మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 05, 2020 , 00:20:53

ఆరబెట్టే అవస్థలకు చెల్లు

ఆరబెట్టే అవస్థలకు చెల్లు

  • l మెదక్‌ జిల్లాలో 2675 కల్లాలు
  •  l ఎస్సీఎస్టీలకు వంద, ఇతరులకు 90 శాతం సబ్సిడీ
  •  l ఇప్పటి వరకు వచ్చినవి 2వేల దరఖాస్తులు
  •  l కల్లాల నిర్మాణాలకు రూ.24.75 కోట్లు

రైతుకు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అన్నీ తానై అండగా నిలుస్తున్నది. రైతు ఏ పంట సాగుచేయాలనే దగ్గర నుంచి మార్కెటింగ్‌ సౌకర్యం.. మద్దతు ధర వరకు ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తున్నది. అందులో భాగంగా ఇంకో అడుగు ముందుకేసి ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసందానం చేస్తూ పండిన పంటను నాణ్యతతో అమ్ముకోవడానికి కల్లాలను నిర్మించి ఇస్తున్నది. పండిన పంట మార్కెట్‌కు తరలించడానికి ముందు రైతులు పడుతున్న వెతలను కండ్లారా చూసిన సీఎం కేసీఆర్‌ రైతు పొలంలోనే కల్లాన్ని నిర్మించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా మెదక్‌ జిల్లాకు 2675 కల్లాలను ప్రభుత్వం మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకు వంద, ఇతరులకు 90 శాతం సబ్సిడీని అందిస్తూ రైతు సర్కారుగా టీఆర్‌ఎస్‌ పాలన సాగిస్తున్నది.    -మెదక్‌ 

సొంత పొలంలోనే కల్లాలు..

పండించిన పంటలను ఆరబెట్టుకోవడానికి రైతులు నానా అవస్థలు పడేవారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, కందులను రైతులు అరబెట్టడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది  జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సర్వీస్‌ రోడ్డులో వరి ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ఇంకా కొంత మంది గ్రామాల్లోని సీసీ రోడ్లపై పంటలను ఎండబోస్తున్నారు. దీనిని గమనించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు కల్లాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. రైతులు పండించిన పంటలను ఆరబెట్టుకోవడం కోసం సొంత పొలాల్లోనే కల్లాలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం,ఇతరులకు 90 శాతం సబ్సిడీని కల్లాలను నిర్మించుకోవడానికి అందజేస్తున్నది. ఇందుకోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.24.75 కోట్లు కేటాయించింది. 

జిల్లాలో 2.20లక్షలు రైతులు.. 

మెదక్‌ జిల్లాలో 2.20లక్షలు రైతులు ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో 2675 కల్లాలు మంజూరయ్యాయి. వీటి కోసం సుమారు 2వేలకు పైగా రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. కాగా రైతులు కల్లాలను 50 మీటర్ల విస్తీర్ణంలో నిర్మించుకుంటే యూనిట్‌ ధర రూ.56వేలు, 60 మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకుంటే రూ.68వేలు, 70 మీటర్ల విస్తీర్ణంలో నిర్మించుకుంటే రూ.85వేల చొప్పున ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు వస్తాయి. అయితే కల్లాలను నిర్మించుకోవడానికి ముందుగా రైతులు ఖర్చుచేయాల్సి ఉంటుంది. తర్వాత వారికి నిధులు వస్తాయి.

ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ..

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీపై కల్లాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. బీసీ, ఓసీ రైతులకు 90 శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుంది. ఐదు ఎకరాలు ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. జాబ్‌ కార్డు ఉన్న రైతులు మాత్రమే పథకానికి అర్హులు. దరఖాస్తులు చేసుకునే రైతులు ఆధార్‌కార్డు, జాబ్‌కార్డు, బ్యాంక్‌ ఖాతా పాస్‌బుక్‌, పట్టాదారు పాస్‌ పుస్తకం జిరాక్స్‌లను వ్యవసాయ శాఖ అధికారులకు అందజేయాల్సి  ఉంటుంది.

జిల్లాకు 2675 కల్లాలు మంజూరు..

మెదక్‌ జిల్లాకు ప్రభుత్వం 2675 కల్లాలను మంజూరు చేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద  కల్లాలను నిర్మించనున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, మిగతా రైతులకు 90 శాతం సబ్సిడీని ప్రభుత్వం కల్పిస్తున్నది. రైతులు  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

-పరశురాంనాయక్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిlogo