ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Aug 07, 2020 , 00:17:53

కరోనాకు భయపడొద్దు

కరోనాకు భయపడొద్దు

సంగారెడ్డి టౌన్‌/మెదక్‌ : కరోనాకు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని దవాఖానల్లో నూటికి నూరు శాతం కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించాలని, కరోనా పరీక్షలపై ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు. టెస్టులు నిర్వహించిన ప్రతి కేసు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా పాజిటివ్‌ పేషెంట్లకు ఆయా జిల్లాల దవాఖానల్లోనే చికిత్సలు అందించాలన్నారు. ప్రతి పేషెంట్‌కు తప్పనిసరిగా మందులతో కూడిన కిట్లను అందజేయాలన్నారు. గతంలో కరోనా కోసం గుర్తించిన ఐసొలేషన్‌ కేంద్రాలను దవాఖానలుగా ఏర్పాటు చేసి చికిత్స అందించాలన్నారు. ప్రతి జిల్లాలో తప్పనిసరిగా 100 పడకల ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయాలన్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారిని డాక్టర్లు పరీక్షించాలని, ఆక్సిజన్‌ అవసరమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో హోం ఐసొలేషన్‌కు పంపవద్దని, దవాఖానల్లోనే చికిత్సలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో కరోనా నేపథ్యంలో చేపట్టిన చర్యలపై కలెక్టర్‌ హనుమంతరావు మాట్లాడుతూ 10 వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామని, ఎంఎన్‌ఆర్‌లో 100 పడకల వార్డును ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. నాలుగు కొత్త దవాఖానల యజమానులు దరఖాస్తులు చేసుకున్నారని, వాటిలో మూడు వందల వరకు పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం ఎంఎన్‌ఆర్‌ దవాఖానలో 37 మంది కరోనా పేషెంట్లు ఉన్నారన్నారని, ఇంకా 116 పడకలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. గతంలో క్వారంటైన్‌ కోసం వినియోగించిన 300 గదులు ఉన్న కాలేజీని త్వరలో హోం ఐసొలేషన్‌ కోసం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షి షా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,  మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, జిల్లా సర్వేలెన్స్‌ అధికారి నవీన్‌కుమార్‌, డాక్టర్‌ అమర్‌సింగ్‌, వివిధ దవాఖానల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.logo