గురువారం 24 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 05, 2020 , 23:56:44

పన్నులు చెల్లించకుండా వస్తువులు అమ్మకాలు

పన్నులు చెల్లించకుండా వస్తువులు   అమ్మకాలు

  • n భారీగా బియ్యం, పప్పులు నిల్వలు
  • n ముంబై నుంచి దిగుమతి అవుతున్న ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు
  • n ప్రభుత్వ ఆదాయానికి తూట్లు

జహీరాబాద్‌లో జీరో దందా జోరుగా సాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలు చేశాక రాష్ట్ర సరిహద్దులో వాహనాల తనిఖీ లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. సరిహద్దులో ఉన్న జహీరాబాద్‌ నుంచి బియ్యం, పప్పులు అక్రమంగా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ర్టాలకు ఎగుమతి అవుతుండగా, ముంబై నుంచి ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువుల దిగుమతి జరుగుతున్నది. 65వ జాతీయ రహదారిపై నిఘా లేకపోవడంతో జీరో దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నదన్న ఆరోపణ వినిపిస్తున్నది.

జహీరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలు చేయడం తో రాష్ట్ర సరిహద్దులో ఉన్న వాణిజ్య పన్నుల చెక్‌పోస్టులను తొలిగించారు. గతంలో మహారాష్ట్ర, కర్ణాటక వైపు నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని రాష్ట్ర సరిహద్దు చెరాగ్‌పల్లి వాణిజ్య పన్నుల చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేసి, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించే వారు. జీఎస్టీ అమలు కావడంతో కేంద్ర ప్రభుత్వం చెక్‌పోస్టులు తొలిగించడం.. రాష్ట్ర సరిహద్దు లో వాహనాలను తనిఖీ చేయకపోడంతో వ్యాపారులు ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండా రాష్ట్రంలోని జీరోలో వస్తువులు తీసుకువస్తున్నారు. ప్రతీ వస్తువుకు పన్నులు చెల్లించి అమ్మకాలు చేయాలని నిబంధనలు ఉన్నా వ్యాపారులు పట్టించుకోవడం లేదు. జహీరాబాద్‌ రాష్ట్ర సరిహద్దులో ఉండటంతో వ్యాపారులు బియ్యం, పప్పులు గోదాంల్లో నిల్వ చేసి అక్రమంగా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌కు తరలిస్తున్నారు. మంబై నుంచి ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు దిగుమతి చేసుకుంటున్నారు. 65వ జాతీయ రహదారిపై నిఘా లేకపోవడంతో అక్రమ రవాణా జోరుగా సాగుతోందని ఆరోపణలు ఉన్నాయి. 

పన్నులు చెల్లించకుండా దందా..

వ్యాపారులు కొనుగోలు చేసిన వస్తువులకు అమ్మకపు పన్ను చెల్లించకుండా జీరో దందా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు ప్రతిరోజు లారీ, డీసీఎం, మినీ వ్యా న్‌లో వస్తువులు దిగుమతి చేసుకుంటున్నారు. మహారాష్ట్ర, హైదరాబాద్‌ నుంచి వస్తువులు దిగుమతి చేసుకుని అమ్మకాలు చేస్తున్నారు. వ్యాపారులు ప్రభుత్వానికి టర్నోవర్‌ పన్ను, వ్యాట్‌ చెల్లించకుండా నిర్భయంగా వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కిరాణం దుకాణాలు, ఫ్యాన్సీ జనరల్‌ దుకాణాల వ్యాపారులు వాణిజ్య పన్నుల శాఖకు ఎలాంటి పన్నులు చెల్లించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బియ్యం, జొన్నలు, ఆటోమొబైల్‌, పప్పు దుకాణాలు, సిగరెట్లు, కూల్‌ డ్రింక్స్‌ దుకాణాల వ్యాపారులు పన్నులు చెల్లించకుండా వ్యాపారం చేస్తున్నారు. ఫ్యాన్సీ దుకాణాల్లో జీరో దందా ఎక్కువగా సాగుతోంది. వ్యాపారులు అమ్మకం, కొనుగోలు టర్నోవర్‌ టాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. జహీరాబాద్‌లో వ్యాపారులు పన్నులు చెల్లించకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారు. 

జహీరాబాద్‌ పట్టణం వ్యాపారంలో ఎంతో అభివృద్ధి చెందింది. జిల్లాలోనే వ్యాపారం రంగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రతిరోజు హైదరాబాద్‌ నుంచి లారీలో వస్తువులు దిగుమతి చేసుకుంటున్నా పన్నులు చెల్లించడం లేదనే విమర్శలు ఉన్నాయి. వ్యాపారులు బియ్యాన్ని బ్లాక్‌లో ఇతర ప్రాం తాల నుంచి దిగుమతి చేసుకుని అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. బియ్యాన్ని జహీరాబాద్‌లో నిల్వ చేసి కర్ణాటక, మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. పప్పులు బ్లాక్‌లో నిల్వ చేసి ధరలు పెరిగిన వెంటనే అమ్మకాలు చేస్తున్నారు. ఆటోమొబైల్‌ పరికరాలు హైదరాబాద్‌, ముంబై నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆటోమొబైల్‌ పరికరాలను అమ్మకాలు చేసిన పన్నులు చెల్లించారు. 

కిరాణా దుకాణాలు, ఫ్యాన్సీ జనరల్‌ దుకాణాలు

జహీరాబాద్‌లో కిరాణా దుకాణాలు, ఫ్యాన్సీ జనరల్‌లో ప్రతిరోజు లక్షల వ్యాపారం జరిగినా పన్నులు చెల్లించడం లేదు. వ్యాపారులు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడంతో పాటు వినియోగదారులకు అధిక ధరలకు వస్తువులు అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కిరాణా దుకాణాల్లో అమ్మకాలు లక్షల్లో ఉన్నా వ్యాపారులు అమ్మ కం, కొనుగోలు టర్నోవర్‌ టాక్స్‌ చూపడం లేదు. జీరో దందా చేసి వ్యాపారులు లక్షలు సంపాదిస్తూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం లేదు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు చేసే సమయంలో దుకాణాలు ముసివేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తువులు జీరోలో దిగుమతి చేసుకుని అమ్మకాలు చేస్తున్నారు. 

-ప్రభుత్వ ఆదాయానికి తూట్లు

వ్యాపారులు జీరో వస్తువులను దిగుమతి చేసుకుని అమ్మకాలు చేయడంతో ప్రభుత్వ ఆదాయనికి భారీగా నష్టం జరుగుతోంది. పన్నులు చెల్లించాల్సిన వ్యాపారులు జీరో దందా చేస్తున్నారు. లక్షల విలువ చేసే వస్తువులు, పప్పులు, బియ్యం, ఇతర పరికరాలు నిల్వ చేస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులకు పన్నులు చెల్లించాలి. అమ్మకాలు చేసిన ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి. వ్యాపారులు ఎలాంటి పన్నులు చెల్లించకుండా వ్యాపారాలు చేస్తున్నారు. జహీరాబాద్‌లో వాణిజ్య పన్నుల కార్యాలయం లేకపోవడం, తనిఖీలు చేసేందుకు అధికారులు సంగారెడ్డి నుంచి రావాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా అమ్మకాలు చేసి ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం లేదు.logo