిన సంగమేశ్వర్‌ తయారు చేసిన వీల్‌ బేస్‌డ్‌ ఫర్టిలైజర్‌ స్ప్రే పంప్‌, వట్‌పల్లి మండలం గొర్రెకల్‌ గ్రామానికి చెందిన విఘ్నేశ్వర్‌ తయారు చేసిన మోటర్‌ రన్‌ వీడ్‌ రిమూవర్లను పరిశీలించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌ రూ.15వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, కలెక్టర్‌ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌  విజయలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ శంకరి లతా, డీఆర్వో రాధికారమణి పాల్గొన్నారు.


logo