శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Sangareddy - Aug 02, 2020 , 23:15:03

‘కిట్ల’ దాతలు.. ప్రాణదాతలు

‘కిట్ల’ దాతలు.. ప్రాణదాతలు

  •  వైద్యసిబ్బంది రోగులతో పాటే జీవిస్తున్నారు
  • బాధితులకు అండగా నిలుద్దాం
  • సామాజిక బహిష్కరణలు సరైనవి కావు
  •  ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

 పటాన్‌చెరు : సంగారెడ్డి జిల్లాలో వైద్య సేవలకోసం రెండు వేల ఎన్‌ 95 మాస్కులు, 5 వందల పీపీఈ కిట్లను  పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లోని మహేశ్వర మెడికల్‌ కళాశాల యాజమాన్యం మంత్రి హరీశ్‌రావుకు ఆదివారం హైదరాబాద్‌ నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మహేశ్వర మెడికల్‌ కళాశాల ప్రతినిధులు డాక్టర్‌ సరిత, డాక్టర్‌ కృష్ణారావును అభినందించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ..  కిట్ల దాతలు  ప్రాణదాతలన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు స్వచ్ఛందంగా పలు సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. మహేశ్వర కళాశాల యాజమాన్యం చేస్తున్న సాయంతో ఈ ప్రాంతంలోని వైద్యాధికారులకు రక్షణ లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు సమాజహితాన్ని బాధ్యతగా చూడాలన్నారు. కరోనాకు ముందు, తరువాత అన్నట్టుగా పరిస్థితులు ప్రపంచంలో మారాయన్నారు. కంటికి కనిపించని సూక్ష్మక్రిమి ఇప్పుడు వైరస్‌గా మారి ప్రపంచాన్నే భయపెడుతున్నదని, కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం, వైద్యాధికారులు సూచిస్తున్న పద్ధతులను పాటించాలని మంత్రి సూచించారు. నేడు పలు గ్రామాల్లో, కాలనీల్లో కరోనా వచ్చిన వారిని బహిష్కరిస్తున్నారని, సహాయ నిరాకరణ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయని తెలిపారు. కొందరు కిరాయికి ఉంటే ఇండ్లు ఖాళీ చేయిస్తున్నారని, ఇది దురదృష్టకరమైన విషయం అన్నారు. కరోనా రావాలని ఎవరూ కోరుకోరన్నారు. పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నా, కొన్నిమార్లు కరోనా రావొచ్చన్నారు. ఇలాంటి వారికి ఆరోగ్యకరమైన చికిత్స అందజేస్తూనే, వారికి అండగా నిలువాల్సిన బాధ్యత సమాజానికి ఉందన్నారు. సామాజిక బహిష్కరణ సరికాదు అని గుర్తించాలన్నారు. డాక్టర్లు ఇప్పుడు కరోనా రోగులతో నిత్యం జీవిస్తున్నారని గ్రహించాలన్నారు. వైద్యులు అందజేస్తున్న సేవలకు మనం అందరం అండగా నిలుద్దామన్నారు. దాతలు అందజేస్తున్న సాయం డాక్టర్లకు, రోగులకు ఉపయోగకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో మహేశ్వర కళాశాల వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.logo