గురువారం 01 అక్టోబర్ 2020
Sangareddy - Aug 04, 2020 , 02:33:34

వేటు పడింది..

వేటు పడింది..

  •  l రుద్రారం సెక్రటరీ సస్పెన్షన్‌
  • l ‘నందన్‌'  నిర్మాణాలపై కలెక్టర్‌ చర్యలు
  •  l సర్పంచ్‌కు మరోసారి నోటీసులు
  •  l మరో కార్యదర్శి ఎంఏ రహీంపై కూడా సస్పెన్షన్‌ వేటు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అక్రమ నిర్మాణాల విషయంలో సీరియస్‌గా వ్యవరిస్తున్న కలెక్టర్‌ హనుమంతరావు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పటాన్‌చెరు మండ లం రుద్రారం ఎలాంటి అనుమతి లేకుండా వంద ఎకరాల్లో నందన్‌ పేరిట వెంచర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న కలెక్టర్‌ విచారణ జరిపి ఆ వెంచర్‌లోని నిర్మాణాలను మూడు రోజుల క్రితం కూల్చివేయించిన విషయం కూడా విదితమే. ఈ వ్యవహారంలో రుద్రారం గ్రామ పంచాయతీ కార్యదర్శి వీరేశంతో పాటు సర్పంచ్‌కు నోటీసులు జారీ చేశారు.  నోటీసుకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో సోమవారం కలెక్టర్‌ హనుమంతరావు వీరేశంను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా అంత భారీ స్థాయిలో వెంచర్‌ ఏర్పాటు చేసి నిర్మాణాలు చేపట్టినప్పటికీ ఎందుకు పట్టించుకోలేదో వివరణ ఇవ్వాలని పంచాయతీ సర్పంచ్‌, పాలకవర్గానికి రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా, పటాన్‌చెరు మండలం ఇంద్రేశంలో అక్రమ నిర్మాణాలను మూడు, నాలుగు రోజులుగా హెచ్‌ఎండీఏ, పంచాయతీ సిబ్బంది కూల్చివేస్తున్న విషయం తెలిసిందే...

 కందిలో అక్రమ ఇండ్ల అనుమతులపై  కార్యదర్శి సస్పెండ్‌

అక్రమ వెంచర్‌లో ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన మరో పంచాయతీ కార్యదర్శిని కూడా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. కంది గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా పని చేస్తున్న సమయంలో ఎం.ఏ.రహీం 104 ఇండ్లకు అక్రమంగా అనుమతులు ఇచ్చినట్లు కలెక్టర్‌ విచారణలో తేలింది. 

దీంతో ఆగ్రహించిన కలెక్టర్‌ రహీంను సస్పెండ్‌ చేశారు. కాగా, ప్రస్తుతం రహీం నారాయణఖేడ్‌ మండలం గంగాపూర్‌ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా ఆయన వ్యవహారశైలిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అతడిపై కలెక్టర్‌ విచారణ జరిపించగా అక్రమాలు వెలుగులోకి రావడంతో  సస్పెన్షన్‌ వేటు వేశారు. అక్రమ నిర్మాణాలపై కలెక్టర్‌ సీరియస్‌గా వ్యవరిస్తుండడంతో అటు అధికార యంత్రాంగం, పంచాయతీ స్థాయిలోని పాలకవర్గంలో కూడా గుబులు మొదలైంది.logo