మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sangareddy - Aug 05, 2020 , 00:21:10

సివిల్స్‌లో మెరిసిన మకరంద్‌

సివిల్స్‌లో మెరిసిన మకరంద్‌

  • ఆల్‌ ఇండియా సివిల్స్‌ ఫలితాల్లో సిద్దిపేటవాసికి 110 ర్యాంకు
  • n చిన్నతనం నుంచే మేధావి
  • n మొదటి నుంచి గణితంపై ఆసక్తి
  • n ప్రత్యేకంగా అభినందించిన మంత్రి హరీశ్‌రావు
  • n మంచి ఆఫీసర్‌గా పేరు తెచ్చుకోవాలన్నదే  ఆకాంక్ష : మకరంద్‌
  • n 516వ ర్యాంకు సాధించిన కానిస్టేబుల్‌ కుమారుడు వినయ్‌కాంత్‌

సివిల్స్‌ ఫలితాల్లో సిద్దిపేటకు చెందిన మంద మకరంద్‌ మెరిశాడు. ఆల్‌ ఇండియాలో 110వ ర్యాంకు సాధించాడు. పట్టుదలగా చదివి తన ఐఏఎస్‌ కలను సాకారం చేసుకున్నాడు. సివిల్స్‌కు ఎంపికై, జాతీయ స్థాయిలో సిద్దిపేట ఖ్యాతిని ఇనుమడింపజేశాడు. చిన్నతనం నుంచే మేధావి అయిన మకరంద్‌, సివిల్స్‌లోనూ తన ఆప్షనల్‌ సబ్జెక్టుగా గణితాన్నే ఎంచుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, వారి సంపూర్ణ సహకారం, సాధిం చాలనే తపనతో ఐఏఎస్‌ కల సాకారమైందని మకరంద్‌ తెలిపారు. మకరంద్‌కు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌లో శుభా కాంక్షలు తెలుపుతూ అభినం దించారు. అలాగే, సిద్దిపేటకు చెందిన మరో యువకుడు, కానిస్టేబుల్‌ కొడుకు వినయ్‌కాంత్‌ 516వ ర్యాంకు ను సాధించాడు. రాజ్యసభ సెక్రటేరి యట్‌లో ఏఈగా విధులు నిర్వర్తిస్తూ సివిల్స్‌కు ప్రిపేరయ్యాడు.

సిద్దిపేట కలెక్టరేట్‌ : ప్రజా సేవ చేయాలనే కోరికతో సిద్దిపేటకు చెందిన మంద మకరంద్‌ పట్టుదలగా చదివి తన ఐఏఎస్‌ కలను సాకారం చేసుకున్నాడు. మంగళవారం ప్రకటించిన సివిల్స్‌ ఫలితాల్లో మకరంద్‌ ఆల్‌ ఇండియాలో 110వ ర్యాంకు సాధించాడు. ఐఏఎస్‌గా ఎంపిక కావడంతో జాతీయ స్థాయిలో సిద్దిపేట పేరును, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపచేశాడు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీమునిమల్లారెడ్డిపేట మకరంద్‌ తల్లిదండ్రుల స్వస్థలం. 40 సంవత్సరాల కింద కుటుంబంతో సహా సిద్దిపేటలోని శ్రీనగర్‌ కాలనీకి వచ్చి స్థిరపడ్డారు. మకరంద్‌ తల్లిదండ్రులు మంద సురేశ్‌, నిర్మల ప్రభుత్వ ఉపాధ్యాయులు. తండ్రి సురేశ్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం బదన్‌కల్‌ ప్రభుత్వ పాఠశాలలో, తల్లి నిర్మల సిద్దిపేట జిల్లా కొండపాక బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. ఉన్నత విద్యావంతులే.. మకరంద్‌ చిన్నతనం నుంచే చురుకైన విద్యార్థి. మొదటి నుంచి గణితంపై ఆసక్తి కలిగి ఉన్నాడు. సివిల్స్‌లోనూ తన ఆప్షనల్‌ సబ్జెక్టుగా గణితాన్నే ఎంచుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, తపనతో ఐఏఎస్‌ కల సాకారమైందని మకరంద్‌ తెలిపారు.

మకరంద్‌ విద్యార్హతలు ..

1, 2 తరగతులు సిరిసిల్లలోని కాకతీయ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో, 3 నుంచి 8వ తరగతి వరకు సాయిగ్రేస్‌ సిద్దిపేటలో, 9, 10 తరగతులు కేకేఆర్‌ గౌతమ్‌ స్కూల్‌ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా గుడివాడలో చదివాడు. ముందు నుంచి చురుకైన, తెలివైన విద్యార్థిగా పేరు సంపాదించాడు. ఇంటర్‌ శ్రీచైతన్య కళాశాల విజయవాడలో పూర్తి చేశాడు. ఎంసెట్‌ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకును, ఐఐటీలో ఆల్‌ ఇండియాలో 11వ ర్యాంకు సాధించి బాంబె ఐఐటీలో విద్యను అభ్యసించాడు. అనంతరం బెంగుళూర్‌లోని గోల్డ్‌మెల్‌ సాక్స్‌ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ ఎనాలసిస్‌గా ఉద్యోగం చేశారు. 3 నెలల పాటు న్యూయార్క్‌లో శిక్షణ తీసుకున్నాడు. అనంతరం ఆల్‌ ఇండియా సివిల్స్‌ ప్రిపరేషన్‌ కోసం వాజిరామ్‌ అకాడమీ ఢిల్లీలో 10 నెలల పాటు కోచింగ్‌ తీసుకున్నాడు. మొదటి సారి ప్రిలిమ్స్‌లో ఆగిపోయాడు. మరింత సృజనాత్మకత  పట్టుదలతో చదివి రెండో ప్రిలిమ్స్‌ మెయిన్స్‌లో పాసై ఆల్‌ ఇండియాలో 110వ ర్యాంకు సాధించాడు.

చిన్ననాటి నుంచే బాలమేధావి ..

ఆల్‌ ఇండియాలో సివిల్స్‌ ఫలితాల్లో 110వ ర్యాంకు సాధించిన మంద మకరంద్‌ చిన్ననాడే బాల మేధావిగా గుర్తింపు పొందాడు. రెండున్నరేండ్ల వయస్సులోనే ప్రపంచ పటాన్ని చూసి, ఏ దేశం ఏ ఖండంలో ఉందో, దేశాలు, రాష్ర్టాలు, రాజాధానులు ఎక్కడెక్కడ ఉన్నాయో టక్కున చెప్పేవాడు. రాష్ట్రపతి, ప్రధానమంత్రుల పేర్లతో పాటు జాతీయ గీతాన్ని పాడేవాడు. ఇలా అనేక మందిని చిన్నతనంలోనే తన ప్రజ్ఞతో ఆకర్శించాడు. చిన్ననాడు తన అక్కయ్యతో పాఠశాలకు వెళ్లి, తిరిగి వచ్చిన తర్వాత వందేమాతరం గీతాన్ని ఆలపించి తల్లిదండ్రులను ఆశ్చర్యపర్చాడు. ఇలా ఒకసారి చూసినా, విన్నా ఇట్టే పట్టేసే  స్వభావం కలిగి ఉన్నాడు. రెండేండ్ల ప్రాయం నుంచే తన మేధస్సును వికసింపజేస్తూ పుస్తకాలపై, టీవీల్లో వచ్చే పలు అంశాలను ఒకటికి రెండు సార్లు చూసి టక్కుల చెప్పేసే వాడు. 

మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు..

సివిల్స్‌ పరీక్షలో ఆల్‌ ఇండియాలో 110వ ర్యాంకు సాధించి తెలంగాణ ఖ్యాతిని సిద్దిపేట బిడ్డగా దేశ స్థాయిలో నిలిపినందుకు సంతోషంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. 

కానిస్టేబుల్‌ కొడుకు వినయ్‌కాంత్‌కు 516వ ర్యాంకు 

సిద్దిపేటకు చెందిన మరో యువకుడు వినయ్‌కాంత్‌ ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసులో 516వ ర్యాంకును సాధించాడు. సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ కొడుకు వినయ్‌కాంత్‌ సివిల్స్‌లో 516వ ర్యాంకును సాధించాడు. ఏడాది కింద వరకు రాజ్యసభ సెక్రటరీ సెక్రటేరియట్‌లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తూ సివిల్స్‌కు ప్రిపేరై జాతీయ స్థాయిలో ర్యాంకును సాధించాడు. వినయ్‌కాంత్‌ తండ్రి శ్రీనివాస్‌ను సీపీ జోయల్‌ డెవిస్‌ అభినందించారు. వినయ్‌కాంత్‌ 1 నుంచి 10వ తరగతి వరకు సిద్దిపేట నేతాజీ పబ్లిక్‌ స్కూల్‌లో, ఇంటర్‌ గురుకృప జూనియర్‌ కళాశాల సిద్దిపేటలో, బీటెక్‌ ఎరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో, మర్రి లక్ష్మారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల దుండిగల్‌లో విద్యను అభ్యసించాడు.

మంచి ఆఫీసర్‌గా పేరు  తెచ్చుకోవాలన్నదే ఆకాంక్ష 

విద్యలో ఒకే డైరెక్షన్‌లో పోకుండా మల్టీ తరహాలో ఎదగాలన్నదే నా కోరిక. ఐఏఎస్‌గా ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. ప్రజలకు సేవ చేసి మంచి అధికారిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. సమాజానికి సేవ చేయాలనే కాంక్షతోనే సివిల్స్‌ ప్రిపేరయ్యా. 

- మకరంద్‌ 

సంతోషంగా ఉన్నది 

మకరంద్‌ చిన్నప్పటి నుంచి చురుకైన విద్యార్థి. అతడి అభిరుచులకు అనుగుణంగానే ప్రోత్సహించాం. ఐఏఎస్‌కు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. కష్టానికి ప్రతిఫలం దక్కింది. మున్ముందు ఉన్నత స్థానంలో ఉండాలి. ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థానంలో నిలువాలని ఆకాంక్షిస్తున్నాం. 

- మకరంద్‌ తల్లిదండ్రులు నిర్మల సురేశ్‌ logo