శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Aug 04, 2020 , 02:33:35

పటాన్‌చెరు ఎమ్మెల్యేకు పాజిటివ్‌

పటాన్‌చెరు ఎమ్మెల్యేకు పాజిటివ్‌

  • l  అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న గూడెం మహిపాల్‌రెడ్డి
  • l త్వరగా కోలుకోవాలని ప్రజలు, కార్యకర్తలు ప్రార్థనలు, పూజలు

పటాన్‌చెరు: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొద్ది రోజులుగా ఎమ్మెల్యేకు వైరస్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, హైదరాబాద్‌లోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యేకు ప్రైమరీ కాంటాక్ట్‌ ఉన్న కుటుంబ సభ్యులకు, వ్యక్తిగత పీఏ, డైవర్లను కూడా పరీక్షలు చేస్తే ఎమ్మెల్యే తల్లి మణేమ్మ, సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి, పీఏ వినోద్‌, డ్రైవర్‌ కిరణ్‌లకు ఆదివారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. మొత్తం ఐదుగురికి కరోనా సోకింది. దీంతో వారికి కూడా చికిత్సను అందజేస్తున్నారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు.  ఎమ్మెల్యేతో ఎక్కువగా కాంటాక్ట్‌లో ఉన్న నాయకులు, సిబ్బంది కూడా పరీక్షలు చేయించుకుంటున్నారు. వారిని గుర్తించే పనిలో వైద్యాధికారులున్నారు. 

నిరంతరం ప్రజల్లోనే..

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలోనూ నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. కొవిడ్‌తో పనులు కరువై బాధపడుతున్న కుటుంబాలకు ఆర్థికసాయం చేయడంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పెద్దఎత్తున ఆయన అనుచరులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కలిసి వేలాదిమందిని కరోనా కష్టకాలంలో ఆదుకున్నారు. ఎమ్మెల్యే కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ పటాన్‌చెరు నియోజకవర్గంలో కరోనా సోకకుండా నిరంతరం పారిశుధ్య పనులు చేయించారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆగకుండా చర్యలు తీసుకునేవారు. ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ అని తెలుసుకున్న ప్రజలు ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే త్వరగా ఆరోగ్యవంతుడు కావాలని ఆకాంక్షిస్తున్నారు.

నేను క్షేమంగా ఉన్నా..

నేను క్షేమంగానే ఉన్నాను. నా ఆరోగ్య విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు రోజుల క్రితం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. నా కుటుంబ సభ్యులకు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అందరం చికిత్స పొందుతున్నాం. నేను నగరంలోని ఓ ప్రముఖ దవాఖానలో చికిత్స పొందుతున్న. నా ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రజలు, నాయకులు, టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. నేను త్వరలోనే మీ అందరి ఆశీస్సులతో, డాక్టర్ల వైద్య చికిత్సలతో కోలుకొని సంపూర్ణమైన ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను. ప్రజలు ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటిస్తూ, భౌతికదూరం పాటించాలి. మాస్కులు విధిగా ధరించండి.


logo