ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 10, 2020 , 23:28:23

సఫాయి కార్మికులకు సర్కారు ‘రక్షణ’

సఫాయి కార్మికులకు సర్కారు ‘రక్షణ’

రామచంద్రాపురం: సఫాయి అన్న సలాం అని పిలిచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరే.. సఫాయి కార్మికుల సేవలను గుర్తించిన ప్రభుత్వం వారికి సమూచిత గౌరవం కల్పిస్తుంది. పారిశుధ్య విభాగంలో బాగా పనిచేసే కార్మికులకు సన్మానం చేసి గౌరవించే సంస్కృతిని ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలో ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం సఫాయి కార్మికులకు తెలంగాణలో దక్కుతుంది. కరోనా వేళ సఫాయి కార్మికులు ఎంతో తెగువతో విధులు నిర్వర్తిస్తున్నారు. కార్మికుల ధైర్యానికి, పనిపట్ల వారికి ఉన్న సంకల్పాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్‌ వారి వేతనంతో పాటు ప్రత్యేకంగా సీఎం గిఫ్ట్‌ కింద అదనంగా రూ.5వేలు బోనస్‌ను ఇచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇప్పు డు పారిశుధ్య కార్మికులు అంటే ప్రతి ఒక్కరికి గౌరవం పెరిగింది. గతంలో పారిశుధ్య కార్మికులు అంటే చులకనగా చూసేవారు. ఇప్పుడు వారి సేవలకు అందరు సలాం కొడుతున్నారు. ఈ క్రమంలోనే పారిశుధ్య, ఎంటమాలజీ కార్మికులు ఆరోగ్యవంతంగా, క్షేమంగా ఉండేందుకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో బల్దియా ‘రక్షణ కిట్ల’ను అందజేస్తుంది. పారిశుధ్య పనులు నిర్వహించేటప్పుడు కార్మికులు ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా.. రోగాల భారీన పడకుండా పూర్తిస్థాయిలో రక్షణగా ఉండేందుకు పది రకాల వస్తువులతో కూడిన రూ.6,700 విలువగల రక్షణ కిట్లను బల్దియా కార్మికులకు అందజేస్తుంది.

రక్షణ కిట్‌లో ఉండే వస్తువులు..

పారిశుధ్య, ఎంటమాలజీ శాఖలకు చెందిన కార్మికులకు ఉపయోగపడేలా రక్షణ కిట్లలో పది రకాల వస్తువులు ఉన్నాయి. కార్మికులకు రెయిన్‌ కోర్ట్‌, రెగ్జీన్‌ కోర్ట్‌, 2లీటర్ల కొబ్బరి నూనె బాటిళ్లు, శానిటైజర్‌, 40డెటాల్‌ సబ్బులు, బూట్లు, హ్యాండ్‌ గ్లౌజులు, మాస్క్‌లు, ఒక బ్యాగ్‌, నాప్థలిన్‌ బాల్స్‌ కిట్‌లో ఉన్నాయి. సర్కిల్‌ 22లోని పటాన్‌చెరు, ఆర్సీపురం, భారతీనగర్‌ డివిజన్‌లల్లో మొత్తం 203 పారిశుధ్య సిబ్బంది, 51మంది ఎంటమాలజీ సిబ్బంది పనిచేస్తున్నారు. అధికారులు కార్మికులందరికి రక్షణ కిట్లను అందజేసి వాటి ఉపయోగాలు, వాడకం విధానంపై కార్మికులకు వివరించారు. 

కార్మికుల్లో నూతనోత్సాహం..

కార్మికులకు రక్షణ కిట్లను అందజేయడంతో గతంలో కంటే ఇప్పుడు కార్మికులు ఉత్సాహంగా పని చేస్తున్నారు. రక్షణ కిట్లతో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో తమకు ఏవిధమైన ప్రమాదం జరుగదనే ధీమాతో కార్మికులు ఉన్నారు. అధికారుల సూచనల మేరకు కార్మికులు మాస్క్‌లు ధరించి, ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకుంటున్నారు. రక్షణ కిట్లలోని వస్తువులు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని కార్మికులు చెబుతున్నారు. కరోనా వేళ బల్దియా రక్షణ కిట్లను అందజేయడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కార్మికులందరికి కిట్లు అందజేశాం 

పారిశుధ్య, ఎంటమాలజీ సిబ్బందికి రక్షణ కిట్లు అందజేశాం. రూ.6,700 విలువ గల రక్షణ కిట్‌లో కార్మికులకు ఉపయోగపడే పది రకాల వస్తువులు ఉన్నాయి. విధినిర్వహణలో కార్మికులు ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా ఆరోగ్యంగా, క్షేమంగా ఉండేందుకు రక్షణ కిట్లను బల్దియా సరఫరా చేస్తుంది. సర్కిల్‌ 22లోని 254 మంది సిబ్బందికి కిట్లను అందజేశాం.- బల్దియా ఉపకమిషనర్‌ బాలయ్య

కార్మికుల శ్రేయస్సుకు కృషి 

కార్మికుల శ్రేయస్సుకు ప్రభుత్వం కృషిచేస్తుంది. కార్మికులు క్షేమంగా ఉండేందుకు ప్రభుత్వ ఆదేశాలతో బల్దియా రక్షణ కిట్లను అందజేసింది. కార్మికులు రక్షణ కిట్లను సద్వినియోగం చేసుకుంటున్నారు. బూట్లు, రేన్‌కోర్ట్‌, రెగ్జిన్‌ కోర్ట్‌, గ్లౌజ్‌లు, మాస్క్‌లు, శానిటైజర్‌, నాప్‌తెలిన్‌ బాల్స్‌, కొబ్బరినూనె, డెటాల్‌ సబ్బులు కిట్‌లో ఉన్నాయి.  - కార్పొరేటర్‌ సింధూఆదర్శ్‌రెడ్డి


logo