గురువారం 24 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 05, 2020 , 23:58:04

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి

సంగారెడ్డి టౌన్‌: జిల్లాలో పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని మున్సిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ హనుమంతరావు అధికారులకు సూచించారు. బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మున్సిపల్‌ కమిషనర్లు, వైస్‌ చైర్మన్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ప్రకృతి వనాలు, ట్రీపార్కులు, వీధి వర్తకులు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల నిర్మాణం, అక్రమ లేఅవుట్లు, అనుమతిలేని నిర్మాణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గ్రామాలు బాగుపడుతుంటే పట్టణాలు మాత్రం అదోగతిలో ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు మున్సిపాలిటీల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. అధికారులతోపాటు మున్సిపల్‌ పాలకవర్గం పట్టుదలతో పనిచేసి అభివృద్ధి చేసుకోవాలనే తపన ఉండాలన్నారు. జిల్లాలోని ఏ మున్సిపాలిటీలో కూడా పారిశుధ్య నిర్వహణ బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీ మిగతా మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. అదే విధంగా మున్సిపాలిటీలు 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌లో గ్రీనరీ పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆత్మ నిర్భర్‌లో భాగంగా వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించడంపై దృష్టి సారించాలని మున్సిపల్‌ కమిషనర్లకు సూచించారు. ఆదర్శ మున్సిపాలిటీలుగా మారడానికి 42 అంశాలను సమీక్షించుకోవాలని, ట్రీపార్కులు, హరితహారం, ప్రకృతి వనాలు, యాదాద్రి పార్కులు, నర్సరీలపై శ్రద్ధ పెట్టాలన్నారు. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా ఎఫ్‌టీఎల్‌లో మొక్కలు నాటాన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. 

సదాశివపేట టీపీఎస్‌ సరెండర్‌

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అధికారుల సూచనలు పాటించడం లేదంటూ సదాశివపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ పి.లక్ష్మీకాంత్‌ను కలెక్టర్‌ హనుమంతరావు బుధవారం సరెండర్‌ చేశారు. విధులపై నిర్లక్ష్యం, అక్రమ నిర్మాణాలను అడ్డుకోకపోవడంతో లక్ష్మీకాంత్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేశామని కలెక్టర్‌ తెలిపారు. 

రైతు వేదికలను త్వరగా పూర్తిచేయాలి

హత్నూర: రైతు వేదిక నిర్మాణల పనులు నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ హనుమంతరావు స్పష్టం చేశారు. బుధవారం మండల పరిధిలోని కాసాలలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను అదనపు కలెక్టర్‌ వీరారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మొదటి రైతు వేదిక కాసాలలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఆయన వెంట పంచాయతీ రాజ్‌ శాఖ అధికారి దామోదర్‌, తహసీల్దార్‌ జయరామ్‌, ఎంపీడీవో సువర్ణ, ఏఈ సురేశ్‌ కుమార్‌, సర్పంచ్‌ రాణి రాంరెడ్డి, కాంట్రాక్టర్‌ అభిషేక్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo