మంగళవారం 27 అక్టోబర్ 2020
Sangareddy - Aug 02, 2020 , 23:15:02

అభివృద్ధికి చిరునామా టీఆర్‌ఎస్‌

 అభివృద్ధికి చిరునామా టీఆర్‌ఎస్‌

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధికి చిరునామా టీఆర్‌ఎస్‌ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధితో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు దాదాపుగా కనుమరుగు అయ్యాయి. అన్ని వర్గాల సంక్షేమం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే సాధ్యమని. దీనిపై ప్రజలకు పూర్తి నమ్మకం వచ్చిందని మంత్రి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌  నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతాంగ సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ కొత్త చట్టాలను తీసుకురావడంతో పట్టణాలు, గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయని అన్నారు. డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తయి ఎరువులు తయారు చేస్తున్నారు. వైకుంఠధామాల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. రైతుల సంక్షేమ లక్ష్యంగా రైతు వేదికల నిర్మాణం కొనసాగుతున్నది. ఇంతటి అభివృద్ధి గతంలో ఎప్పుడు చూడలేదని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. కరోనా నేపథ్యంలో ఎంత ఇబ్బందులున్నా, సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. ఉచిత రేషన్‌ బియ్యం అందిస్తున్నామని, అర్హులైన వారిని పింఛన్లు అందిస్తున్నామన్నారు. చిన్న అభివృద్ధి పనికి గతంలో ఏండ్లు వేచిచూడాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. జడ్పీటీసీ పద్మావతి పాండురంగం, కాంగ్రెస్‌ పార్టీ కొండాపూర్‌ మండల అధ్యక్షుడు నగేశ్‌, మల్లెపల్లి సర్పంచ్‌ శివలీలా జగదీశ్వర్‌, హరిదాసుపూర్‌ సర్పంచ్‌ షఫీ, కోనాపూర్‌ సర్పంచ్‌ మాణయ్య, మాన్సాన్‌పల్లి సర్పంచ్‌ నర్సింహులు, శివన్నగూడెం సర్పంచ్‌ అమ్రీన్‌, ఆయా పంచాయతీల వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విఠల్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ మాజీ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు అమీరొద్దీన్‌, ఎంపీటీసీలు గోవర్థన్‌రెడ్డి, రాందాస్‌, నాయకులు రాంచందర్‌, ప్రకాశ్‌, అక్బరుద్దీన్‌, రాములు, అనంతరెడ్డి, శివరాజ్‌, సత్యాగౌడ్‌, చక్రనాయక్‌, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo