గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Aug 02, 2020 , 23:15:14

రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

  • కరోనా బాధితులు ఆత్మవిశ్వాసంతో ఉండాలి 
  • కొవిడ్‌ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌ హనుమంతరావు
  • సేవలు, చికిత్సలు, మందులు, భోజనంపై ఆరా..

సంగారెడ్డి మున్సిపాలిటీ: కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులతో వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ హనుమంతరావు వైద్యులకు సూచించారు. ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని కొవిడ్‌ వార్డులో పేషెంట్లకు అందుతున్న సేవలు, సౌకర్యాలు, ఆహారం, చికిత్సలు, మందులు తదితర విషయాలపై కలెక్టర్‌ ఆరా తీశారు. పేషెంట్లకు వేడినీరు ఇస్తున్నారా.., ఎలాంటి ఆహారం ఇస్తున్నారు.. డ్రై ఫ్రూట్స్‌ అందుతున్నాయా.. ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయా.. అనే వివరాలను దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డిని అడిగి తెలుసుకున్నారు.  

ధైర్యాన్ని, ఆత్మవిశ్వాస్నా నింపాలి..

ఆందోళన, బాధతో ఉన్న కరోనా పేషెంట్లను ఆత్మీయంగా పలుకకరిస్తూ, ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని విధాలా సహకరించి, వారిలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం కరోనా పేషెంట్లు కొందరికి ఫోన్‌ చేసి ఎలా ఉన్నారు... ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది.. డాక్టర్లు బాగా చూస్తున్నారా... మందులు ఇస్తున్నారా.. భోజనం సరిగ్గా పెడుతున్నారా.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అంటూ వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూస్తామని, ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ తెలిపారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని, త్వరలో క్షేమంగా ఇంటికి వెళ్తారని వారికి మనోధైర్యాన్ని కల్పించారు. కలెక్టర్‌ వెంట దవాఖాన సూపరింటెండెంట్‌తో పాటు డాక్టర్లు, ఆర్డీవో నగేశ్‌, తహసీల్దార్‌ స్వామి తదితరులున్నారు.


logo