మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - Aug 02, 2020 , 00:25:45

అంగన్‌వాడీల్లో ఆంగ్లం

అంగన్‌వాడీల్లో ఆంగ్లం

అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఆటపాటలతో పాటు ఆంగ్లంలో విద్యను బోధిస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలను ఆయా కేంద్రాల్లో చేర్పించి వారికి ఎల్‌కేజీ, యూకేజీ విద్యను అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1076 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో 885 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 191 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాలకు వచ్చిన చిన్నారులకు ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లిష్‌ మీడియంలో బోధించాలని నిర్ణయించారు. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యను ప్రభుత్వం అందిస్తున్నది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేండ్లు నిం డిన పిల్లలను మాత్రమే ఒకటో తరగతిలో చేర్చుకోవాలి. కానీ ప్రైవేట్‌ పాఠశాలల్లో ఐదేళ్లలోపు (3-5 సంవత్సరాల) పిల్లలను పూర్వ ప్రాథమిక తరగతుల్లో చేర్చుకుంటున్నారు. 

ప్రీ స్కూళ్లుగా అంగన్‌వాడీ కేంద్రాలు..

అంగన్‌వాడీ కేంద్రాలు ప్రీ స్కూళ్లుగా మారనున్నాయి. చిన్నారుల్లో ప్రేరణ కలిగిచేందుకు కొత్త పాఠ్యాంశాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో  ‘అఆ..’లు నేర్చుకున్న పిల్లలు ఇకపై ‘ఏబీసీడీ.. వన్‌టూత్రీ’లు నేర్చుకోనున్నారు.  అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాల భవనాల్లో ప్రీ స్కూళ్లుగా నిర్వహించనున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేసి చిన్నారులకు అన్‌లైన్‌ ద్వారా ఆట, పాటలతో పాటు పాఠాలనూ బోధిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు టీశాట్‌ చానెల్‌ ద్వారా చిన్నారులకు పాఠాలు నేర్పిస్తున్నారు. అంతేకాకుండా ఇవన్నీ వీడియోల రూపంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో కూడా నిక్షిప్తంచేశారు.

చిన్నారులకు పౌష్టికాహారం..

మాతా, శిశు మరణాల రేటు తగ్గించడానికి అవసరమైన పౌష్టికాహారం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ వ్యవస్థను తీసుకువచ్చింది. పౌష్టికాహారం లోపంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడకుండా ఉండడం, వారి ఆరోగ్య స్థాయి మెరుగుపర్చడం కోసం అంగన్‌వాడీల్లో పౌష్టికాహారాన్ని అందింస్తున్నారు.  అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మూడేండ్ల లోపు 19,405 మంది పిల్లలు, మూడేళ్ల నుంచి ఆరు ఏండ్లలోపు విద్యార్థ్ధులు 19,341 మందికి రోజూ ఒక గుడ్డు చొప్పున నెలకు 30, పనిదినాల్లో 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల నూనె, 25 గ్రాముల కూరగాయలు, ఆకు కూరలతో ఒక పూట సంపూర్ణ భోజనం పెడుతున్నారు. 


logo