శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Jul 31, 2020 , 23:21:43

ఎస్‌ఐకి నివాళులర్పించిన ఎస్పీ, పోలీసు సిబ్బంది

ఎస్‌ఐకి నివాళులర్పించిన ఎస్పీ, పోలీసు సిబ్బంది

సంగారెడ్డి టౌన్‌ : ఎస్‌ఐ ప్రభాకర్‌ సేవలు మరువలేం. కిందిస్థాయి నుంచి ఎస్‌ఐగా విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందిన ప్రభాకర్‌ మరణం తీరనిలోటని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. జోగిపేటలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూ, నాలుగు రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో వైద్యం అందించినా తగ్గకపోవడంతో గాంధీ దవాఖానకు తరలించారు. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. కాగా, శుక్రవారం ప్రభాకర్‌కు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి అధికారిక లాంఛనాలతో నివాళులు అర్పించారు. సంగారెడ్డిలోని పోలీసు మైదానంలో  ప్రభాకర్‌ మృతదేహాన్ని ఉంచి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. పోలీసులు గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పోతిరెడ్డిపల్లి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్‌ఐ ప్రభాకర్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. నివాళులు అర్పించిన వారిలో సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, జోగిపేట సీఐ శ్రీనివాస్‌, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణారెడ్డి, సంగారెడ్డి రూరల్‌ సీఐ శివ, ఆర్‌ఐలు హరిలాల్‌, కృష్ణ, సంగారెడ్డి రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌, పోలీసు అసోసియేషన్‌ అధ్యక్షుడు దుర్గారెడ్డి, కోశాధికారి ఆసీఫ్‌, ఎస్‌ఐ ప్రభాకర్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.