బుధవారం 05 ఆగస్టు 2020
Sangareddy - Jul 31, 2020 , 23:49:06

షోకాజ్‌ నోటీసు ఇచ్చినా స్పందించరా..

షోకాజ్‌ నోటీసు ఇచ్చినా స్పందించరా..

పుల్కల్‌ : షోకాజ్‌ నోటీసు ఇచ్చినా స్పందించరా అని మండలంలోని ఇసోజిపేట సర్పంచ్‌ పంబల్ల రత్నమ్మపై కలెక్టర్‌ హనుమంతరావు ఫైర్‌ అయ్యారు. గ్రామాన్ని మూడుసార్లు సందర్శించినా..  పనితీరు మారలేదు. పనులు ఆలస్యంగా ప్రారంభించి వేగం పెంచలేదు. జిల్లాలో వైకుంఠధామాలు, శ్మశానవాటికల నిర్మాణాలు పూర్తి అవుతున్నా గ్రామంలో ఇంకా పునాదుల స్థాయిలోనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం గ్రామంలో కలెక్టర్‌ హనుమంతరావు పర్యటించి వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, హరితహారం మొక్కలను పరిశీలించారు. వైకుంఠధామం, డంపింగ్‌యార్డు పనులు అసంపూర్ణంగా ఉండటం, హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించకపోవడంతో కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. తీరు మారకుంటే సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు.  అనంతరం ముదిమానిక్యం గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి సర్పంచ్‌ మంజులకు పలు సూచనలు చేశారు.

పనులు  త్వరితగతిన పూర్తిచేయండి..

హత్నూర: మండలంలోని చింతలచెరువు, కాసాల గ్రామ శివారుల్లో చేపడుతున్న రైతు వేదిక నిర్మాణ పనులను  కలెక్టర్‌ హనుమంతరావు పరిశీలించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పనులు పూర్తిచేయాలని సూచించారు. వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డు నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయని, మిగిలిన వాటిని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.  

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

 సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటాలని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి మండలంలోని కొత్లాపూర్‌లో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ రాజర్షి షా, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బొంగుల విజయలక్ష్మీరవి, వైస్‌ చైర్‌పర్సన్‌ శంకరి లతా విజయేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు అశ్విన్‌కుమార్‌, విష్ణువర్ధన్‌, నాయకులు నక్క నాగరాజుగౌడ్‌  పాల్గొన్నారు.

నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

సంగారెడ్డి: రైతు వేదికల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ హనుమంతరావు కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కంది మండలం చిద్రుప్ప గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు సూచించారు. పనులు నాణ్యవంతంగా ఉండాలన్నారు. కాగా, నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సర్పంచ్‌ తాళ్ల జ్యోతిని కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ తాళ్ల నర్సింహాగౌడ్‌, గ్రామస్తులు తదితరులున్నారు. 


logo